కేటీఆర్ టూర్.. లోపలేసెయ్..! ఐటీ మంత్రి పర్యటన ఉంటే అరెస్టులే

  • కేటీఆర్ టూర్.. లోపలేసెయ్..!
  • ఐటీ మంత్రి పర్యటన ఉంటే అరెస్టులే
  • నిరసనలు కనిపించకుండా సర్కారు ప్రీప్లాన్
  • షెడ్యూల్ కు ముందు రోజు నుంచే అలెర్ట్
  • యువకులు, ప్రతిపక్ష నాయకులే టార్గెట్
  • పలు చోల్ల పోలీసుల అత్యుత్సాహం 

హైదరాబాద్ : ఐటీ మినిస్టర్ కేటీఆర్ టూర్ అనగానే సర్కారు యంత్రాంగం అలెర్టవుతోంది. ఒక రోజు ముందే పోలీసులు నిరుద్యోగులు, ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకుల లిస్ట్ రెడీ చేస్తున్నారు.. ఆ రాత్రికే అరెస్టు చేస్తున్నారు. ఇక యువరాజు వెళ్లే రూట్ లో ఉండే గ్రామాల్లోని విపక్ష నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు.

ఇక నేరెళ్ల బాధితుల పరిస్థితి అయితే స్పెషల్ గా చెప్పనక్కరలేదు. మంత్రి గారు సిరిసిల్లకు వెళ్లిన ప్రతి సారీ వాళ్ల ఇండ్ల వద్దకు భారీ ఎత్తున పోలీసులు చేరుకుంటారు. హౌస్ అరెస్టు చేస్తారు.. మంత్రి వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆ రూట్ నుంచి తిరిగి వెళ్లే వరకూ పోలీసులు అక్కడే కాపలా కాస్తారు! ఈనెల 5న మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లారు.

నిరసనలకు తావులేకుండా జాగ్రత్త పడ్డ పోలీసులు ఒక రోజు ముందే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. కేయూ గేట్లను మూసేశారు. విద్యార్ధుల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. దీంతో విద్యార్ధులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గేట్లు మూసి వేయడం వల్ల విద్యార్ధులు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొన్ని చోట్ల ధరణి లాంటి పలు అంశాలపై నిరసన వ్యక్తం చేసినట్టు పోలీసుల రికార్డుల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు. తాము బీఆర్ఎస్ నాయకులమే మొర్రో..! అని చెప్పినా వినిపించుకోవడం లేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాలపై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా మెరుపు వేగంతో నిరసనకారులు కాన్వాయ్ వైపు దూసుకొస్తూనే ఉన్నారు. ‘ముందస్తు అరెస్టులు లేకపోతే ఒక్క సెగ్మెంట్ లో కూడా తిరగలేవ్..! పోలీసులను చేతిలో పట్టుకొని మీటింగ్ లకు వచ్చే మీరు కాబోయే ముఖ్యమంత్రా..?’అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

సామాజిక మాధ్యమాలే వేదికగా విమర్శలదాడి చేస్తున్నా.. అటూ మంత్రి, ఇటు పోలీసులు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఉన్న సెగ్మంట్లలోనే కాకుండా ఆ జిల్లాలోని మిగతా నియోజకవర్గాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తుండటం గమనార్హం. 

నేరెళ్ల బాధితుల అరిగోస

సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్​ పర్యటన ఉందంటే చాలు.. సార్ ఆ రూట్ లో వస్తున్నారంటే చాలు వాళ్ల పనైపోయినట్టే..! పోలీసులు ప్రతిపక్ష లీడర్లతోపాటు పలువురిని రోజంతా నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలో, పోలీసుల అత్యుత్సాహమో తెలియదుగానీ కేటీఆర్​ పర్యటన ఉన్న రోజు మబ్బుల్నే కొందరు బీజేపీ, కాంగ్రెస్​లీడర్లతో పాటు నేరెళ్ల బాధితులు, నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. తెల్లవారక ముందే వచ్చి తలుపులుకొట్టి నిద్రలేపి మరీ పోలీస్​స్టేషన్​కు తీసుకపోతున్నారు. అట్ల కాకపోతే హౌస్​ అరెస్ట్​ చేస్తున్నారు. 

లోన్లియ్యమని మెస్సేజ్ లు

ఇవాళ బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో నిర్వహించిన మంత్రి కేటీఆర్ సభకు జన సమీకరణ కోసం తిప్పలు పడుతున్న అధికారులు ఏకంగా మహిళా సంఘాలకు లోన్లు రావని బెదిరింపు మెస్సేజ్ పంపడం గమనార్హం. ‘రేపు ఉదయం 9.30 గంటలకు మంత్రి కేటీఆర్ ​గారు వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆ మీటింగ్​కు హాజరుకావాలి. అక్కడ లంచ్ కూడా అరేంజ్​ చేశారు. మా పై అధికారులు మాకు మెమోలు ఇస్తాం అన్నారు. నేను సీరియస్​గా చెబుతున్నా. మంత్రి సభకు రానివాళ్లు ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి లోన్​ కావాలని అడగొద్దు’అని ఓ అధికారి పంపిన మెస్సేజ్ వైరల్ గా మారింది.