హైదరాబాద్, వెలుగు: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి లిఫ్ట్‌కు నీటిని తరలించే పనులకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఏదుల రిజర్వాయర్ నుంచి టన్నెల్, ప్రధాన కాలువ ఎంబార్క్‌మెంట్ ఏర్పాటు, మట్టి తవ్వకం పనులకు సంబంధించి రూ.1,800.62 కోట్లకు పరిపాలనా అనుమతులను బుధవారం మంజూరు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ పనుల బాధ్యతను నల్గొండ సీఈకి అప్పగించారు. టన్నెల్ డిజైన్స్, డ్రాయింగ్స్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్
ఏదుల నుంచి డిండి వరకు మొత్తం 27.9 కిలోమీటర్ల మేర కాల్వలు, సొరంగం పనులను చేపట్టనున్నారు. ముందుగా పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్‌ను నిర్మించి.. అక్కడకు ఏదుల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించనున్నారు. అందుకు 800 మీటర్ల మేర అప్రోచ్ కెనాల్‌ను తవ్వనున్నారు. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్ల మేర కాలువ, 16 కిలోమీటర్ల పొడవునా టన్నెల్, 3 కిలోమటర్ల కాలువ, 6.3 కిలోమీటర్ల వాగు నిర్మాణం కలిపి డిండికి లింక్ చేయనున్నారు.