నస్పూర్, వెలుగు: ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడంలేదు. నస్పూర్‌లోని సర్వే నంబర్ 42లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఏకంగా ప్రహరీ ఏర్పాటు చేసినా ఆఫీసర్ల మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో షెడ్లు వేస్తే 2021 ఏప్రిల్ లో కూల్చిన ఆఫీసర్లు ఇప్పుడు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
సర్వే నంబర్119లో కంచె వేయగా ఈ ఏడాది మర్చిలో అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారులు వచ్చి పరిశీలించి ఆ కంచెను తొలగించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఆ భూమి మళ్లీ ఆక్రమణకు గురైంది. ఆక్రమణ దారుడు ఈసారి ఏకంగా చదును చేసుకొని పొలం వేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఇప్పుడు ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.