- 8 కిలోమీటర్ల పొడవు, 33 అడుగుల ఎత్తుతో నిర్మించాలని ప్లాన్
- మరో మూడు చెక్‌డ్యామ్‌లు ఏర్పాటుకు అధికారులు ప్రపోజల్స్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం సిటీని ఆనుకొని ప్రవహిస్తున్న మున్నేరు నది సమీప కాలనీలను ముంచెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా నదికి ఇరువైపులా కాంక్రీట్వాల్స్నిర్మించేందుకు రూ.690.52కోట్లు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది. త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్చేస్తున్నారు. గతంలో మున్నేరుకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని నిర్ణయించగా, భూసేకరణ సమస్యగా మారుతుందని కాంక్రీట్వాల్స్ కు ఓకే చెప్పారు.
పోలేపల్లి నుంచి ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వరకు రెండు వైపులా మొత్తం 8 కిలోమీటర్ల మేర వాల్స్నిర్మించనున్నారు. వీటి నిర్మాణాలు పూర్తయితే వరద ఉధృతి ఎలా ఉన్నా ఆయా కాలనీలకు ముంపు ముప్పు సమస్య ఉండబోదని అధికారులు చెబుతున్నారు. కాంక్రీట్ వాల్స్నిర్మించే చోట ఇప్పటికే రెండు చెక్ డ్యామ్ లు ఉండగా, మరో మూడు చోట్ల రూ.30 కోట్లతో మూడు చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్పంపించారు. అలాగే మున్నేరుపై కాల్వొడ్డు సమీపంలో తీగల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేయగా, టెండర్ల ప్రాసెస్నడుస్తోంది.
2,300 ఇండ్లు మునిగాయ్
గతంలో ఎన్నడూ లేని విధంగా నెలన్నర కింద కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది.30.7 అడుగుల మేర ప్రవహించడంతో పలు కాలనీల్లోని సుమారు 2,300 ఇండ్లు నీట మునిగాయి. ఆయా కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్‌లో అలాంటి ఇబ్బంది లేకుండా 33 అడుగుల ఎత్తులో కాంక్రీట్ గోడలు నిర్మించనున్నారు. ఇక సిటీలోని గోళ్లపాడు చానల్ఆధునీకరణతో చేపట్టిన అండర్ గ్రౌండ్డ్రెయిన్లు, వరద నీటి ప్రవాహ పైప్లైన్లను చెక్ డ్యామ్ లకు దిగువన సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ దగ్గర మున్నేరులో కలపనున్నారు. వరద ప్రవాహం ఎంత ఉన్నా ఆ నీరు డ్రెయిన్లలోకి ఎదురు వెళ్లకుండా అధికారులు ప్లాన్రూపొందించారు. ఇప్పటికే పోలేపల్లి, ప్రకాశ్నగర్వద్ద రెండు చెక్ డ్యామ్ లు ఉన్నాయి. వీటిలో అర టీఎంసీ నీటిని నిల్వ చేస్తున్నారు.
అదనంగా మరో మూడు చెక్‌లను నిర్మించేందుకు ప్లాన్చేస్తున్నారు. అవి పూర్తయితే మరో టీఎంసీ నీరు నిల్వ చేయొచ్చని చెబుతున్నారు. మొత్తం 5 చెక్‌డ్యామ్ లతో ఒకటిన్నర టీఎంసీ నీరు నిల్వ చేసే అవకాశం ఉందని, కాంక్రీట్ వాల్స్, తీగల వంతెన పూర్తయితే ఆ ప్రాంతాన్ని మున్నేరు రివర్ ఫ్రంట్ గా పిలవాలని నిర్ణయించారు. టూరిస్ట్ అట్రాక్షన్ఉండేలా లైటింగ్, ఇతర హంగులతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. కాంక్రీట్ వాల్ కు ప్రతి అర కిలోమీటర్ వద్ద మెట్లతో పాటు, 100 నుంచి150 మంది వరకు నిలబడి ఫొటోలు తీసుకునేలా వ్యూ పాయింట్ ను, రెయిలింగ్ ను ఏర్పాటు చేయనున్నారు.
కేటీఆర్‌తో త్వరలోశంకుస్థాపన చేయిస్తం
గతంలో మున్నేరుకు ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని ప్లాన్చేశారు. అందుకు నదిని ఆనుకొని ఉన్న ఇండ్లను ఖాళీ చేయించి, భూసేకరణ చేపట్టాలి. ప్రత్యామ్నాయంగా కాంక్రీట్ వాల్స్నిర్మించాలని నిర్ణయించాం. వాల్స్ నిర్మాణానికి రూ.690 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు. ఇప్పటికే తీగల వంతెనకు రూ.180 కోట్లు ఇచ్చారు. రూ.30 కోట్లతో మరో మూడు చెక్ డ్యామ్‌లు రానున్నాయి. మున్నేరుపై మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీలైనంత త్వరగా మంత్రి కేటీఆర్చేతుల మీదుగా వాల్స్పనులకు శంకుస్థాపన చేయిస్తాం. రెండేళ్లలో మున్నేరును ఖమ్మం నగరానికి మణిహారంగా తీర్చిదిద్దుతాం.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్