మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి. రవినాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డ్ సమావేశం నిర్వహించారు.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద యాసంగిలో సాగునీటి విడుదలపై సమావేశంలో చర్చించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం సాగునీటిని విడుదల చేయాలని, ఆయకట్టు అంతటికీ సాగునీటిని ఇచ్చేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని అదనంగా కోయిల్ సాగర్ కి ఎత్తిపోసేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాలని నిర్ణయించారు.
ఈజీఎస్ కింద ప్రాజక్ట్ కుడి, ఎడమ కాలువల్లోని ఒండ్రు మట్టిని, పిచ్చి మొక్కలను తొలగించాలని తీర్మానించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద గతంలో మాదిరిగానే ఈ యాసంగిలో సైతం పూర్తి స్థాయిలో సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయకట్టు అంతటికీ జనవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు నీరందించేలా ప్రపోజల్స్ పంపించాలని సూచించారు.
జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ ఉమామహేశ్వర్ రెడ్డి, చిన్న నీటిపారుదల శాఖ ఎస్ఈ చక్రధరం, డీఏవో వెంకటేశ్, హార్టికల్చ్ ఆఫీసర్ సాయిబాబా, ఇరిగేషన్ ఈఈ ప్రతాప్ సింగ్, డీఆర్డీవో యాదయ్య, అడిషనల్ కలెక్టర్ ఎస్.మోహన్ రావు, ఆర్డీవో అనిల్ కుమార్ పాల్గొన్నారు.