ఆర్మూర్ ఆస్పత్రిని విజిట్ చేసిన మంత్రి హరీశ్
నిజామాబాద్, వెలుగు: కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ హాస్పిటల్ ను మంగళవారం ఆయన విజిట్ చేశారు. హాస్పిటల్ నిర్వహణ, పారిశుధ్యం పనులను పరిశీలించారు. ప్రతీ వార్డుకెళ్లి రోగులతో మాట్లాడారు. ముఖ్యంగా గర్భిణులకు అందుతున్న డైట్ ప్లాన్ తీరును తెలుసుకున్నారు. ఆసుపత్రిలో టిఫా స్కాన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డయాలసిస్ సౌకర్యం లేకపోవడంతో పేషెంట్లు నిజామాబాద్‌కు వెళ్తున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి హరీశ్‌కు చెప్పగా.. స్పందించిన ఆయన 10 రోజుల్లో ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడారు. ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. ఆస్పత్రిలో ఇప్పటికీ 22,670 ఉచిత ప్రసవాలు చేయడం అభినందనీయమన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డా.మధుశేఖర్, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితా, వైస్ చైర్మన్ షేక్ మున్ను, డాక్టర్లు నాగరాజు, అమృత్ రెడ్డి, స్రవంతిలతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవన్ కట్టాలని కాంగ్రెస్ ఆందోళన
బోధన్, వెలుగు: పట్టణంలోని శక్కర్‌నగర్‌లో వార్డు నెంబర్ 23లో అంబేద్కర్ భవన్‌కు కేటాయించిన భూమిలో అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. మంగళవారం ఆ స్థలంలో జెండాలు పాతేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ తలారీ నవీన్ మాట్లడుతూ 2014 లో ఆ భూమిని అంబేద్కర్ భవన్‌కు కేటాయిం చినట్లు తెలిపారు. ఈ భూమిలో మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయ త్నిస్తున్నారని, ఈభూమిని అంబేద్కర్ భవన్‌కే కేటా యించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకృష్ణ, మున్నా, విలాస్, ఇస్మాయిల్, ప్రవీన్, సాయికృష్ణ, జావిద్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
పిల్లల ప్రయోగాలు అదుర్స్..
నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి. ఆయా స్కూళ్ల విద్యార్థులు 415 ప్రయోగాలను ప్రదర్శించారు. మంగళవారం చివరి రోజు కావడంతో రెండు ఎగ్జిబిషన్ల నుంచి 16 ప్రయోగాలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు ఎగ్జిబిషన్ల ఇన్చార్జి గంగా కిషన్ తెలిపారు. జక్రాన్ పల్లి కస్తూర్భా స్కూల్ 9వ తరగతి స్టూడెంట్స్ వైష్ణవి, బస్మిత చేసిన ‘విమెన్ సెఫ్టీ బ్యాగ్’, నిజామాబాద్ ప్రెసిడెన్షియల్ హై స్కూల్ కు చెందిన 9 వ తరగతి స్టూడెంట్ రిషిత్ నయన్ చేసిన బ్లైండ్ సెన్సార్ షూస్, జలాల్ పూర్ జిల్లా పరిషత్ 10వ తరగతి స్టూడెంట్ విజయలక్ష్మి చేసిన రోబోటిక్ స్ప్రె మెషీన్ ప్రత్యేకంగా నిలిచాయి.
రైతులు, బీజేపీ శ్రేణుల ఆందోళన
కామారెడ్డి , వెలుగు : కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై మంగళవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట రైతులు, బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ప్లాన్‌లో ఇండస్ట్రియల్ జోన్, వంద ఫీట్ల రోడ్ల ప్రతిపాదన, గ్రీన్ జోన్లతో నష్టం జరుగుతోందన్నారు. బీజేపీ నియోజక వర్గ ఇన్చార్జీ కాటిపల్లి వెంకట రమణరెడ్డి ఆధ్వర్యంలో లింగాపూర్, అడ్లూర్ఎల్లారెడ్డి, అడ్లూర్, టెకిర్యాల్, ఇల్చిపూర్ రైతులు మంగళవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు. ఏ ప్రాతిపాదికన ముసాయిదా మాస్టర్ ప్లాన్ తయారు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రియల్టర్ల లాభం కోసం రోడ్లు వేస్తున్నారని, ముసాయిదా ప్లాన్‌పై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ... అభ్యంతరాలు స్వీకరించి కౌన్సిల్లో చర్చించిన తర్వాత ఆమోదం తెలుపుతామన్నారు.
బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఆర్మూర్, వెలుగు : బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. భుమేశ్వర్ డిమాండ్ చేశారు. ఆ యూనియన్ స్వర్ణోత్సవ వేడుకలను మంగళవారం పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచయిత్రి, కవి విమల వచ్చారు. బీడీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని, పింఛన్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, ఆకుల రాములు, హరిత, జిందం రాంప్రసాద్, సామల గంగాధర్, ఎండీ కాజా మొయినిద్దీన్, ఇందూరు రాజయ్య, శివకుమార్, జేపీ గంగాధర్, భారతి పాల్గొన్నారు.
జగ్గారావు ఫారం వద్ద పులి సంచారం
నవీపేట్, వెలుగు: మండలంలోని అబ్బాపూర్ శివారులో ని జగ్గారావు ఫారం వద్ద సోమవారం రాత్రి పులి తిరిగినట్టు స్థానికులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మురళీ, జనకంపేట్ నుంచి వస్తుండగా.. అబ్బాపూర్ గుట్టల నుంచి ధర్మారం వైపు పులి రోడ్డు దాటడాన్ని గమనించినట్టు తెలిపారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మ రావు ను సంప్రదించగా.. ఈ ప్రాంతంలో పులి సంచారంపై స్థానికులు పలుసార్లు చెప్పారనీ, గాలింపు చర్యలు చేపట్టినా జాడ దొరకలేదని తెలిపారు. రాత్రి పూట వెహికల్స్‌పై ఒంటరిగా వెళ్లొద్దని, పులి కనిపిస్తే అరవొద్దని సూచించారు.
రైలులో దొంగతనం చేస్తున్న ఒకరి అరెస్ట్
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఓ ప్యాసింజర్నుంచి నగలు, నగదు దోచుకున్న దొంగను అరెస్టు చేసి, సొమ్మను రికవరీ చేసినట్లు రైల్వే ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు. నవంబర్ 14న బోథ్ మండలానికి చెందిన నల్ల అభినేత్రి, తల్లి శకుంతల, తన కొడుకుతో కలిసి బాసరలో రైలులో ప్రయాణిస్తుండా.. ఆమె బ్యాగులో నుంచి బంగారం, నగదు చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో, కేసు నమోదు చేసుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన అంజనా భాయి చోరీకి పాల్పడిందని, రైలులో మరో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. రైల్వే పోలీసులు పట్టుకున్నట్టు ఎస్సై తెలిపారు. ఆమె నుంచి సుమారు రూ. నాలుగు లక్షల విలువచేసే 72 గ్రాములు బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయలు నగదు రికవరీ చేసినట్టు వివరించారు. మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు ఎస్సై పేర్కొన్నారు.