- కబ్జాలు చేస్తున్నరు కట్టేస్తున్నరు
- లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కువైన ప్రభుత్వ భూముల ఆక్రమణలు
- శివారులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లు మాయం
- ప్రైవేట్ భూములను వదలని కబ్జాదారులు
- పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
హయత్ నగర్ లోని సర్వే నంబర్191లో దాదాపు 28 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని లాక్ డౌన్ టైమ్ లో కబ్జాదారులు ఆక్రమించారు. అందులో నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు. దీనిపై స్థానికులు అధికారులకు కంప్లయింట్ చేయగా పట్టించుకోలేదు. ఇది కాస్తా మీడియాలో రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు.’’
అబ్దుల్లాపూర్మెట్మండలం జాఫర్ గూడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 321లో చెరువు భూమి ఉంది. ఇందులోని కొంత భూమిని కబ్జా చేసి గోడ కూడా కట్టేశారు. దీనిపై గ్రామస్తులు పట్టు వీడక ఫైట్ చేశారు. చేసేదిలేక అధికారులు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు.’’
ఎల్ బీనగర్, వెలుగు: సిటీ శివారులో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఏదైనా సరే ఆక్రమించేస్తున్నారు. వెంచర్లు చేసి అమ్మేస్తున్నారు. నిర్మాణాలు కూడా కట్టేస్తున్నారు. లాక్ డౌన్ లో కొన్ని నెలల పాటు ప్రభుత్వ భూములపై సరైన పర్యవేక్షణ లేకపోవడం తో కబ్జాదారులు యాక్టివ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్ మండలాల్లో వందల ఎకరాల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ భూములను ఆక్రమించారు. వాటిలో నిర్మాణాలు కూడా చేస్తున్నారు.
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ బోర్డులను తీసేసి..
ఎఫ్‌టీఎల్, బఫర్జోన్లలో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీలులేదు. అవి కబ్జా కాకుండా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తుండాలి. అయితే కబ్జాదారులతో అధికారులే ములాఖత్అయి మాయం చేస్తున్నారు. హయత్నగర్మండలంలోని పుచ్చర్ల కుంట, కంబాల చెరువు, బైరాన్ ఖాన్ చెరువు, మంగలోని కుంట, తాళ్ల చెరువు, తట్టిఖానా చెరువు, జంగారెడ్డి కుంట, పోచమ్మ చెరువు, మాసబ్ చెరువులను ఇలా లాక్ డౌన్ టైమ్ లో కబ్జా చేశారు. ఒక్కో చెరువు కింద ఎకరం నుంచి రెండు మూడు ఎకరాల వరకు ఆక్రమించేశారు. ప్రభుత్వ భూమి, ఎఫ్టీఎల్అని రాసి ఉన్న బోర్డులను కూడా తొలగించేసేశారు. మరికొందరు కొనుగోలు చేసిన భూమి పక్కన ఖాళీ జాగాను కలిపేసుకుంటున్నారు.
కలిసొచ్చిన లాక్ డౌన్
కబ్జాదారులకు లాక్ డౌన్ కలిసొచ్చింది. అదే టైమ్‌లో శివారులో ఉండే చెరువులు, కుంటలపై అధికారుల పర్యవేక్షణ లేదు. గతేడాది మార్చి నుంచి జూన్ వరకు ఎండకాలంలో చాలా చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడంతో ఆక్రమించారు. కొన్ని నెలల పాటు అధికారులు అటువైపు వెళ్లకపోవడంతో నిర్మాణాలు షురూ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని సర్వే నంబర్ 242 లో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టారు. అదే మండలంలోని బీసీ సర్వే నంబర్ 283, 242 సర్వే నంబర్లలో స్థానిక పొలిటికల్ లీడర్లే కబ్జాలు చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ భూములను వదలడం లేదు. ఖాళీగా జాగా కనిపిస్తే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారు. దాదాపు 6 నెలల పాటు భూముల అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోవడం కూడా కబ్జాదారులకు కలిసొచ్చింది. ఇలా మండల పరిధిలో రోజుకు ఒక్క కేసు అయినా ఫైల్అవుతుంది.
గ్రామస్తులు కంప్లయింట్ చేస్తేనే..
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కబ్జాలపై గ్రామస్తులు కంప్లయింట్ చేసినా లైట్ తీసుకుంటున్నారు. జాఫర్ గూడ సర్వే నంబర్ 320 లో భూమిని ఆక్రమించి బేస్మెంట్, గోడ కట్టారని గ్రామస్తులు కంప్లయింట్ చేస్తే అధికారులు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. కానీ అక్రమ నిర్మాణాలను కనీసం కూల్చివేయలేదు. రెండు డిపార్ట్ మెంట్ల అధికారుల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం కబ్జాదారులకు బెన్ ఫిట్ గా మారింది. ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకు కంప్లయింట్ చేస్తేనే కిందిస్థాయి అధికారులు రియాక్ట్ అవుతున్నారు. లాక్ డౌన్ తర్వాత వచ్చిన కంప్లయింట్ల ఆధారంగా కొన్ని కబ్జా అయిన భూములను మళ్లీ స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ భూములంటూ బోర్డులు పెడుతున్నారు.
ఆక్రమణలపైనే ఎక్కువగా కంప్లయింట్స్
భూముల కబ్జాలకు సంబంధించి ఇటీవల చాలా కంప్లయింట్స్ వస్తున్నాయి. ట్రెస్ పాస్ చేస్తున్నారని కొందరు, తమ భూములను ఆక్రమిస్తున్నారని మరికొందరు కంప్లయింట్లు చేస్తున్నారు. గతంలో కన్నా ఇటీవల కబ్జాలకు సంబంధించి ఎక్కువగా వస్తున్నాయి.
– స్వామి, అబ్దుల్లాపూర్ మెట్, ఎస్ఐ
కబ్జాలను గుర్తిస్తున్నాం
లాక్ డౌన్ నుంచి చెరువుల కబ్జాలు పెరిగాయి. ఇటీవల ఆయా చెరువుల వద్ద 22 కబ్జాలను గుర్తించాం. వాటిపై రెవెన్యూ అధికారులకు రిపోర్ట్ చేశాం. కబ్జా అయిన నిర్మాణాలు కూల్చాల్సిన పని రెవెన్యూ అధికారులదే.
– రజిత, ఇరిగేషన్ ఏఈ,అబ్దుల్లాపూర్ మెట్
కేసులు పెడుతున్నం..
ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమణలపై కంప్లయింట్లు ఇస్తుండగా కేసులు పెట్టి భూమి స్వాధీనం చేసుకుంటున్నాం. సర్వే నంబర్ 242 లో ఆక్రమణలు జరిగినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే వెంటనే వెళ్లి యాక్షన్ తీసుకున్నాం.
– సైదులు, తహసీల్దార్, అబ్దుల్లాపూర్ మెట్
అధికారులు పట్టించుకుంటలే
లాక్ డౌన్ నుంచి కబ్జాలు పెరిగిపోయాయి. మా మండలం లోని చాలా చెరువులను ఆక్ర మించుకున్నారు. వీటిపై అధికారులకు కంప్ల యింట్ చేసినం. అయినా ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు. అధికారుల తీరు చూస్తే కబ్జాదారులకు సహకరించే విధంగా ఉంది.
– గ్యార మల్లేశ్, గౌరెల్లి
For More News..