ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై నియంత్ర‌ణేది?

అనేక నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తూ స్కూళ్ల‌ను న‌డిపిస్తున్న పాఠ‌శాల‌ల‌పై విద్యాశాఖ ఎలంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. చాలా పాఠ‌శాల‌లు క‌నీస విద్యా నిబంధ‌న‌లు పాటించ‌కుండానే ర‌న్ చేస్తున్నారు.  అయితే కేవ‌లం రిజల్ట్స్​‌ను ప్ర‌చారం చేసుకుంటున్న పాఠ‌శాల‌లు ఇష్టా రాజ్యంగా ఫీజులను ఏడాదికేడాది పెంచుతూ పోతుండ‌టం గ‌మ‌నార్హం. ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రుల‌కు ముంద‌స్తుగా ఎలాంటి స‌మాచారం కూడా ఇవ్వ‌డం లేదు. ఇష్ట‌ముంటే చ‌ద‌వించండి లేదంటే వెళ్లిపొండనే రీతిలో యాజ‌మాన్యాలు వ్యవహరిస్తుండటం గ‌మ‌నార్హం.  

వాస్త ‌వానికి ఫీజుల నియంత్ర‌ణ‌కు విద్యా శాఖ అధికారులు చ‌ర్యలు  తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవ‌డం లేదు. ఫీజుల పెంపు ఇష్టారాజ్యంగా మారింది. ప్రైవేట్ పాఠశాలలో సౌకర్యాలను బట్టి ఫీజులు ఉండాలనేది గ‌తంలో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయుల జీతాలు కలిపి 90 శాతంగా లెక్క వేసి మిగిలిన 10 శాతం పాఠశాల లాభంగా నిర్ణయించారు. ఫీజుల అమ‌లు ఎలా ఉంద‌నే విషయంపై విద్యాశాఖ అధికారుల తనిఖీల ద్వారా నియంత్ర‌ణ చేయాల్సి ఉంటది. 

కానీ వాస్తవంలో అలా జ‌ర‌గ‌డంలేదు. గతంలో ఫీజుల నియంత్రణ కోసం వేసిన కమిటీల రిపోర్టులను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలియదు. ఇప్పటికైనా గత కమిటీలు చేసిన సిఫార్సులను ప్రభుత్వం నిక్కచ్చిగా అమలు చేయాల్సిన   అవసరం ఉంది. లేదంటే, విద్య సామాన్యులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న  నిర్లక్ష్య ధోరణి తెలంగాణకు అనర్థంగా మారుతున్నది. ఈ అనర్థాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది.

- బచ్చలి ప్రవీణ్ కుమార్​,తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం