- పౌష్టికాహార లోపం, మొబైల్ ఫోన్ల వాడకం కారణం
- 4,792 మందికి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు గుర్తింపు
- ఆర్ బిఎస్ కే బృందాలతో స్కూల్ ఐ స్క్రీనింగ్ పరీక్షలు
సంగారెడ్డి, వెలుగు: బడి పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువయ్యాయి. స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లల్లో కంటి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం (ఆర్బీఎస్కే) కింద స్కూల్ ఐ ప్రోగ్రాం చేపట్టింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు విడతలుగా ఆరోగ్యశాఖ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది చివర్లో ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుకుంటున్న స్టూడెంట్లకు, ఇతర ప్రభుత్వ స్కూళ్లలో 5 నుంచి పదో తరగతి వరకున్న స్టూడెంట్లకు 78 రోజులపాటు ఐ స్క్రీనింగ్ టెస్టులు చేశారు.
మొత్తం 93,563 మంది పిల్లలకు టెస్టులు చేయగా, 4,792 మంది పిల్లల్లో సమస్యలున్నట్టు గుర్తించారు. కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో గర్ల్స్ ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్ పిల్లల్లో 3,187 మంది గర్ల్స్ , 1,605 మంది బాయ్స్ ఐ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు. పౌష్టికాహారలోపం, మొబైల్ ఫోన్ల వాడకం పిల్లల్లో దృష్టి లోపాలకు ప్రధాన కారణాలుగా తేలినట్టు కంటి వైద్య నిపుణులు చెప్తున్నారు.
సర్జరీలు చేయించాలి
ప్రధానంగా పౌషికాహార లోపం వల్ల స్కూలు పిల్లల్లో కంటి సమస్యలు వస్తున్నట్టు డాక్టర్లు నిర్ధారించడంతో ఆపీసర్లు ఈ ఇష్యూ మీద ఫోకస్ పెడుతున్నారు. దృష్టి లోపాలున్న పిల్లలకు ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందజేస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన స్టూడెంట్స్ కు పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులకు కళ్ళద్దాలు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా సర్జరీ చేయించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
నిరంతరం వైద్య సేవలు
బడి పిల్లల్లో కంటి సమస్యలను నివారించేందుకు వైద్య సేవలు ప్రారంభించాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రెండున్నర నెలల పాటు ఆర్ బీఎస్ కే బృందాలు నిర్వహించిన పరీక్షల్లో వేలమంది పిల్లల్లో కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించాం. వారికి మెరుగైన ట్రీట్మెంట్ ఇస్తున్నాం – శశాంక్ దేశ్ పాండే, ఆర్ బిఎస్ కే జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్