
- 29.73 శాతంతో అట్టడుగున మందమర్రి కాలేజీ
- మంచిర్యాల, లక్సెట్టిపేట కాలేజీల్లోనూ పూర్ రిజల్ట్
- 87.88 శాతం ఉత్తీర్ణతతో కాసిపేట ఫస్ట్
- తరువాతి స్థానాల్లో బెల్లంపల్లిలోని రెండు కాలేజీలు
మంచిర్యాల, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు డీలా పడ్డాయి. కాలేజీల్లో సరైన సౌలత్లు లేకపోవడం, లెక్చరర్ల కొరత కారణంగా మెరుగైన ఫలితాల సాధనలో వెనుకబడ్డాయి. జిల్లాలో 18 మండలాలకు గాను 10 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. ప్రైవేట్‌లో చదువుకునేంత స్తోమత లేని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు మాత్రమే వీటిలో చేరుతున్నారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఏటేటా అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన కాలేజీల్లో పరిస్థితి అధ్వానంగా మారింది.
కాసిపేట కాలేజీ టాప్
ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ జనరల్ కేటగిరీలో కాసిపేట జూనియర్ కాలేజీ టాప్‌లో నిలిచింది. ఇక్కడ 66 మంది విద్యార్థులకు58 మంది, బెల్లంపల్లి గర్ల్స్ జూనియర్ కాలేజీలో 167 మందికి 127 మంది, బెల్లంపల్లి జూనియర్ కాలేజీలో 151 మందికి 108 మంది పాసయ్యారు. వరుసగా 87.88, 76.05, 71.52 శాతం ఉత్తీర్ణతతో ఈ మూడు కాలేజీలు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాల్లో నిలిచాయి. జన్నారం జూనియర్ కాలేజీ నుంచి 138 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 97 మంది (70.29 శాతం) ఉత్తీర్ణత సాధించారు. దండేపల్లి కాలేజీలో 125 మందికి 86 మంది (68.8 శాతం), జైపూర్‌లో 107 మందికి 72 మంది (67.29 శాతం), చెన్నూర్ కాలేజీలో 114 మందికి 62 మంది (54.39 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ఆ మూడు కాలేజీలు పూర్..
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు మంద మర్రి, లక్సెట్టిపేట అర్బన్ ఏరియాల్లోని కాలేజీలు పూర్ రిజల్ట్ సాధించాయి. మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 103 మంది విద్యార్థులకు గాను 37 మంది (35.92 శాతం) మాత్రమే పాసయ్యారు. లక్సెట్టిపేట కాలేజీలో 90 మందికి 31 మంది (34.44 శాతం), మందమర్రి కాలేజీలో 74 మందికి 22 మంది (29.73 శాతం) మాత్రమే పాసయ్యారు. మంచిర్యాల, లక్సెట్టిపేట కాలేజీలు కింది నుంచి రెండు, మూడు స్థానాలకు పరిమితం కాగా, మందమర్రి కాలేజీ అట్టడుగు స్థానానికి దిగజారింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల కంటే కేజీబీవీలు మెరుగైన రిజల్ట్ సాధించాయి. సెకండియర్ ఒకేషనల్ కేటగిరీలో కాసిపేట 87.18 శాతం, బెల్లంపల్లి జీజేసీ 75.93, మంచిర్యాల 76.06, లక్సెట్టిపేట 74.63, మందమర్రి 58.62 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. జిల్లాలో 18 కేజీబీవీలు ఉండగా, జైపూర్, మందమర్రి కేజీబీవీలు వంద శాతం రిజల్ట్‌తో జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.