కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్​లో 50% పింఛన్

  • యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్​కు కేంద్ర కేబినెట్ ఆమోదం 
  • 2025, ఏప్రిల్ 1 నుంచి అమలు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి బయో ఈ3 పాలసీ, విజ్ఞాన్ ధార స్కీమ్​కూ ఓకే

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం రూపొందించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్​(యూపీఎస్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్​ కింద ఉద్యోగులకు బేసిక్ శాలరీలో 50 శాతం వరకూ పెన్షన్​గా  అందనుంది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

కేబినెట్ నిర్ణయాలను సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్)లో చందాదారులుగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం 2025, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని, 2004, ఏప్రిల్ 1 తర్వాత ఎన్ పీఎస్ లో చేరిన ఉద్యోగులు అర్హులు అని వెల్లడించారు. 

కనీస పెన్షన్ రూ.10 వేలు..  

యూపీఎస్ కింద కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్, అష్యూర్డ్ మినిమమ్ పెన్షన్ లభించనున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ స్కీంలో చేరిన ఉద్యోగులకు రిటైర్మెంట్ కు ముందు చివరి12 నెలల్లో అందుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీలో 50 శాతం ఫుల్ పెన్షన్ వస్తుందన్నారు. కనీసం 25 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవాళ్లకు ఫుల్ పెన్షన్ వర్తిస్తుందని, అలాగే 10 ఏండ్ల కనీస సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆ మేరకు తగిన పెన్షన్ లభిస్తుందన్నారు. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే.. చివరిగా డ్రా చేసిన మొత్తంలో 60 శాతాన్ని కుటుంబానికి అందజేస్తారని చెప్పారు. అలాగే కనీసం 10 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు కనీస పింఛన్ రూ. 10 వేలు చెల్లిస్తారన్నారు. ప్రస్తుత పెన్షన్ స్కీంలో ఉద్యోగుల వాటా 10 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 14 శాతం ఉంటుందని, యూపీఎస్ లో కేంద్రం వాటాను 18 శాతానికి పెంచుతున్నామన్నారు. 

ఎన్​పీఎస్ లేదా యూపీఎస్.. దేంట్లోనైనా చేరొచ్చు 

కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రవేశపెట్టిన న్యూ పెన్షన్ స్కీం(ఎన్ పీఎస్)ను బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. డీఏతో లింక్ ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్)కు మారాలని నిర్ణయించాయి. ఉద్యోగి రిటైర్మెంట్ కు ముందు అందుకున్న చివరి శాలరీలో 50 శాతాన్ని పెన్షన్ గా పొందే అవకాశం ఉండటం, ఈ మొత్తానికి డీఏ పెరుగుదల కూడా యాడ్ అవుతూ ఉండటంతో పలు రాష్ట్రాల్లోని ఉద్యోగ సంఘాలు కూడా తమకు ఓపీఎస్ ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కీంను రివ్యూ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలో ఫైనాన్స్ మినిస్ట్రీ గత ఏడాది ఒక కమిటీని నియమించింది. కమిటీ సిఫారసుల మేరకు రూపొందించిన యూపీఎస్ కు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఉద్యోగులు యూపీఎస్ లో లేదా ఎన్ పీఎస్ లో దేంట్లోనైనా చేరొచ్చని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.  

‘విజ్ఞాన్ ధార’ స్కీంకు ఆమోదం 

సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలోని మూడు పథకాలను కలిపి ‘విజ్ఞాన్ ధార’ అనే కొత్త స్కీంగా కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ స్కీం కోసం 15వ ఆర్థిక సంఘం (2021=22 నుంచి 2025=26 వరకు) పీరియడ్ లో రూ. 10,579 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. కాగా, ఈ పథకంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్.. పరిశోధన, అభివృద్ధి.. ఇన్నోవేషన్ టెక్నాలజీ అభివృద్ధి, వినియోగం అనే మూడు కార్యక్రమాలను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, 11, 12వ క్లాస్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ అవకాశం కల్పించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

‘బయో ఈ3’ పాలసీకి ఓకే 

బయోటెక్నాలజీ శాఖలో బయో మాన్యుఫాక్చరింగ్ రంగం అభివృద్ధి కోసం ‘బయో ఈ3(ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్ మెంట్ కోసం బయోటెక్నాలజీ)’ పేరుతో కొత్త పాలసీని అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బయో మాన్యుఫాక్చరింగ్, బయో ఏఐ హబ్ లు, A ఏర్పాటు ద్వారా టెక్నాలజీ అభివృద్ధి, వాణిజ్య వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. పర్యావరణ హిత విధానాల అమలును పెంపొందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగాల సృష్టికి కూడా ఇది దోహదం చేస్తుంది. ప్రధానంగా బయో ఈ3 పాలసీలో బయో కెమికల్స్, బయో పాలిమర్స్, బయో ఎంజైమ్స్, స్మార్ట్ ప్రొటీన్స్, ఫంక్షనల్ ఫుడ్స్, కచ్చితమైన బయోథెరప్యూటిక్స్, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, కార్బన్ నిక్షిప్తం, వినియోగం, సముద్ర, అంతరిక్ష పరిశోధన వంటి అంశాలపై దృష్టి సారించాలని కేబినెట్ నిర్ణయించింది. 

యూపీఎస్​తో ఆర్థిక భద్రత : మోదీ

యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్)తో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత, గౌరవం దక్కుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్తుకు భద్రత విషయంలో తన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శనివారం కేబినెట్ మీటింగ్ అనంతరం ప్రధాని ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘దేశ అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ మాకు గర్వకారణం. వారి సంక్షేమం, భద్రతను పెంపొందించాలన్న మా కమిట్ మెంట్ కు అనుగుణంగా యూపీఎస్ ను తీసుకొచ్చాం. దీనితో ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో కూడిన గౌరవ ప్రదమైన జీవితం లభిస్తుంది” అని మోదీ పేర్కొన్నారు. 

కొనుక్కునే పెన్షన్ మాకొద్దు :  స్థితప్రజ్ఞ

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగి తన కంట్రిబ్యూషన్ ఇచ్చి కొనుక్కునే పెన్షన్ ఒప్పుకొనేది లేదని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాల్లో నూతన పెన్షన్ విధానంపై తీసుకున్న  నిర్ణయం ఏదైనా సరే ఒప్పుకోమని శనివారం ప్రకటనలో తెలిపారు. 1970 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం,  ప్రభుత్వ ఉద్యోగికి పాత విధానంలోనే పెన్షన్ నిర్ణయం జరగాలన్నారు.  పెట్టిన పెట్టుబడికి నష్టం వస్తుందని తెలిసి.. ఎవరైనా పెట్టుబడి పెడతారా? అని ప్రశ్నించారు. సర్వీస్​ టైంలో  జీతంలో 50% జమ చేస్తే 20% తీసుకొని 30% తిరిగి ఇస్తామనటం ఏంటన్నారు. కేంద్రం పునరాలోచించాలని స్థితప్రజ్ఞ  తెలిపారు.  పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.