పంటల పరిశీలనకు కమిటీలు..మండలాల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం

పంటల పరిశీలనకు కమిటీలు..మండలాల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం
  • పాలమూరులో కమిటీల ఏర్పాటు
  • ఫీల్డ్​ విజిట్​కు వెళ్లి రిపోర్ట్​ తయారు చేస్తున్న ఆఫీసర్లు
  • అవసరానికంటే ఎక్కువగా వరికి నీళ్లు పెడుతుండడంతో ఎండుతున్న బోర్లు

మహబూబ్​నగర్, వెలుగు:యాసంగిలో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో భూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్భజలాలు వేగంగా పడిపోతుండడం, ప్రాజెక్టులు డెడ్​ స్టోరేజీలకు చేరువ అవుతుండడంతో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాగునీరు అందక చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. కొందరు చేసేది లేక చేలను పశువులకు వదిలేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాలమూరులో వరి పంటల పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండలాల వారీగా కమిటీలు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్​ విజయేందిర బోయి, జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​ వెంకటేశ్​ ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. ఈ కమిటీలు రెండు రోజులుగా మండలాల్లో పర్యటిస్తూ.. వరి పంటల పరిస్థితులపై రిపోర్టును తయారు చేస్తున్నాయి.

ఇది కమిటీ పనితీరు..

కమిటీలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి (ఏవో), మండల ఇరిగేషన్​ ఆఫీసర్​ ఉంటారు. వీరు ప్రతి రోజూ మండలంలోని గ్రామాలను విజిట్​ చేయాలి. అక్కడి వరి సాగు, పరిస్థితులపై వారానికోసారి కలెక్టర్​తో పాటు డీఏవోకు రిపోర్ట్​ అందజేయాలి. ప్రధానంగా వరి పంటకు రైతులు ఏ విధంగా నీటిని అందిస్తున్నారు? ఎక్కడెక్కడ పంటలు ఎండుతున్నాయి? వాటికి గల కారణాలు, బోర్లు ఎక్కడెక్కడ అడుగంటిపోతున్నాయి? వాటికి గల కారణాలను రిపోర్టులో పొందు పరుస్తున్నారు.

అలాగే వరిలో యాజమాన్య పద్ధతులను రైతులకు వివరిస్తున్నారు. నీటిని తక్కువగా వాడుతూ పంటలను ఎలా కాపాడుకోవాలనే దానిపై ఏఈవోలు రైతులను మోటివేట్​చేస్తున్నారు. ఈ విషయాలపై జిల్లా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్​ చేస్తోంది. వీరితో పాటు కలెక్టర్​ కూడా ఫీల్డ్​ విజిట్ కు వెళ్లి ఎండిపోయిన పంటలను పరిశీలించి, వాటికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకుంటున్నారు. 

పాలమూరులో ఇదీ పరిస్థితి

ఈ ఏడాదిలో జిల్లాలో లేటుగా వర్షాలు పడటంతో సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లో బోర్లు రీచార్జ్​ అయ్యాయి. దీంతో యాసంగిలో వరి సాగు గణనీయంగా పెరిగింది. నిరుడు 90 వేల ఎకరాలకే వరి పరిమితం కాగా.. ఈసారి 1.25 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేసినట్లు అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ ద్వారా తెలిసింది. అయితే పంటల సాగు పెరగడంతో బోర్ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. రైతులు కరెంట్​ మోటార్లకు అటోమెటిక్​ స్టార్టర్లు ఏర్పాటు చేయడంతో పంటలకు నీరు అవసరం ఉన్నా, లేకున్నా బోర్లు ఆన్​లోనే ఉంటున్నాయి.

దీంతో నీరంతా దిగువకు వృథాగా పోతోంది. పడావుగా ఉన్న పొలాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రౌండ్​ వాటర్​ వేగంగా పడిపోతుండడంతో బోర్లలో నీళ్లు అంతంత మాత్రంగా వస్తున్నాయి. నవంబర్​లో గ్రౌండ్​ వాటర్​ 5.60 మీటర్ల లెవెల్​లో ఉండగా, డిసెంబరులో 6.78 మీటర్లకు, జనవరిలో 7.85 మీటర్లకు, ఫిబ్రవరిలో 9.21 మీటర్లకు పడిపోయింది.

అవసరానికంటే ఎక్కువగా నీటి వినియోగం..

రైతులు వరి పొలాలకు అవసరానికి మించి నీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరి పొలాలకు రెండు ఇంచుల నీరు చాలు. కానీ, రైతులు ఐదు ఇంచుల నీరు పెడుతున్నారు. దీని వల్ల పక్కనున్న బోర్లపై కూడా ప్రభావం పడుతోంది. వరికి మూడు, నాలుగు ఇంచుల నీరు పెడితే పిలకలు వచ్చే పరిస్థితి ఉండదు. ఒక దండుకు 20 నుంచి 25 పిలకలు రావాలి.

పంట మొదటి దశ నుంచే ఐదు ఇంచుల నీరు పెట్టడం వల్ల కలుపు రాదు. పిలకలు కూడా రావు. పంట దిగుబడి తగ్గిపోతుంది. నీళ్లు తగ్గిపోయినప్పుడు వరి దంట్లు చూస్తే 10, 11 మాత్రమే ఉంటాయి. దీని వల్ల దిగుబడి సగానికి సగం పడిపోతుంది. రైతులు వరి సాగులో చిన్న చిన్న టెక్నిక్స్​ ఫాలో కావాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లు సూచిస్తున్నారు.

దగ్గరుండి నీటిని పెట్టుకోవడం వల్ల నీరు ఆదా అవుతుంది. నీటి వృథాను అరికట్టవచ్చు. పిలక దశలో ఉన్న వరికి రెండు ఇంచుల నీరు చాలు. పొట్ట దశలో ఉంటే మూడు ఇంచుల నీరు మాత్రమే అవసరం అవుతుందని ఐదు ఇంచుల నీరు పెట్టడం వల్ల రాత్రిళ్లు చలికి పంటలకు తెగులు సోకుతుంది. అలాగే తాలు కూడా ఎక్కువగా శాతం వస్తుంది. దీని వల్ల దిగుబడి తగ్గి, రైతుకు నష్టం వస్తుందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

మానిటరింగ్​ చేస్తున్నాం..

మండలాల వారీగా కమిటీలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్​ వచ్చాయి. దాని ప్రకారం కలెక్టర్, మా డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో కమిటీలు వేశాం. ఎప్పటికప్పుడు కమిటీలతో మానిటరింగ్​ చేస్తున్నాం. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి.

6‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 రోజుల పంటకు రెండు ఇంచుల నీరు, 90 రోజుల పంటకు మూడు ఇంచుల నీరు పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ నీరు పెడితే పంటలు దెబ్బతింటాయి. నీరు ఎక్కువ పెండితే పంటకు ఫంగస్​ సోకి చనిపోతుంది. రైతులు అగ్రికల్చర్​ ఆఫీసర్ల సూచనలు పాటించాలి–వెంకటేశ్, డీఏవో, మహబూబ్​నగర్