
- పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు ఎక్కడున్నా ట్రేస్ చేయొచ్చు
- త్వరలో అన్ని ట్రాన్స్పోర్ట్, గూడ్స్ బండ్లకు
- వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ తప్పనిసరి
- దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమలు చేయనున్న రవాణా శాఖ
- ప్రజలను రవాణా చేసే అన్ని కొత్త, పాత వెహికల్స్ , గూడ్స్ బండ్లకూ మస్ట్
- నిర్భయ వంటి ఘటనలకు చెక్ పెట్టేలా నిర్ణయం
- అనుమతి కోసం కేంద్రానికి లేఖ.. త్వరలోనే అమలుకు చర్యలు
- ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కంట్రోల్ సెంటర్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వాహనాలన్నింటికీ ఇకపై లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ లను అమర్చడం తప్పనిసరి కానుంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరహాలో ఇటీవల మన రాష్ట్రంలోనూ రెండు మూడు చోట్ల ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సుల్లో మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అన్ని రవాణా వాహనాల్లో వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్(వీఎల్టీడీ)లను తప్పనిసరి చేసేందుకు చర్యలు చేపట్టింది. అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ రవాణా వాహనాలకు, గూడ్స్ వెహికల్స్ కు వీఎల్టీడీలను తప్పనిసరి చేయడం కోసం అనుమతిని కోరుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై కేంద్రం నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశాలు ఉండటంతో, తదుపరి చేయాల్సిన ఏర్పాట్లపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు.
ఖైరతాబాద్ లోని రాష్ట్ర రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచే వీఎల్టీడీ పరికరం అమర్చే ప్రతి వాహనం కదలికలపై నిఘా ఉంచనున్నారు. దీంతో ఏ వాహనంలోనైనా ఏదైనా అనుకోని ఘటన జరిగితే క్షణాల్లో సంబంధిత అధికారులతో పాటు పోలీసులను అప్రమత్తం చేసి నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం కలగనుంది.
కొత్త, పాత వెహికల్స్ అన్నింటికీ మస్ట్
రాష్ట్రంలో ట్రాన్స్ పోర్ట్, గూడ్స్ వాహనాలకు వీఎల్టీడీలను తప్పనిసరి చేసిన తర్వాత రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రవాణా, గూడ్స్ అవసరాల కోసం వినియోగించే పాత, కొత్త వాహనాలన్నింటికీ వీఎల్టీడీల అమలును పకడ్బందీగా చేపట్టనున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వెహికల్, గూడ్స్ వాహనాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం తిరుగుతున్న ఇలాంటి అన్ని రకాల వాహనాల్లో కూడా వీఎల్టీడీలను అమర్చనున్నారు.
వీఎల్టీడీ పరికరాలను సరఫరా చేసే ప్రముఖ కంపెనీలతో ఇప్పటికే రవాణా శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్ తయారీ కంపెనీలు, గూడ్స్ వెహికల్స్ తయారీ కంపెనీలు వీఎల్టీడీలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో వీఎల్టీడీకి రూ. 8 నుంచి10 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు.
ఈ పరికరం అమర్చని కొత్త వాహనాలకు రవాణా శాఖ నుంచి రిజిస్ట్రేషన్ చేయరు. పాత వాహనాలు కూడా ఈ విధానం అమల్లోకి వచ్చిన వెంటనే వీఎల్టీడీలను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ వాహన యజమాని అయినా వీటిని అమర్చుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే అలాంటి వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ విధానం అమలుతో రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా రవాణా వాహనాల్లో ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించడం సాధ్యమవుతుందని అంటున్నారు.
దేశంలోనే తొలిసారి..
దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, గూడ్స్ వెహికల్స్ కు ఇలాంటి పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేదు. ప్రస్తుతం తెలంగాణతోపాటు కర్నాటక, ఒడిశా రాష్ట్రాలు మాత్రమే రవాణా వెహికల్స్ కు వీఎల్టీడీలను తప్పనిసరి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, కేంద్రం నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉన్నందున.. అన్నీ అనుకూలిస్తే రవాణా వాహనాలకు వీఎల్టీడీలను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని అధికారులు చెప్తున్నారు.