తెలంగాణలో తొలిసారిగా సర్కారీ ఫిజియోథెరపీ క్లినిక్ లు

తెలంగాణలో తొలిసారిగా సర్కారీ ఫిజియోథెరపీ క్లినిక్ లు
  • ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సెంటర్ల ఏర్పాటు
  • ఎన్జీవోలు, చారిటబుల్  ట్రస్టులకు బాధ్యతలు
  • త్వరలో వృద్ధులకు అందుబాటులోకి రానున్న సేవలు

కరీంనగర్, వెలుగు : ఇప్పటి వరకు కేవలం ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్స్ కే పరిమితమైన ఫిజియోథెరపీ సేవలు త్వరలో సర్కార్  క్లినిక్ ల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ఉమ్మడి జిల్లా కేంద్రానికో ఫిజియోథెరపీ క్లినిక్  చొప్పున ఏర్పాటు చేయాలని సర్కార్  నిర్ణయించింది. వీటిలో వృద్ధులకు ఫిజియోథెరపీ సేవలు అందనున్నాయి. త్వరలో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్  జిల్లా కేంద్రాల్లో క్లినిక్ లను ఏర్పాటు చేయబోతున్నారు. 

వీటి నిర్వహణ బాధ్యతలను ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థలు, చారిటబుల్  ట్రస్టులు లేదా ప్రభుత్వ గుర్తింపు ఉన్న నర్సింగ్ హోమ్, మెడికల్  కాలేజీలకు అప్పగించనున్నారు. క్లినిక్ లు నిర్వహించాలనే ఆసక్తి ఉన్న సంస్థలు ఆర్థిక సాయం పొందేందుకు రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్  సాధికారత శాఖ నోటిఫికేషన్  రిలీజ్ చేసింది. ఒక్కో క్లినిక్ కు ఏటా రూ.15.73 లక్షలు ఇవ్వనున్నారు.  

అనుభవమున్న సంస్థలకు ప్రాధాన్యం.. 

సిబ్బంది గౌరవ వేతనం, ఎక్విప్ మెంట్, మెయింటెనెన్స్, కరెంట్, నీళ్లు, మెడిసిన్, బిల్డింగ్ రెంట్, వ్యాన్  మెయింటెనెన్స్, అత్యవసర ఖర్చుల కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆయా ఎన్జీవోలు, చారిటబుల్  ట్రస్టులు గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వార్షిక నివేదిక, ఆడిట్ రిపోర్టు, బై-లాస్  అందించాలి. గతంలో ఫిజియోథెరపీ క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌ను నడపడంలో అనుభవం ఉన్నట్లయితే వారికి ప్రాధాన్యం ఉంటుంది. 

సదరు వ్యక్తులు తమ క్లినిక్ లో అందించే సౌకర్యాలు, సేవల వివరాలు, రోగుల సంఖ్యను సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధుల సంక్షేమం కోసం సదరు సంస్థల సేవలను వెల్లడించే వివరాలు, అందుకున్న అవార్డుల వివరాలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది.  గతంలో బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్  చేసినా లేదా అధికారులు చర్యలు తీసుకున్న వివరాలు ఉన్నా అందజేయాలి. 

ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లోనే..

దేశంలో ఇప్పటి వరకు అస్సోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్  సహా ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ప్రభుత్వ రంగంలో ఫిజియోథెరపీ క్లినిక్ లు ఉన్నాయి. త్వరలో తెలంగాణలోనూ 10 క్లినిక్ లు ఏర్పాటు కానున్నాయి. ఆ తర్వాత కొత్త జిల్లా కేంద్రాలకు విస్తరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఎవరైనా గాయపడి, సర్జరీ జరిగాక పేషెంట్లకు, ఆర్థోపెడిక్  సమస్యలకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. 

ముఖ్యంగా వృద్ధుల్లో వచ్చే పక్షవాతం, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, భుజం నొప్పి, వెన్ను సమస్యలకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. అలాగే నరాల బలహీనతలు, పని చేసే చోట వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదపడుతుంది.