సామాజిక శాస్త్రానికి విలువివ్వాలి

సామాజిక శాస్త్రానికి విలువివ్వాలి

సమాజంలో మానవ మనుగడ గూర్చి క్లుప్తంగా వివరించేది సామాజిక శాస్త్రం. మానవుల మధ్య సంబంధాలు, సంప్రదాయాలు, సంస్కృతీ, కట్టుబాట్లను తెలుపుతూ పరిణామ క్రమంలో భాగంగా సామాజిక పరిణతి ఎలా చెందుతుంది? బంధాలు అనుబంధాల వల్ల కలిగే లాభాలేంటి? పరిస్థితులను బట్టి మనిషి ఆలోచనారీతిలో మార్పులెలా వస్తాయి.  వాటినెలా నియంత్రించుకోవాలి? అసలు మనిషి మనిషిలా జీవించడానికి ఏం చేయాలి? అని తెలియజేసేదే సామాజిక శాస్త్రం. ఈ శాస్త్ర అవసరం సమాజంలో ప్రతిఒక్కరికి ఉంటుంది.

పోటీ ప్రపంచంలో  పిల్లలను సైతం పుస్తకాలను బట్టి పట్టే మిషన్​లా తయారుచేస్తూ  ర్యాంకులు, మార్కులంటూ వారిపై ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులెందరో ఉన్నారు. చదువంటే సైన్స్, మ్యాథ్స్ అనేలా ఇంజినీర్స్,  డాక్టర్స్ కావడమే లక్ష్యంగా చేసుకొని చదువులు చదవడం మూలంగా ఆర్ట్స్ లాంటి కోర్సులకు క్రమంగా ప్రాధాన్యత తగ్గుతున్నది.  విద్యార్థి దశలోనే తీవ్ర ఒత్తిడికి లోనవుతూ, పరీక్షలలో అనుకున్నన్ని మార్కులు రాలేక, పోటీ పరీక్షలలో సరైన ర్యాంక్ రాక,  విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి  వెనుకాడటం లేదు .

ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్ట స్థానం ఉంది. దీనికి కారణం మనదేశంలోని సంస్కృతీ, సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, జానపదరీతులు, భిన్నత్వంలో ఏకత్వాన్నీ కలిగి ఉండటమే. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం. సమాజ పరిణామ దశలను, సమాజంలోని మానవ సంబంధాలను, సమాజ మనుగడను, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలను వివరిస్తుంది. సమాజ మనుగడ సక్రమంగా, సరైన రీతిలో కొనసాగాలంటే సమాజంలోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీకరణ,  సామాజీకరణ ఏవిధంగా జరుగుతుందో తెలుపుతుంది.  ప్రపంచీకరణలో భాగంగా పాశ్చాత్యీకరణ మూలంగా క్రమేణా మనదేశ ఆచారాలు, సంస్కృతి మార్పులకు గురవుతుండడం మూలంగా విద్యావ్యవస్థలో సైతం సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కనుమరుగవుతుంది. రాబోయేకాలంలో మనదేశంలో  పెనుమార్పులు సంభవించి పల్లె,  పట్టణ సంస్కృతి  మనదేశ ఆచార సంప్రదాయాలు రాబోయే తరానికి తెలుసుకునే అవకాశం కూడా కనుమరుగవు
తుందా? అనే అనుమానం కలుగకమానదు. 

పోటీ పరీక్షలకు తప్ప, సామాజిక విద్య పట్టదా?

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పెనుమార్పులు సంభవించి, రోజుకో ఆవిష్కరణతో శారీరక శ్రమకంటే మానసిక ఆలోచనకే ఎక్కువ విలువనిస్తున్న నేటి ప్రపంచీకరణలో, టెక్నాలజీకి సంబంధించిన పలురకాల నూతన కోర్సులు పుట్టుకొచ్చాయి. ఆంగ్లేయుల బారినుంచి మనదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహనీయులను మరువకుండా, వారిని విద్యలో భాగంగా ప్రతి ఒక్కరం నేర్చుకుంటూనే ఉన్నాము. అలాగే మన ఉమ్మడి కుటుంబాలు, మన విలువలు, సంప్రదాయాలు,  జానపద రీతులు, సంస్కృతిలో పలుమార్పులు సంభవించినప్పటికీ వాటివలన మనకు కలిగిన ఉపయోగం, గౌరవాన్ని రాబోయే తరాలవారికి అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సివిల్స్​లో సామాజిక శాస్త్రం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండటంతో అన్ని కళాశాలల్లో  సమాజ శాస్త్రాన్ని బోధనాంశంగా పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. కానీ, సంవత్సరాలు గడుస్తున్నా ముందుకు సాగడంలేదు. అలాగే రాష్ట్రస్థాయిలో గ్రూప్స్ లాంటి  పోటీ పరీక్షల్లో సామాజిక శాస్త్రానికి సంబంధించిన పలుప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఉపాధ్యాయ  విద్యా కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ఒక సబ్జెక్టును కేటాయించినప్పటికీ, బోధన సిబ్బంది కొరతతో విద్యార్థులకు దాని ప్రాముఖ్యత తెలవకుండా పోతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలి

నేడు ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, మనదేశ సంస్కృతిలో సైతం పెనుమార్పులు సంభవించి, మన ఆచారాలు, కట్టుబాట్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ తరుణంలో వాటి గురించి తెలుసుకునే అవకాశాన్ని  ప్రతి విద్యార్థికి కల్పించాలి. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దానికి తగిన ప్రాధాన్యతను కల్పించడంలో భాగంగా ప్రతి విద్యార్థిని సామాజిక శాస్త్రం వైపు ప్రోత్సహించాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాజానికి, భావితరాలకు మార్గనిర్దేశం చేసే కోర్సులను గుర్తించడానికి ఒక కమిటీని వేసి, ఆ  కోర్సులకు జీవం పోయాలి.


 - డా. పోలం సైదులు ముదిరాజ్