- కిందటి ఆర్థిక సంవత్సరం క్యూ2 లో రూ.272 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఐఓసీకి ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ. 12,967.32 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.272.35 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. మార్కెటింగ్‌లోనే కాకుండా రిఫైనింగ్‌లోనూ మార్జిన్స్ (ఆదాయం మైనస్ ఖర్చులు) పెరగడంతో రికార్డ్ లెవెల్ లాభం వచ్చిందని ఐఓసీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ.5 ఇంటెరిమ్ డివిడెండ్‌ను ప్రకటించింది.
గ్లోబల్‌గా క్రూడాయిల్ ధరలు తగ్గినా ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చలేదు. దీంతో కిందటేడాది వచ్చిన నష్టాల నుంచి కంపెనీలు రికవరీ అవ్వగలిగాయి. కిందటేడాది గ్లోబల్‌గా ఆయిల్ ధరలు పెరిగినా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. దీంతో వీటి మార్జిన్లు పడిపోయాయి. నష్టాలు మూటగట్టుకున్నాయి.
ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య ప్రతీ బ్యారెల్ క్రూడాయిల్‌పై 13.12 డాలర్ల లాభం సంపాదించామని ఐఓసీ ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 2.19 కోట్ల టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్‌లను అమ్మామని తెలిపింది.