- సీఎం ఓఎస్డీ శ్రీనివాస్
- గోశాలను సందర్శించిన అనంతరం మీడియా సమావేశం
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు పడుతున్న ఇబ్బందులపై ‘వెలుగు’లో వచ్చిన కథనాలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రాజన్న గోశాలను సందర్శించాలని అదేశించడంతో సీఎం ఓఎస్డీ శ్రీనివాస్ తిప్పాపూర్‌లోని గోశాలను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, కోడెల సంరక్షణకు చేపటాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం ఆలయ చైర్మన్ గెస్ట్‌హౌజ్‌లో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజన్న కోడెల విశిష్టత సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసని, కోడెల సంరక్షణపై ఆయన చాలాసార్లు మాట్లాడారని చెప్పారు.
కోడెల దీనస్థితిని అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్ గోశాలను సందర్శించినట్లు తెలిపారు. గోశాలలో 400 కోడెలు ఉండాల్సిన షెడ్‌లో 1500 వరకు ఉన్నాయని, అనారోగ్యం కారణంగా కోడెలు చనిపోతున్నాయని చెప్పారు. కోడెల సంరక్షణ కోసం ఇప్పుడు ఉన్న ఏడు షెడ్లతో పాటు మరో రెండు షెడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గోశాలలో ఫ్లోరింగ్‌కు ఇప్పటికే రూ. 1.11 కోట్లు మంజూరు అయ్యాయని, గోశాల అభివృద్ధికి ఎంకా ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోడెలకు పౌష్టికాహారం అందించడంతో పాటు బలహీనంగా ఉన్న వాటికి వైద్యం చేయించేందుకు వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గోశాలలోని కోడెలను మఠాలకు, గుర్తింపు పొందిన గోశాలలకు, వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గోశాలలో పర్మినెంట్‌గా వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఈవో రామకృష్ణ, ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, రామేశ్వరరావు, ఏఈవోలు హరికిషన్, జయకుమారి, ప్రతాప నవీన్, బ్రాహ్మణగారి శ్రీనివాస్, తిరుపతిరావు, నటరాజ్, నాగుల మహేశ్ పాల్గొన్నారు.