కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు

కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు
  •     మొదలుపెట్టిన 15 రోజుల్లో 90 వేల మందితో పూర్తి చేసేలా ఏర్పాట్లు
  •     నేషనల్​ సెన్సెస్​ రీసెర్చ్​ విధానంలో నిర్వహణ
  •     భవిష్యత్​లో కోర్టులు కొట్టేయకుండా పకడ్బందీగా గణన
  •     ఎన్యూమరేటర్లుగా అన్ని శాఖల సిబ్బంది
  •     1,500 జనాభాకు పది మందితో ఒక టీమ్​ 
  •     నవంబర్​ మొదటి వారంలో ప్రారంభించే చాన్స్​

హైదరాబాద్​, వెలుగు : కుల గణనను సమగ్రంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్​ రెడీ అయింది. నవంబర్​ మొదటి వారంలో గణన మొదలుపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.  ఈ క్రమంలోనే కులం, ఉప కులం లాంటి వివరాలతోపాటు  మొత్తం 60 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మాను రెడీ చేసిన ఆఫీసర్లు.. ఆమోదం కోసం ఫైలును సీఎం రేవంత్​ రెడ్డికి  పంపించారు.  కుల గణన మొదలుపెట్టిన 15 రోజుల్లో పూర్తి చేయాలని డెడ్​లైన్​ పెట్టుకున్నారు. 

ఇందుకోసం దాదాపు 90 వేల మంది సిబ్బంది అవసరం అవుతారని, ఈ మేరకు అన్ని శాఖల నుంచి సిబ్బందిని తీసుకునే వీలు కల్పించాలని  ప్రభుత్వానికి ప్లానింగ్​ విభాగం ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదం లభించిన వెంటనే మెటీరియల్​ సిద్ధం చేసుకుని పూర్తి మార్గదర్శకాలతో ఇంటింటి కుల గణన చేపట్టనున్నారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను తీసుకోనున్నారు. కుల గణనతో జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు రాజకీయ, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రిజర్వేషన్లు 50 శాతం పెరిగినా కోర్టుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అమలు చేసుకునేలా కుల గణనను ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టాలని డిసైడ్​ అయింది.

ప్రధాన కులం, ఉపకులంతో మొదలై  ఇంట్లో ఎంత మంది ఉంటారు ? ఆధార్​ కార్డు నంబర్, సైకిల్​ ఉందా ? బైక్​ ఉందా ? కారు ఉందా ? అనే వివరాల దగ్గర నుంచి.. ఎంత భూమి ఉంది ? ఎలాంటి భూమి ఉన్నది ? ఏం పనిచేస్తారు ? ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు ? చదువు వివరాలు ఏమిటి ? అనే విషయాలను సూక్ష్మంగా తెలుసుకుంటారు. ఫ్యామిలీ చరిత్రను కూడా తీసుకుంటారు. ఎవరెవరు, ఎక్కడ, ఏం ఉద్యోగాలు చేస్తారు ? ఎలాంటి ఇండ్లలో ఉంటున్నారు ? సొంత ఇల్లా? కిరాయి ఇల్లా? బతుకుదెరువు ఏమిటి ? సంపాదన ఎంత ? కుటుంబానికి మొత్తం ఎంతొస్తుంది ? వ్యక్తిగతంగా వచ్చే ఆదాయం ఎంత? లాంటి అనేక  వివరాలను కుల గణనలో భాగంగా సేకరించనున్నారు.  

రాష్ట్రంలో కులగణనకు సెన్సస్​ యాక్ట్​ ప్రకారం రీసెర్చ్​ మెథడాలజీని తీసుకుంటున్నారు. ఇలా చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని భావిస్తున్నారు.  కర్నాటకలో కాంత రాజ్​ కమిషన్​ సమగ్ర కుటుంబ సర్వేను ఇదే పద్ధతిలో చేసింది.  కోర్టుల్లో ఎలాంటి చిక్కులు రావొద్దంటే ఇలాంటి మెథడాలజీ ప్రకారమే చేయాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్​లో సామాజికపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించిన న్యాయబద్ధమైన డేటా ఉంటే 50 శాతానికి పైగా రిజర్వేషన్లు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు సీఎంకు నివేదించారు.  ఇక కుల గణనలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తి వివరాలను సమగ్రంగా తీసుకోనున్నారు. 

అన్ని శాఖల నుంచి సిబ్బంది

గణనకు ఎంత మంది ఎన్యూమరేటర్లు అవసరం అవుతారు? ఎన్ని టీంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? ఏయే ప్రభుత్వ శాఖల నుంచి ఎన్యూమరేటర్లను తీసుకోవాలి? అనే అంశాలపై  అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ సిబ్బంది. ఏఎన్​ఎంలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నారు. మొత్తం 90 వేల మంది అవసరం పడతారని అంచనా వేస్తున్నారు.  2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకొని టీంలను, ఎన్యూమరేటర్లను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. వెయ్యి నుంచి 1500 మంది జనాభాకు ఒక టీంను ఏర్పాటు చేసి, సంబంధిత టీంలో సుమారు 10 మంది ఎన్యూమరేటర్లను నియమించడానికి ప్రయత్నిస్తున్నారు.