- సబ్సిడీపై డ్రిప్ స్ప్రింక్లర్లకు రైతుల డిమాండ్
- ఇప్పటికే జిల్లాలో10 వేల ఎకరాల్లో సాగు
- 2600 ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మిర్చి, మినుములు, నువ్వులు, పల్లీలు, పండ్లు, కూరగాయలు ఇతర ఆరుతడి పంటల సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దాదాపు 10వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. అందులో 2600 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకే సబ్సిడీపై డ్రిప్ స్ప్రింక్లర్లను అందిస్తోంది. దీంతో రైతులంతా పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
రైతులకు అవగాహన
ఇటీవల కాలంలో ఆయిల్‌పామ్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు, సబ్సిడీలు ఉండటంతో చాలా మంది రైతులు పామ్ ఆయిల్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మిర్చి, మినుములు, నువ్వులు, పల్లీలు పండించే రైతులు కూడా ఆరుతడి సాగు
వైపు మర్లుతున్నారు.
సర్కార్ ఆయిల్ పామ్‌కు ప్రాధాన్యం..
నూనెల వాడకం పెరిగిపోవడంతో విదేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని, దీంతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అవసరం పెరిగిందని అధికారులు అంటున్నారు.దీంతో ఈ పంటకు ప్రధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
రైతులకు శిక్షణ
ఆయిల్ పామ్ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌పై శిక్షణ ఇచ్చింది. దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై, విత్తనాలపై సబ్సిడీ అందించింది. గతంలో కూడా ఆరుతడి పంటలు వేసే రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ కోసం స్ప్రింక్లర్లను సబ్సిడీ పై అందజేశారు. కానీ, ప్రస్తుతం హార్టికల్చర్ డిపార్ట్మెంటు అధికారులు కేవలం ఆయిల్ పామ్ రైతులకు మాత్రమే సబ్సిడీ అందించడంతో కొందరు రైతులు ఈ పంటపై ఆసక్తి చూసుతున్నారు.
అయితే ... ఆయిల్ పామ్ సాగుకే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అందించి ఇతర ఆరుతడి పంటలకు అందించకపోవడంతో మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరి, పత్తికే అలవాటు పడ్డ రైతులు చాలా మంది ఈ మధ్య కాలంలో తృణ ధాన్యాల పంటలు వేస్తున్నారు. కానీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రైతులంతా పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపినట్లయితే ఇతర పంటలు కనుమరుగవుతాయి.
సాగుకు ఆసరాగా డ్రిప్
డ్రిప్ ఇరిగేషన్ వల్ల నీటి వేస్టేజ్ ఉండదు. మొక్కలకు సరిపోయేంత నీరు అందడంతో పంటలు కూడా నాన్యతగా ఉంటాయి. మొదట రైతులు డ్రిప్ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపే వారు కాదు. జిల్లాలో నీరు సమృద్దిగా దొరుకుతుండటంతో వరి, మొక్కజొన్న, పత్తికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మిర్చీతో పాటు ఇతర తృణ ధాన్యాల దిగుబడి పూర్తిగా పడిపోయింది. దీంతో వ్యవసాయాధికారులు ఇటీవల కాలంలో ఫాం ఆయిల్ పంటలపై రైతులకు అవగాహన కల్పించి, సాగుచేసే రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లను సబ్సిడీలు ఇవ్వడం ప్రారంభించారు.
దీంతో రైతులు డ్రిప్పింగ్ సిట్టమ్ను వాడటం మొదలు పెట్టారు. అలాగే మిర్చీతో పాటు ఇతర తృణ ధాన్యాల పంటలకు కూడా డ్రిప్ స్ప్రింక్లర్లను సబ్సిడీ మీద ఇవ్వాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో మిర్చీతో పాటు తృణ ధాన్యాలు సాగవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి నుంచి ప్రతీ యేటా ఆయిల్ ఫాం 5000 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుత సంవత్సరం 2600 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు ప్రారంభమైంది. 1211 ఎకరాల్లో ఇప్పటికే రైతులు ఆయిల్ ఫాం పంట వేశారు, ఇందులో 1207 ఎకరాలో డ్రిప్ సాగు నడుస్తోంది. రైతులు డ్రిప్ పొందిన తర్వాతనే రైతులకు ఆయిల్‌ఫాం మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఆరుతడి పంటలన్నిటికీ డ్రిప్ సబ్సిడీ ఇయ్యాలే
ఆరుతడి పంటలన్నిటికీ డ్రిప్ స్ప్రింక్లర్లు సబ్సిడీ మీద అందియ్యాలే. ఇప్పుడు ఆయిల్ ఫాం తోటలకు డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నారు. దీని వల్ల నీటి వృధా ఉండదు, అందుకే మిర్చి, మినుములు, నువ్వులు, పండ్ల తోటలు, ఇతర ఆరుతడి పంటలకు డ్రిప్ సబ్సిడీ అందిస్తే బాగుంటది.
కొట్టె శంకర్, రైతు, కునారం, పెద్దపల్లి జిల్లా