కామారెడ్డి జిల్లాలో కందులు కొనేదెప్పుడు?

కామారెడ్డి  జిల్లాలో కందులు కొనేదెప్పుడు?
  • సెంటర్లు తెరిచినా కాంటాలు పెడ్తలేరు
  • తేమ శాతం పేరిట కొర్రీలు 
  • ఎంఎస్పీ కన్నా తక్కువకే కొంటున్న వ్యాపారులు

కామారెడ్డి​ ​, వెలుగు : కందిపంట మార్కెట్​ లోకి వచ్చి 15 రోజులు కాగా.. ప్రభుత్వం జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయినా ఇంకా కాంటలు మొదలు పెట్టకపోవడంతో రైతులు పడిగాపులు పడుతున్నారు. తేమ శాతం ఎక్కువ వస్తుందని సాకుతో సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో ప్రైవేట్​ వ్యాపారులు రంగంలోకి దిగి .. తక్కువ రేటుకే కందులు కొంటున్నారు. జిల్లాలో 56,189 ఎకరాల్లో కంది పంట సాగైంది. ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజక వర్గాల్లో ఈ పంట ఎక్కువగా పండించారు. నాఫెడ్​, మార్క్​ఫెడ్​ద్వారా కందుల కొనుగోలు చేసేందుకు జనవరి 27న గాంధారి, మద్నూర్​, జుక్కల్, పిట్లం, తాడ్వాయి, పద్మాజివాడి, బోర్లాం, బిచ్​కుంద సొసైటీల్లో లో ఎనిమిది సెంటర్లు తెరిచినట్టు అధికారులు ప్రకటించారు. 

 గాంధారిలో రైతుల పడిగాపులు

 గాంధారి మండలంలో కంది సాగు ఎక్కువ. 15 రోజులుగా కిందే రైతులు పంట దిగుబడులను మార్కెట్​ యార్డుకు తీసుకొచ్చారు. అయినా ఇక్కడ ఇప్పటివరకు కాంటాలు మొదలుకాలేదు. తేమ శాతం 12 రావట్లేదని చెబుతూ కొనుగోళ్లు చేయట్లేదు. ఇప్పటికే యార్డులో ఎటు చూసినా కందుల రాశులు కనిపిస్తున్నాయని, రెండుమూడు రోజుల్లో మరింత స్టాక్​ మార్కెట్​ కు వస్తుందని, అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. సెంటరల్లో కొనుగోలు చేయక పోవడంతో పలువురు రైతులు వ్యాపారులకు అగ్గువకే కందులు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం కందికి రూ. 7,550 ఎంఎస్​పీగా ప్రకటించగా.. సీజన్​ మొదట్లో రూ. 8వేలకు పైగా ధర పలికింది. సరుకు ఎక్కువగా వస్తుండడం, సెంటరల్లో జాప్యం జరుగుతుండడంతో వ్యాపారులు రూ. 6వేల నుంచి రూ. 6,5‌‌‌‌00లకే కొంటున్నారు. 

Also Read :- అజంజాహి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

పంట చేతికి రాగానే ధర తగ్గింది 

6 ఎకరాల్లో కంది వేసినా. రెండువారాలకిందనే మార్కెట్​కు కందులు తెచ్చినా. అప్పటికింకా సెంటర్​ఓపెన్​ కాలే. 5 రోజుల కింద సెంటర్​ ఒపెన్​ అయినట్లు చెప్పినా ఇంకా కొనలేదు. అడిగితే తేమ ఎక్కువుందని చెబుతున్రు. పంట చేతికి వచ్చే ముందు ఎక్కువ రేట్​ ఉంటుంది.రైతుల చేతికి పంట రాగానే రేట్​ పడిపోతుంది. సెంటర్లలో వెంటనే కొనుగోలు చేయాలి.- ఆకుల రమేశ్​, గాంధారి

తేమ 12 శాతం ఉంటేనే కొంటాం

జిల్లాలో 8 సెంటర్లు ఓపెన్​ చేశాం. తేమ శాతం 14 కు పైగా వస్తుంది. 12 శాతం వస్తెనే కొంటాం. జిల్లాలో ఇప్పుడిప్పుడు పంట కోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువగా వస్తుంది. ఎండితే తేమ శాతం 12 వస్తుంది. సెంటర్లకు వచ్చే ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొంటాం.

మహేశ్​కుమార్​, మార్క్​ఫెడ్​ డీఎం

తేమ ఉందని కాంట పెడ్తలే

తేమ శాతం ఎక్కువ వస్తుందంటూ కాంటలు పెడ్తలేరు. కందులు యార్డుకు తెచ్చి వారం రోజులైంది. రోజు ఇక్కడే పడిగాపులు కాస్తు ఉంటున్నాం. 

కిషన్​రావు, గాంధారి