- సిరొంచలో 'కాళేశ్వరం' ముంపు భూములకు డబ్బులిచ్చేందుకు తెలంగాణ సర్కారు రెడీ
- ఎకరాకు రూ.11.40 లక్షలు చెల్లించనున్న ప్రభుత్వం
- తెలంగాణలో ముంపునకు గురవుతున్న 40 వేలకు పైగా ఎకరాలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తలేరు
మంచిర్యాల, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో మూడు జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు మునుగుతున్నా మన రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు మహారాష్ర్ట పరిధిలో మునుగుతున్న భూములను పూర్తిస్థాయిలో సేకరించేందుకు మాత్రం గ్రీన్సిగ్నల్ఇచ్చింది. సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.11.40 లక్షలు, బీడు భూములకు రూ.10 లక్షలు చెల్లించడానికి తెలంగాణ సర్కారు ఒప్పుకుందని, త్వరలోనే పరిహారం పైసలు అందజేస్తామని మహారాష్ర్ట అధికారులు అక్కడి ముంపు రైతులకు తెలిపారు. దీంతో 'మహా’ రైతులపై వల్లమాలిన ప్రేమ చూపుతున్న మన ప్రభుత్వం సొంత రాష్ర్టంలోని తమ గోడును మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఈ ప్రాంత రైతులు మండిపడుతున్నారు.
ఫలించిన 'మహా' రైతుల పోరాటం..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో మహారాష్ర్ట వైపు మునిగిపోతున్న భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. బ్యారేజీలో ఫుల్ రిజర్వాయర్ లెవెల్(ఎఫ్ఆర్ఎల్) నీటిని నిల్వ చేయడంతో ముంపు విస్తీర్ణం మరింత పెరిగింది. సిరొంచ తాలూకాలోని సిరొంచ, పోచంపల్లి, మద్దికుంట, అంకీస, అరుడ, జానంపల్లి, రాజన్నపల్లి, చింతలపల్లి, కారస్పల్లి, రామకృష్ణాపూర్, ముగాపూర్, మృదుకృష్ణాపూర్ ఇలా మొత్తం12 గ్రామాల్లో పంటలు మునుగుతున్నాయి. ఈ భూములను సైతం ప్రభుత్వం సేకరించాలని, ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని రైతులు నాలుగేండ్లుగా పోరాడుతున్నారు. ఇటు తెలంగాణ, అటు మహారాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ముంపు రైతులు సంఘటితమై దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సిరొంచలో 36 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. డిసెంబర్లో నాగ్‌పూర్‌లో మహారాష్ర్ట అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో మూడు రోజుల పాటు అసెంబ్లీ ఎదుట దీక్షలు నిర్వహించారు. దీంతో మహారాష్ర్ట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించి ముంపు రైతులకు పరిహారం అందిస్తామని డిసెంబర్22న హామీ ఇచ్చారు. ఈ నెల 6న గడ్చిరోలి కలెక్టర్ సంజయ్‌మీనా సిరొంచ తహసీల్దార్ఆఫీసులో రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపగా పరిహారం చెల్లించడానికి ఒప్పుకున్నట్టు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో ఎఫ్ఆర్ఎల్ వరకు నిల్వ చేసినప్పుడు సుమారు వెయ్యి ఎకరాలు మునుగుతున్నట్టు సర్వేలో తేల్చారు.
సొంత రైతుల గోడు పట్టని సర్కారు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌వాటర్‌తో మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సుమారు 40 వేల ఎకరాలకు పైగా పంటలు మునుగుతున్నాయి. బ్యారేజీల నిర్మాణ సమయంలో లోకల్ స్ర్టీమ్స్, క్యాచ్మెంట్ఏరియాల నుంచి వచ్చే వరద నీటి సామర్థ్యాన్ని అధికారులు గుర్తించకుండా, కేవలం గోదావరి వరద నీటినే పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత వరద ఉధృతి పెరిగినప్పుడు బ్యారేజీల గేట్లు ఓపెన్చేయడంతో బ్యాక్వాటర్సమస్య ఏర్పడి వేల ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయి. నాలుగేండ్లుగా రైతులు ఏటా వందల కోట్ల విలువైన పంటలను కోల్పోతున్నారు. ఈ భూములను సర్వే చేసి ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని, పంటనష్టం ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
నిరుడు హైదరాబాద్ ఇందిరాపార్క్దగ్గర ముంపు రైతులతో ధర్నా చేయడంతో పాటు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ఆధ్వర్యంలో అన్నారం నుంచి కలెక్టరేట్‌వరకు మూడు రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు. అయినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం ముంపు రైతుల గోడు పట్టించుకోకపోగా, కనీసం పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. రెండు నెలల కింద కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌వాటర్ ముంపు విస్తీర్ణంపై సర్వే నిర్వహించినప్పటికీ ఆ రిపోర్టును బయటపెట్టడం లేదు. కేవలం ఫుల్ రిజర్వాయర్ లెవెల్వరకు నీళ్లు నిల్వ ఉన్నప్పుడు మునిగిపోయే భూములను మాత్రమే ముంపు భూములుగా పరిగణిస్తూ గవర్నమెంట్‌కు రిపోర్టు పంపినట్టు సమాచారం. దీంతో 'మహా' రైతులకు ఒక న్యాయం...మాకొక న్యాయమా? అని ముంపు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
నాలుగు ఎకరాలు మునిగింది..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మాకు కష్టాలు మొదలైనయ్. నాకున్న నాలుగెకరాల భూమి ఏటా బ్యాక్‌వాటర్‌లో నీట మునుగుతోంది. రెండు నెలల కిందట ఆఫీసర్లు సర్వే చేసిన్రు. మూడు గుంటలు మాత్రమే మునుగుతుందని బండలు పాతిన్రు. పరిహారం ఎంతిస్తరో చెప్తలేరు. గింత అన్యాయం ఉంటదా? మొత్తం నాలుగెకరాలు ముంపుగా గుర్తించి ఎకరానికి రూ.20 లక్షలు ఇయ్యాలె. - కోరల్ల రవీందర్‌రెడ్డి,
బబ్బెరచెల్క, మంచిర్యాల జిల్లా ఎకరానికి రూ.20 లక్షలు ఇయ్యాలె...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మాకు చుక్క నీళ్లు రాకపోగా, వందల ఎకరాల భూములు మునుగుతున్నయ్. బ్యాక్‌వాటర్ కారణంగా ప్రతి ఏటా రెండుసార్లు పంటలు దెబ్బతింటున్నయి. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో అప్పులపాలై అవస్థలు పడుతున్నం. ముంపు భూములకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించి ప్రభుత్వమే సేకరించాలని డిమాండ్ చేస్తున్నాం. సుంకరి మహేశ్,మల్లారం, పెద్దపల్లి జిల్లా