గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి తవ్వకాలు ఆగడం లేదు. ప్రభుత్వ భూములు, హ్యాండ్లూమ్ పార్క్ స్థలాలు, గుట్టల్లో అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు.చివరకు ప్రైవేటు ప్లాట్లు, రిజర్వాయర్లు, చెరువులను కూడా వదలడం లేదు. అడ్డుకోవాల్సిన పోలీస్, మైనింగ్ ఆఫీసర్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
సర్కార్ జాగాలు.. గుట్టల మీదే..
గద్వాల మండలంలోని అనంతపురం గ్రామ సమీపంలో సర్వే నంబర్ 368 లో 100 ఎకరాల సర్కారు భూమి ఉంది. అందులో 50 ఎకరాల స్థలాన్ని హ్యాండ్లూమ్ పార్క్ కు కేటాయించారు. ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఖాళీగా ఉన్న మిగతా 50 ఎకరాల పొలంలోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. గద్వాల టౌన్ కు సమీపంలోని శెట్టి ఆత్మకూరు వద్ద రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరిపి గుట్టలను కరగదీస్తున్నారు.అనంతపురం, వీరాపురం గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో దర్జాగా తవ్వకాలు జరుగుతున్నాయి.
చెంగంపల్లి, ములకలపల్లె శివారులోని అసైన్డ్ భూముల్లో మట్టిని తవ్వి గద్వాల టౌన్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గట్టు మండలం ముచ్చోనిపల్లి రిజర్వాయర్ లో రెండు రోజుల నుంచి రాత్రివేళలో జేసీబీలు, టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు పసిగట్టి మంగళవారం రాత్రి టిప్పర్లను అడ్డుకొని, పోలీసులకు కంప్లైంట్ చేశారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని నిర్వాసిత రైతులు ఆరోపిస్తున్నారు. గద్వాల టౌన్ సమీపంలో ప్రైవేట్ వ్యక్తుల ప్లాట్లలోనూ కొన్ని నెలల కింద తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకున్నారు. దీనిపై లబ్ధిదారులు అప్పట్లో ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. కానీ వారిని ఎలాంటి న్యాయం జరగలేదు.
టిప్పర్ మట్టికి రూ.8 వేలు
వెంచర్లకు, ఇంటి నిర్మాణాలకు మట్టి అవసరం చాలా ఉంటుంది. దీంతో మట్టికి ఫుల్ డిమాండ్ ఉండటంతో అధికార పార్టీ లీడర్లే మాఫియాగా మారి తవ్వకాలు జరుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూమి కొని, పర్మిషన్ తీసుకొని మట్టి తోడి.. అమ్మితే తక్కువ లాభాలు వస్తాయి. అదే ఇల్లీగల్ గా సర్కార్ భూములు, హ్యాండ్లూమ్ పార్క్ లో తవ్వి, అమ్మితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని ఆశించి.. ఆఫీసర్లను మేనేజ్ చేసి ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఒక టిప్పర్ మట్టి రేటు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పలుకుతోంది. దీంతో కోట్లల్లో ఆర్జిస్తున్నారు. హ్యాండ్లూమ్ పార్క్ నుంచి ఇటిక్యాల మండలానికి చెందిన ఒక వెంచర్ కి తరలించి పెద్ద ఎత్తున డబ్బు దండుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హ్యాండ్లూమ్ పార్కు స్థలాన్ని కాపాడండి
మట్టి మాఫియా అక్రమ తవ్వకాలతో హ్యాండ్లూమ్ స్థలం అన్యాక్రాంతం అవుతోంది. కలెక్టర్ స్పందించి పార్క్ స్థలాన్ని కాపాడాలి. ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోతే అక్కడ గుంతలు తప్ప ఏమీ ఉండదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది.
- రామలింగేశ్వర కాంబ్లే, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, గద్వాల
కేసులు పెడుతున్నాం
మట్టి మాఫియా పై కేసులు పెడుతున్నాం. మంగళవారం కూడా ఆరు టిప్పర్లపై కేసు నమోదు చేశాం. మట్టి మాఫియాలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. రెవెన్యూ, మైనింగ్ వారు కూడా సమాచారం ఇవ్వాలి.
- రంగస్వామి, డీఎస్పీ, గద్వాల