- ఓఆర్ఆర్ వెంట ఇవ్వాలని సర్కారు ఆలోచన
- ఒక్కో కుటుంబానికి 150–200 చదరపు గజాలు
- ఈ నెల 26న కేబినెట్లో చర్చించాక తుది నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: మూసీ నిర్వాసితులకు ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఇండ్ల జాగాలు ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. ఇప్పటికే మూసీలో ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న నిర్వాసితులకు డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు రూ.25వేల చొప్పున నగదు, ఉపాధి కోసం రూ.2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండ్ల జాగాలు కూడా ఇవ్వాలని యోచిస్తున్న ప్రభుత్వం, ఈ నెల 26న కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. కాగా, ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 చదరపు గజాల చొప్పున ప్లాట్అందజేసే అవకాశముందని, దీని విలువ రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఉంటుందని అధికారవర్గాలు అంటున్నాయి.
700 ఎకరాలు అవసరం
మూసీ పునరుజ్జీవంలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే నిర్వాసితులకు 15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ. 8 లక్షల చొప్పున సుమారు రూ. 1200 కోట్లను మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ నుంచి హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు ఫండ్స్ బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇండ్లను వీడి వెళ్తున్న నిర్వాసితులకు ఆఫీసర్లు డబుల్ బెడ్రూంఇండ్లను అప్పగిస్తున్నారు. అటు నిర్వాసితుల సంక్షేమం కోసం సెర్ప్సీఈవో అధ్యక్షతన 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిశోర్ మెంబర్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీ ద్వారా మహిళా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల అందజేయడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు అర్హులను గుర్తిస్తున్నారు. విద్యార్థులకు సమీపంలోని స్కూళ్లు, గురుకులాల్లో ప్రవేశాలు కల్పించడంతోపాటు చిన్నారులను అంగన్ వాడీల్లో చేర్పిస్తున్నారు. ఈ చర్యలతో పలువురు నిర్వాసితులు ఇండ్లను వీడేందుకు ముందుకు వస్తున్నప్పటికీ చాలామంది సంశయిస్తున్నారు.
దీంతో నిర్వాసితులకు బంపర్ఆఫర్ ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. ఇందులో భాగంగానే రివర్బెడ్, బఫర్ జోన్లలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసేవాళ్లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నగరం నాలుగు వైపులా ఔటర్‌రింగ్ రోడ్డు వెంట ఇండ్ల జాగాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నది. కాగా, మూసీ రివర్ బెడ్ , బఫర్ జోన్ పరిధిలో దాదాపు 13 వేలకు పైగా కుటుంబాలు ఉన్నట్టు ఇప్పటికే ఆఫీసర్లు లెక్కతేల్చారు. ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 చదరపు గజాల చొప్పున అందజేసినా 600 నుంచి 700 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తున్నారు. ఒక్కో ప్లాట్ విలువ రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఉండే అవకాశమున్నందున నిర్వాసితులు మూసీ వీడేందుకు ముందుకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, ఈ నెల 26న జరగనున్న కేబినెట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.