యూనివర్సిటీలపై నిర్లక్ష్యం ఎందుకు?

యూనివర్సిటీలపై నిర్లక్ష్యం ఎందుకు?

వివిధ కారణాల వల్ల విశ్వవిద్యాలయాలు వాటి పూర్వవైభవాన్ని, ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. తెలంగాణలో ఉన్న15 యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే13 వర్సిటీలు నిధులు, నియామకాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే ఉద్యమ కేంద్రాలుగా నిలిచిన విశ్వవిద్యాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వం వర్సిటీలకు కేటాయిస్తున్న బడ్జెట్ నిధులు సరిపోవడం లేదు. దీంతో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లకు, బోధనేతర సిబ్బందికి జీతాలు సకాలంలో అందడం లేదు. విద్యార్థులకు మెస్, హాస్టల్, లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించలేని పరిస్థితి నెలకొంది. దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచలేదంటే నిధుల కేటాయింపులో విశ్వవిద్యాలయాలు ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయో అర్థమవుతుంది. 2022-– 23 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఉన్నత విద్యకు రూ.2,359 కోట్లు కేటాయిస్తే, అందులో వర్సిటీలకు ఇచ్చింది రూ.760 కోట్లు మాత్రమే.

పోస్టులన్నీ ఖాళీగానే..

వర్సిటీలను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య బోధన, బోధ నేతర  సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం. పదవీ విరమణ పొందుతున్న వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో 70 నుంచి 80 శాతం ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ప్రొఫెసర్లు లేక స్టూడెంట్స్​చదువులపై, పరిశోధనలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 2020 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే పేర్కొంది. 8 వేలకు పైగా బోధన, బోధనేతర ఖాళీలు ఉన్నాయి. 1061 టీచింగ్ పోస్టులు భర్తీకి నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, వివిధ కారణాల వల్ల ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయింది. విశ్వవిద్యాలయాల ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్​మెంట్ బోర్డ్(సీర్​బీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదించింది. కానీ బిల్లుపై గవర్నర్ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయకపోవడం వల్ల నియామకాలపై ఇప్పటికీ సందిగ్ధతే కొనసాగుతున్నది.

వీసీల నియామకాల్లో వివాదాలు

వివిధ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల వైస్​చాన్స్​లర్ల(వీసీల) నియామకాల్లో, ఉద్యోగుల నియామకాల్లో రాజకీయ జోక్యం, అవినీతితో వివాదాలు ముసురుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్​భవన్ కి మధ్య నెలకొన్న వైరుధ్యాలు విశ్వవిద్యాలయాలపై కూడా ప్రభావం చూపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విశ్వవిద్యాలయాల వీసీలను రీకాల్ చేయాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లు భావిస్తున్న సందర్భంలో, గవర్నర్లను విశ్వవిద్యాలయాల చాన్స్​లర్ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ జోక్యం, మత, కుల ప్రభావంతో ప్రభ కోల్పోయిన విశ్వవిద్యాలయాల్లో గవర్నర్లను చాన్స్​లర్ బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వర్సిటీలను తమ చెప్పు చేతల్లోకి తీసుకుంటే వాటి స్థాయి మరింత దిగజారే ప్రమాదం ఉంది. విశ్వవిద్యాలయాల నియామకాల్లో ప్రతిభ ఆధారంగా కాకుండా, తమ పార్టీ సానుభూతిపరులను, అనధికార కార్యకర్తలను నియమించుకోవాలని ప్రభుత్వాలు భావించటం విద్యా ప్రమాణాలను దిగజార్చటమే!

ప్రైవేటు యూనివర్సిటీలు ఎవరి కోసం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తూ మొదటి దశలో 7, రెండో దశలో 6 ప్రైవేటు 
విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ రంగంలో 18 యూనివర్సిటీలను ఏర్పాటు చేయగా, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ రంగ వర్సిటీల సమస్యలు గాలికొదిలి, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నది.  ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు తక్కువ నిధులు కేటాయింపులు, నియామకాలు చేపట్టకపోవడం లాంటి పరిస్థితులను చూస్తే, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను  ఉద్దేశపూర్వకంగా బలహీన పరుస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రిజర్వేషన్ల విధానాన్ని పాటించకపోగా భవిష్యత్తులో విద్యను అత్యంత ఖరీదుగా మార్చే ప్రమాదం లేకపోలేదు.

కాంట్రాక్ట్ లెక్చరర్ల మాటేమిటి

రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాల్లో, శాఖల్లో పనిచేస్తున్న11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే ప్రక్రియను ప్రారంభించింది. కానీ రాష్ట్రంలోని13 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు1,365 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, పూర్తి వర్క్ లోడ్ తో పనిచేస్తున్న 700 మంది పార్ట్ టైమ్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్​ విషయాన్ని పట్టించుకుంటలేదు. దీంతో ఏండ్ల తరబడి చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మేరకు కనీసం 30 శాతం వేతనాలు పెంచడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకోలేదు.  కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్ లో ఉన్నత విద్యకు రూ. 40,828 కోట్లు కేటాయించడమే కాదు డిజిటల్ విశ్వవిద్యాలయం, గిఫ్ట్ సిటీల్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే యూనివర్సిటీల్లో పరిశోధన చేస్తున్న స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్  పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యా విధానంలో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విశ్వవిద్యాలయాలను పటిష్టం చేసినప్పుడే దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ బలపడుతుంది. అలాగే యూనివర్సిటీలను బతికించుకునే బాధ్యతలను స్టూడెంట్లు, మేధావులు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

స్వయంప్రతిపత్తి ఎక్కడ

విశ్వవిద్యాలయాలన్నీ యూజీసీ నిబంధనల మేరకు స్వయంప్రతిపత్తితో నడుస్తాయి. అయితే వర్సిటీల్లోని లెక్చరర్ల​నియామకాలను యూజీసీ నిబంధనల ప్రకారం కాకుండా, మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ రకంగా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడం వల్ల యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తితో పనిచేయలేకపోతున్నాయనే భావన వ్యక్తం అవుతున్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీల అధికారులు ప్రతి నిర్ణయానికి ప్రభుత్వంపై ఆధారపడటం, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూడటం వల్ల ఆయా వర్సిటీల్లోని ఏ ఒక్క సమస్యకి పరిష్కారం దొరక్కపోగా ఆ సమస్య తీవ్రత మరింత పెరుగుతూనే ఉంది. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తితో పనిచేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయి. - డా. తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ