- అక్కడి హన్ నదీ అభివృద్ధి తీరును పరిశీలించేందుకు స్టడీ టూర్
- ఈ నెల 21నుంచి 24 వరకు పర్యటించనున్న నేతలు, ఆఫీసర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ నదికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఇదే తరహాలో దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలోని హన్ నదిని అభివృద్ధి చేసిన తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని సియోల్‌కు పంపుతున్నది. మూసీ మాదిరిగానే హన్ నది కూడా గతంలో మురికి కూపంగా ఉంటే అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పుడు సుందరంగా మారింది. అంతేకాకుండా సమీప ప్రాంతాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి.
మూసీ ప్రక్షాళనతో నదికి పూర్వవైభవం తేవడం, హైదరాబాద్ ను గొప్ప హెరిటేజ్ నగరంగా తీర్చిదిద్దడం, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉపాధి కల్పన, ఆదాయ మార్గాల అభివృద్ధి వంటివి చేయాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులతో కూడిన బృందం ఈ నెల 21 నుంచి 24 వరకు దక్షిణ కొరియాలోని సియోల్ నగరాన్ని సందర్శించనుంది. సియోల్ లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ఇందుకోసం బృందం సభ్యులు ఈ నెల 20న వేకువజామున హైదరాబాద్ నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరనున్నారు. తిరిగి ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు. ఈ బృందంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ కిరణ్‌కుమార్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఎం.శ్రీలతా రెడ్డి, ఐ అండ్పీఆర్ స్పెషల్ కమిషనర్ హన్మంతరావు, మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ కర్రి శ్రీరామ్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, మహ్మద్ మొబిన్, కౌసర్ మొయినుద్దీన్, మీర్ జుల్ఫికర్ అలీ, టి.రాజా సింగ్, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బిన్అబ్దుల్లా బలాలా, డి.సుధీర్‌రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఎంఆర్డీసీఎల్ ఈడీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ దత్తు పంత్, లైజన్ ఆఫీసర్ వెంకట్శేఖర్ తదితరులు ఉన్నారు.