అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు, నేరాలూ ఎక్కువే. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ నాయకత్వంలో పోలీసు యంత్రాంగం నేరస్తులను ఏరి వేసే ప్రతిజ్ఞ చేసింది. అందులో భాగంగానే ఎన్‌కౌంటర్లు చేస్తూ, విషపు కలుపు మొక్కలను పీకేస్తున్నది. యూపీ రాష్ట్రంలో వందల నేరస్తులు రాజ్యం ఏలుతున్నప్పటికీ ముక్తార్, బబ్లూ, మున్నా, వికాస్ దుబే, ప్రకాశ్ శుక్లా, రవీంద్ర కుమార్, నిర్భయ్ గుజ్జార్, దేవేంద్రుడు శర్మ, మాన్ సింగ్, బాబా, అతీఖ్ అహమ్మద్ లాంటి పలువురు భయంకర నేరస్తుల పేర్లు సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరాల ప్రకారం.. యూపీలో అత్యధికంగా నేరాలు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ప్రయాణాలు చేయడం కూడా ప్రమాదకరంగా మారిందని తెలుస్తున్నది.
ఎవరీ అతీఖ్
టాంగా నడిపే నిరుపేద కుటుంబంలో1962లో జన్మించిన అతీఖ్ అహ్మద్ జీవితం విస్తుపోయే ఎత్తు పల్లాలను చవి చూసింది. కత్తి పట్టికున్నోడు ఏ నాటికైనా అదే కత్తికి బలి కాక తప్పదనే నానుడిని నిజం అని నిరూపించారు. 1979లో తొలి హత్య కేసు నిందితుడిగా ప్రారంభమైన అతని ప్రయాణం నాలుగు దశాబ్దాలుగా గ్యాంగ్‌స్టర్, మాఫియా డాన్, రౌడీ షీటర్, పొలిటికల్ లీడర్ లాంటి పలు అవతారాలెత్తింది. అనేక క్రిమినల్ కేసులతో ఎవరికీ భయపడకుండా, అందరినీ భయపెట్టే స్థాయికి చేరి హత్యలు, హత్యాయత్నాలు, భూకబ్జాలు, కిడ్నాపులు, మోసాలు, బెదిరింపులు లాంటి పలు తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్న అతీఖ్ అహ్మద్.. ఐదుసార్లు వెస్ట్ అలహాబాదు నుంచి ఎమ్మెల్యేగా, ఒక సారి సమాజ్‌వాది పార్టీ నుంచి ఎంపీగా గెలిచి రాజకీయ నాయకుడిగా మారాడు. దాదాపు 101 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఎవరికీ భయపడకుండా తన రాక్షస క్రీడల్ని యథేచ్ఛగా కొనసాగించిన అతీఖ్ ఏ ఒక్క కేసులోనూ ఇరుక్కోకుండా చట్టాల్ని చుట్టంగా మార్చుకొని తన నేర సామ్రాజ్యాల్ని అనతి కాలంలోనే విస్తరించాడు. మాఫియా నేరాల కేంద్ర బిందువు నుంచి చట్టాలు చేసే సభల్లో సభ్యుడిగా మారి రాష్ట్రాన్ని గడగడలాడించాడు. ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో ప్రయాగ్‌రాజ్ కోర్టు అతీఖ్‌తో పాటు మరో ముగ్గురుని దోషులుగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధించింది. మాఫియా డాన్‌గా వెలిగిన అతీఖ్ గత కొన్ని రోజులుగా తన కుటుంబ రక్షణకు వేడుకునే స్థాయికి దిగజారడం ఎంతోమంది నేరస్తులకు గుణపాఠంగా నిలుస్తున్నది. 2005లో జరిగిన బీఎస్పీ శాసనసభ్యుడు రాజ్ పాల్ హత్య కేసులో సాక్షిగా నిలిచిన న్యాయవాది ఉమేష్ పాల్‌ను 24 ఫిబ్రవరి 2023న ప్రయాగ్‌రాజ్ నివాసంలో పట్టపగలు దారుణంగా కాల్పులు జరిపి హత్య చేశారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా చనిపోవడంతో యోగీ పోలీసు యంత్రాంగం ఆవేశం కట్టలు తెంచుకొని అతని అంతానికి వలలు పన్నడం ప్రారంభించింది.
యోగీ సర్కారుపై ప్రశంసలు, విమర్శలు
యోగీ ప్రభుత్వ ఎన్‌కౌంటర్ చికిత్సతో మాఫియా వెన్నులో వణుకు పుట్టింది. మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ డాన్‌లు, గూండాలు, రౌడీలు, నేరస్థులను ఉపేక్షించేది లేదని యోగీ పలు మార్లు ప్రకటించారు. అతీఖ్ ఎన్‌కౌంటర్ ఉదంతం ప్రజాస్వామ్య విలువలకు, చట్టాలకు, మానవ హక్కులకు వ్యతిరేకమని, ప్రభుత్వం చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నదనే గళాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి గ్యాంగ్‌స్టర్ల విధ్వంసకర హత్యలతో ఆస్తి ప్రాణ నష్టం పొందిన కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేయడం, యోగీ పోలీసు యంత్రాంగాలను ప్రశంసించడం కూడా చూస్తున్నాం. ముల్లును ముల్లుతోనే తీయడమనే విధానం నేడు పలు చర్చలకు దారి తీస్తున్నప్పటికీ, పట్టపగలు అనేక హత్యలు చేయించిన నీచులకు సత్వరమే శిక్షలు అమలు అయ్యే
రోజులు రావాలని కోరుకుందాం.
వేల సంఖ్యలో ఎన్కౌంటర్స్
ఉత్తరప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు11 వేల ఎన్‌కౌంటర్లు జరిగాయని, ఇందులో పేరు మోసిన నేర చరిత్ర కలిగిన183 మంది మరణించారని తెలుస్తున్నది. రాష్ట్ర పోలీసులపై కాల్పులు జరపడం, అరెస్టయిన వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం లాంటి ఘటనల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేయడం అనివార్యమైందని యూపీ పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. యూపీలోని మీరట్ ప్రాంతం రౌడీయిజానికి కేంద్రంగా ఉండేది. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో అత్యధికంగా 3,205 ఎన్‌కౌంటర్లలో 64 మంది మరణించినట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు 23,300 మంది నేరస్థులను యోగీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ మొత్తం ఎన్‌కౌంటర్లలో 1,443 మంది పోలీసులు గాయపడగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పౌర హక్కుల పరిరక్షణ సంఘాలు, పౌర సమాజం కూడా యూపీ ఎన్‌కౌంటర్ల పట్ల ఆవేదనను వ్యక్తం చేయడం, కోర్టుల్లో పిల్స్ దాఖలు చేయడం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు యూపీలో జరిగిన183 ఎన్‌కౌంటర్ కేసులను క్షుణ్ణంగా విచారించాలని అడ్వకేట్ విశాల్ తివారీ పిల్ వేశారు.
రాజకీయ ముసుగులోగ్యాంగ్‌స్టర్ల దందాలు
13 ఏప్రిల్ 2023న యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు రాజకీయ నాయకుడుగా మారిన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‍ను, అతని అనుచరుడు గులామ్‌ను ఝాన్సీ సమీపంలో ఎన్‌కౌంటర్ చేశారు. అసద్ అహ్మద్, గులామ్ ద్వయం గతంలో ఉమేశ్‌పాల్ హత్యలో నిందితులుగా ఉన్నారు. ఇదే క్రమంలో పలు కేసుల్లో నిందితుడిగా అరెస్టైన అతీఖ్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్‍లకు బేడీలు వేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్న సందర్భంగా ప్రయాగ్‌రాజ్ నగరంలో 15 ఏప్రిల్ 2023న మీడియా ముసుగులో వచ్చిన లవ్‌లేష్ తివారీ, సన్నీనా సింగ్, అరుణ్ మౌర్య అనే ముగ్గురు వ్యక్తులు అతీఖ్, అష్రఫ్‌లను ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. అసద్, అష్రఫ్‌లతో పాటు ప్రమాదకర గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ కూడా వరుసగా ఎన్‌కౌంటర్ కావడంతో యూపీలో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. 1989లో నాటి సీఎంతో తన కుక్కకు షేక్ హ్యాండ్ ఇప్పించుకున్న అతీఖ్ అహ్మద్ చివరకు పోలీసు సమక్షంలో మీడియా కెమెరా కళ్ల ముందే నడి రోడ్డుపై హత్యకు గురికావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.