- అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలేని ఇంటర్ విద్య
- జూనియర్ కాలేజీల్లో అధ్వాన్నంగా ఫలితాలు
- పట్టించుకోని జిల్లా అధికారులు
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు గాడిన పడడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నాణ్యతమైన ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కాలేజీల్లో డీఐఈఓల పర్యవేక్షణ లోపం నిరుపేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇప్పటికే సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రిజల్ట్స్ సైతం అధ్వాన్నంగా మారుతున్నాయి. జిల్లాలో ఈసారి ఇంటర్ ఫస్టియర్ లో 52 శాతం, సెకండియర్ లో 58 శాతం పాస్ పర్సంటేజీ నమోదైంది.
వనపర్తి ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్న మద్దిలేటి డీఐఈఓగా ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే, ఆయన కాలేజీలోనే ఫస్టియర్ లో 11 శాతం, సెకండియర్ లో 23శాతం స్టూడెంట్లు మాత్రమే పాస్ కావడం గమనార్హం. ఈ రిజల్ట్స్ 2024–-25 విద్యాసంవత్సరం అడ్మిషన్లపై ప్రభావం చూపనున్నాయి.
పర్యవేక్షణ కరువు
నాలుగేళ్లుగా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో సీనియర్ ప్రిన్సిపాల్స్ ఇన్ చార్జి డీఐఈవోలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లు త్వరలోనే రిటైర్మెంట్అయ్యే అవకాశం ఉండడంతో ఏదో మొక్కుబడిగా పర్యవేక్షణ చేసి చేతులు దులుపుకుంటున్నారు. పైగా తమ తోటి ప్రిన్సిపాల్స్ కు అడ్మిషన్లు, రిజల్ట్స్ విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఇవ్వలేకపోతుండడంతో గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్ విద్య అస్తవ్యస్థంగా మారింది. గతేడాది స్టూడెంట్లు ఆలస్యంగా అడ్మిషన్లు తీసుకోవడంతో ఆయా సబ్జెక్టులు బోధించే గెస్ట్ లెక్చరర్ల నియామకం కూడా ఆలస్యమైంది.
దీంతో ఆ ప్రభావం రిజల్ట్స్ పై పడిందని అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో రెగ్యులర్ లెక్చరర్లతోపాటు రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీళ్లు పూర్తి స్థాయిలో విద్యాబోధనపై దృష్టి సారించకపోడంతో గెస్ట్ లెక్చరర్లపై భారం పడుతోంది. ఏడాదంతా సమయం వృథా చేసి ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్లకు షార్ట్ కట్ స్టడీ మెటీరియల్స్ ఇచ్చి బట్టీ పట్టించడం, మాస్ కాపీయింగ్ పై ఆధారపడుతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
జంబ్లింగ్ సెంటర్లలో పరీక్షలు రాసిన విద్యార్థుల రిజల్ట్స్ తక్కువగా ఉండగా, సెల్ఫ్ సెంటర్లో రాసిన వారి ఫలితాలు కాస్తా మెరుగ్గా ఉంటున్నాయనే వాదనలు లేకపోలేదు. గవర్నమెంట్ కాలేజీల్లో రాష్టస్థాయి ర్యాంకులను సాధించడాన్ని పక్కన పెట్టి కేవలం పాస్ అయితే చాలన్నట్లు అటు డీఐఈఓలు ఇటు కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు వ్యవహరిస్తుండడంతో నిరుపేద స్టూడెంట్లకు నాణ్యమైన విద్య దూరమవుతోంది.
ఇంటర్ ఫలితాలు మెరుగు పరుస్తాం
గతేడాది జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్స్ అడ్మిషన్లకు సమయంలో లేకపోవడం, హాస్టళ్లు కూడా కాస్త ఆలస్యంగా తెరవడం వల్ల స్టూడెంట్లు అడ్మిట్ కాలేదు. గెస్ట్ లెక్చరర్లు ఆలస్యంగా విధుల్లోకి తీసుకోవడంతో రిజల్ట్స్ కొంత తగ్గిన మాట వాస్తవమే. ఈ సంవత్సరం ఒక ప్రణాళిక ప్రకారం రెగ్యులర్ గా తరగతులను నిర్వహించి రిజల్ట్స్ పెంచేలా కృషి చేస్తాం.
- మద్దిలేటి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, వనపర్తి
గవర్నమెంట్ కాలేజీల్లో ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్ ఇలా...
కాలేజీ ఫస్టియర్ సెకండియర్
(శాతం) (శాతం)
వనపర్తి (బాయ్స్) 11 23
శ్రీరంగాపూర్ 12 41
పెబ్బేరు 18 29
గోపాల్ పేట 18 57
ఆత్మకూరు 20 28
కొత్తకోట 21 32
వనపర్తి (గర్ల్స్) 28 43
ఖిల్లాగణపురం 43 41
వీపనగండ్ల 44 60
వనపర్తి (ఉర్దూ మీడియం) 65 76
పెద్దమందడి 74 70
పాన్ గల్ 78 97