బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అక్రమ కేసులు

బాసర ట్రిపుల్ ఐటీలో తమ హక్కుల కోసం పోరాడిన విద్యార్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడ జరుగుతున్న దారుణాలను కప్పిపెడుతూ.. నిజాన్ని వెలుగులోకి తేవడానికి వెళ్తే నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..ఈ యువతే మీ పతనానికి సైనికులై కదులుతారు..ఖబడ్దార్ అంటూ ట్వీట్ చేశారు. 

కాగా మంగళవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్​ ఐటీ​లో మరో దారుణం జరిగింది. ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి తండాకు చెందిన రాథోడ్ సురేశ్ అనే స్టూడెంట్ హాస్టల్ ​రూంలో ఫ్యాన్ ​కు ఉరేసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం టైంలో తాము హాస్టల్ రూంకు వెళ్లగా.. సురేశ్ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించాడని తోటి స్టూడెంట్లు వెల్లడించారు. వర్సిటీ ఆఫీసర్లకు విషయం చెప్పినా గంటన్నరదాకా ఎవరూ రాలేదని, క్యాంపస్ లో అంబులెన్స్ కూడా లేదన్నారు. 

క్యాంపస్ ఆసుపత్రిలో సరైన సౌలతులు, మందులు అందుబాటులో ఉంటే సురేశ్ బతికేవాడని స్టూడెంట్లు అంటున్నారు. ఆసపత్రిలో సౌలతులు కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ 1, ఈ 2, ఈ 4 స్టూడెంట్లు మౌనదీక్ష చేపట్టారు. క్యాంపస్ లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.