సర్కార్ స్పందించకపోతే ఎమర్జెన్సీ డ్యూటీలు బంజేస్తం

  • సర్కార్ స్పందించకపోతే ఎమర్జెన్సీ డ్యూటీలు బంజేస్తం
  • సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల హెచ్చరిక 

పద్మారావునగర్, వెలుగు: మూడ్రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ డిమాండ్లపై సర్కార్ స్పందించడం లేదని ప్రభుత్వ దవాఖానల్లో పని చేస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓపీ విధులు బహిష్కరించి గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా చేశారు. గాంధీతో పాటు ఉస్మానియా, నిలోఫర్​, సరోజిని దేవి కంటి ఆస్పత్రికి చెందిన డాక్టర్లు పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సర్కార్ స్పందించకపోతే ఎమర్జెన్సీ డ్యూటీలు కూడా బంజేస్తామని హెచ్చరించారు. ‘‘8 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. మే నెల స్టైఫండ్​ కూడా ఇవ్వలేదు. ఇంటి అద్దెకు, నిత్యావసరాల కొనుగోలుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. కరోనా టైమ్ లో తాము డ్యూటీ చేసిన 3 నెలల కాలాన్ని అకడమిక్​ పీరియడ్ లో లెక్కిస్తామని చెప్పిన అధికారులు.. ఇప్పుడు మాట మార్చారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు రాజీవ్​, కీర్తి స్వరూప్, నిత్య, రాజు తదితరులు పాల్గొన్నారు.