కాసిపేట మండలంలో ప్రభుత్వ భూములకు పట్టాలు

కాసిపేట మండలంలో ప్రభుత్వ భూములకు పట్టాలు
  • కాసిపేట మండలంలో గవర్నమెంట్ ల్యాండ్​ పరాధీనం 
  • భూపంపిణీ ప్రొసీడింగ్స్​ లేకుండా 10 ఎకరాలు దారాదత్తం
  • ధరణిలో లావుని పట్టాలుగా నమోదు చేసి పాస్​బుక్​లు జారీ 
  • అనుభవదారులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోని ఆఫీసర్లు
  • గ్రీవెన్స్​లో కలెక్టర్​కు ఫిర్యాదు 

మంచిర్యాల, వెలుగు: కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు పట్టాలు జారీ అయ్యాయి. భూపంపిణీ ప్రక్రియ 2013లోనే నిలిచిపోయినప్పటికీ మండలంలో మాత్రం విచ్చలవిడిగా లావుని పట్టాలు పుట్టుకొచ్చాయి. అసెంబ్లీ రివ్యూ కమిటీ (ఏఆర్​సీ) ఆమోదం లేకుండా, రెవెన్యూ శాఖ ఎలాంటి ప్రొసీడింగ్స్​ ఇవ్వకుండానే పలువురి పేరిట ధరణిలో ఎక్కి తెలంగాణ ప్రభుత్వ పట్టాపాస్​బుక్​లు జారీ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల ఆదివాసీ నాయక్​పోడ్​ సంఘం నాయకుడు మేండ్రపు రాజన్న సోమవారం కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.... కాసిపేట మండలంలోని పల్లంగూడ, కనికలాపూర్ శివారులోని సర్వే నంబరు 74/1లో 60 ఎకరాలు, 74/2లో 20 ఎకరాల- 20 గుంటలు, 22/1లో 3 ఎకరాల -37 గుంటల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇందులో కొంతమంది బీసీలు అక్రమంగా లావుని పట్టాలు చేయించుకొని ఈ భూములపై క్రాప్​ లోన్లు తీసుకోవడమే కాకుండా రుణమాఫీ, రైతు భరోసా వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ భూములు 1954--–55 నుంచి 2019–20 వరకు ప్రభుత్వ భూములేనని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. 

సాగు చేయకుండానే..

ఎలాంటి జీవనాధారం లేని కొందరు ఎస్సీ, ఎస్టీలు 3 నుంచి 5 ఎకరాల భూమిని మోకాపై ఉండి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు 1980–81 నుంచి 2018–19 వరకు పహాణి 
రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్నారు. కానీ వారికి ప్రభుత్వం భూ పంపిణీ చేయలేదు. భూపంపిణీ జరిగినట్టు రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా నమోదు కాలేదు. సాగు చేయకుండానే సర్వే నంబర్​ 74/1 లో దుస్స రాజవ్వ పేరిట 2 ఎకరాల -20 గుంటలు, రంగు సరిత పేరిట ఎకరం -20 గుంటలు, ఎంబడి పద్మ పేరిట 2 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా పొందారు. కనికలాపూర్ శివారులోని సర్వే నంబర్​22/1లో 3 ఎకరాల -37 గుంటల ప్రభుత్వ భూమిని ఎస్సీ, ఎస్టీలు 1992 సంవత్సరం నుంచి 2017–18 వరకు సాగు చేసుకుంటూ అనుభవదారు కాలంలో ఉన్నారు. 

వీరికి పట్టాలు ఇవ్వకుండా రంగు సురేశ్​పేరిట 3 ఎకరాల -37 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసినట్టు మేండ్రపు రాజన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై కాసిపేట తహసీల్దార్​కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి అక్రమ పట్టాలు జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.