
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫండ్స్ కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా శనివారం జీవో 56ను జారీ చేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో క్యాంపస్ కు రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణ బాధ్యతలను విద్యా శాఖ అనుబంధ కార్పొరేషన్ టీజీఈడబ్ల్యూఐడీసీ ( తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) కు ప్రభుత్వం అప్పగించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే కొడంగల్, మధిర, హుజూర్ నగర్ లో గురుకులాల నిర్మాణానికి కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలవగా.. సింగిల్ టెండర్లు రావడంతో వాటిని రద్దు చేశారు. త్వరలో మరో సారి టెండర్లు పిలిచేందుకు అధికారులు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ మూడు క్యాంపస్ ల టెండర్లు ఫైనల్ అయ్యాక మిగతా వాటికి టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.