- అక్రమార్కులకు కళ్లెం వేసేలా కొత్త ఆర్ఓఆర్ బిల్లు
- ప్రభుత్వ , దేవాదాయ , వక్ఫ్, అటవీ భూముల లావాదేవీలకు లాక్
- ప్రతి సర్కార్ ల్యాండ్‌కు జీఐఎస్ మ్యాపింగ్.. జియో ఫెన్సింగ్
- రికార్డుల్లో మార్పులు చేసే వీల్లేకుండా సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల కబ్జాలకు, ఆ భూములను అక్రమంగా బదలాయించుకునే పద్ధతులకు ఇక ఫుల్స్టాప్ పడనుంది. రాష్ట్ర సర్కార్ తీసుకురానున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ప్రభుత్వ భూముల ట్రాన్సాక్షన్స్‌కు లాక్ పడనుంది. దీంతో పాటు ఆయా ల్యాండ్స్ ఉన్న సర్వే నంబర్లూ బ్లాక్ కానున్నాయి. ఇప్పటికే ఆర్ఓఆర్ డ్రాప్ట్ బిల్లు– 2024లో ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యుటేషన్‌కు ఎలాంటి లావాదేవీలు ఉండవని సర్కార్ స్పష్టం చేసింది.
ఒక్కసారి చట్టం చేసుకున్నాక.. దాని ఆధారంగా ఇవ్వనున్న మార్గదర్శకాల్లోనూ కఠినమైన నిబంధనలు పెట్టనున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలను అడ్డుకోవడంతో పాటు.. దేవాదాయ, అటవీ భూములు, ఇతర సర్కార్ భూములు అన్యాక్రాంతం కాకుండా పక్కా ప్లాన్ తో రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే ధరణి పోర్టల్ వచ్చాక సర్కార్ భూములు పట్టా భూములుగా మారినట్లు అధికారులు గుర్తించారు.
వీటితో పాటు వక్ఫ్, ఎండోమెంట్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా గతంలో రికార్డుల్లో ఉన్నంత.. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో లేవని తేల్చారు. ఇప్పుడు వీటన్నింటినీ సరిచేస్తూ కొత్త ఆర్ఓఆర్ చట్టం చేశాక.. పోర్టల్‌ను కూడా పూర్తిగా అప్డేట్ చేసి పేరు మార్చనున్నారు. ప్రభుత్వ సంబంధిత ప్రతి ల్యాండ్‌కు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) మ్యాపింగ్ చేయనున్నారు. అదేవిధంగా సర్వే మ్యాప్‌ల్లో స్పష్టంగా ప్రభుత్వ భూమి అని తెలిసేలా మార్కింగ్స్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు వాటికి జియో ఫెన్సింగ్ కూడా చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. రికార్డులన్నిటినీ పకడ్బందీగా నిర్వహించనున్నారు.
కేటగిరీల వారీగా స్పెషల్ రికార్డులు
వివిధ రకాలుగా ఉన్న ప్రభుత్వ భూములకు కేటగిరీల వారీగా ప్రత్యేక రికార్డులు మెయింటెన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్ఓఆర్ చట్టానికి తగ్గట్టు ఇచ్చే మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూముల దగ్గర నుంచి శిఖం ల్యాండ్స్ వరకు అన్నింటికీ దేనికదే ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో రికార్డుల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం చూస్తున్నది. ఆయా సంబంధిత డిపార్ట్మెంట్లు ఇప్పటికే రికార్డు డేటాను కలిగి ఉన్నాయి.
అయితే రెవెన్యూ, సీసీఏల్ఏ దగ్గర ఉన్న సర్వే నంబర్లు, విస్తీర్ణంతో పొంతన లేకుండా పోయాయి. దీంతో సెక్షన్ల వారీగా ఏ ల్యాండ్ ఎక్కడ ఎంత ఉంది? అసైనీలకు ఇచ్చిన భూముల పరిస్థితి ఏమిటి ? వివిధ అవసరాలకు కేటాయించిన ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి ? ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటి? కబ్జాలు ఎక్కడెక్కడ జరిగాయనే వివరాలను రాష్ట్ర సర్కార్ సేకరిస్తున్నది. దీంతో పూర్తి డేటా ఆధారంగా అన్ని రకాల ప్రభుత్వ భూములను ఫీల్డ్ సర్వే చేసి జీఐఎస్ మ్యాపింగ్ ఇవ్వాలనుకుంటున్నది.
అదే సమయంలో జియో ఫెన్సింగ్ కూడా చేయనుంది. ఫలితంగా ప్రభుత్వ భూముల కబ్జాకు చెక్ పడనుంది. ఒకవేళ ఎవరైనా కబ్జా చేసినా.. రికార్డుల్లో మార్పులు చేసేందుకు వీల్లేకుండా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయనుంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఫారెస్ట్ అని తెలిసేలా డిస్ప్లే చేయనుంది. ఇలాంటి కఠిన చర్యలతో ప్రభుత్వ భూములను ముట్టుకునేందుకు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉంటాయని సెక్రటేరియెట్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.
ప్రభుత్వ భూములను పట్టా చేసిన ధరణి!
ధరణి పోర్టల్ వచ్చాక విలువైన ప్రభుత్వ భూములు.. పట్టా భూములుగా మార్చేసినట్లు ప్రిలిమినరీ ఎంక్వైరీలో అధికారులు గుర్తించారు. ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్ , సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ఇలా మార్పులు జరిగినట్లు తెలిసింది. ధరణి పోర్టల్‌లో పట్టా భూములుగా డైరెక్ట్ నమోదు చేయడంతో.. అసలు ఆ సర్వే నంబర్ ఎలా మారింది ? ఏమిటి.. అనేది హిస్టరీ రికార్డులో కూడా లేదు.
దీంతో ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి పాత రికార్డులు.. ఇప్పుడు ధరణిలో ఉన్న డేటాతో సరిపోల్చాలని అధికారులు చూస్తున్నారు. అదే సమయంలో కొత్త ఆర్ఓఆర్ డ్రాప్ట్ బిల్లు చట్టరూపం దాల్చాక.. పోర్టల్‌ను సమూలంగా మార్చనున్నారు. అందులో వాస్తవ రికార్డుల ఆధారంగా ప్రభుత్వ భూములను ఎంట్రీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
ఇక ధరణి పోర్టల్‌లో నమోదు కాకుండా తేడాలున్న ఫారెస్ట్ ల్యాండ్స్, వక్ఫ్‌భూములు, ఎండోమెంట్ భూముల వివరాలను కూడా కొత్త చట్టం తర్వాతే రీ ఎంట్రీ చేయనున్నారు. భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో ఏకంగా 106 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు అప్పట్లో బీఆర్ఎస్ లీడర్లు, అధికారులు కలిసి సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకున్నది.
ఇలాంటివి రంగారెడ్డి జిల్లాలో కొకొల్లలుగా ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ దృష్టికి వచ్చింది. ఫారెస్ట్ యాక్ట్‌లో సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు 53 లక్షల ఎకరాలుగా ఉన్నది. అయితే ధరణి పోర్టల్‌లో అటవీ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తున్నది. ఇంకో 6 లక్షల ఎకరాలపై గందరగోళం నెలకొన్నది. ఇందులో కొన్ని భూములు అన్సైన్డ్ లిస్ట్‌లో చూపిస్తున్నాయి.
తెలంగాణ స్టేట్ఇండస్ట్రియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కు చెందిన వేలాది ఎకరాల భూములు మాయమయ్యాయి. టీఎస్‌ఐఐసీ దగ్గర మొత్తం 60 వేల ఎకరాలు ఉండగా, అందులో 25 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదైనట్టు ధరణి కమిటీ గుర్తించింది. వక్ఫ్‌తో పాటు దేవాదాయ భూములకు సంబంధించి దాదాపు 40 శాతం భూముల లెక్కలు ధరణిలోకి ఎక్కలేదు. దాదాపు 90 వేల ఎకరాల ఎండోమెంట్ భూములు ఉండగా.. అందులో 50 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయినట్లు అధికారులు గుర్తించారు.