- ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వెలుగుమట్ల రిజర్వ్ ఫారెస్ట్
- ప్రభుత్వం నుంచి రూ.3 కోట్ల నిధులు మంజూరు
- జింకలపార్క్, బోటింగ్ ఇతర సౌకర్యాలకు ప్లాన్
- ఇప్పటికే రూ.2 కోట్లతో రోడ్డు విస్తరణకు శంకుస్థాపన
ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను మరింత అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్పెట్టింది. కార్పొరేషన్ లిమిట్స్ లో 232 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ఇప్పటికే చిట్టడవిని తలపిస్తోంది. పిల్లలు, పెద్దలు ఫ్యామిలీలో కలిసి వీకెండ్ లో పిక్నిక్ లాగా వెళ్లి ఎంజాయ్ చేసేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. గ్రీనరీ, ఓపెన్ జిమ్, హైటెక్ నర్సరీ, ప్లే ఏరియా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్లేస్ ను సద్వినియోగం చేసుకుంటూ, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రపోజల్స్ సిద్ధం చేయగా, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందుకోసం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే పార్క్ కు వెళ్లే 1.5 కిలోమీటర్ల ప్రధాన రహదారి ప్రస్తుతం సింగిల్ రోడ్డు గుంతలమయం కాగా, దాన్ని డబుల్ రోడ్డుగా విస్తరించే పనులకు రూ.2 కోట్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల శంకుస్థాపన చేశారు. మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఉగాదిలోపు రోడ్డు పనులు పూర్తయ్యే అవకాశముంది. మిగిలిన రూ.3 కోట్లతో మరిన్ని ఏర్పాట్లు, వనరులు కల్పించనున్నారు.
కొత్తగా పనులు ప్లాన్ ఇలా..
అటవీ శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పెడలింగ్ బోట్లు, ఖమ్మం - వైరా మెయిన్ రోడ్డు నుంచి పార్క్ కు వచ్చి వెళ్లేందుకు మినీ బస్సు, పార్కులోకి సైకిళ్లు, వైల్డ్ యానిమల్ రెస్క్యూ సెంటర్ ఏర్పాటు, సందర్శకుల కోసం సోలార్ పార్కింగ్ షెడ్, బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే ఉన్న వాకింగ్ ట్రాక్ లను మరింత అభివృద్ధి చేయడం, టాయ్ ట్రెయిన్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
పార్క్లోపల చైన్ లింక్ ఫెన్సింగ్ ను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసి, జింకల పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వస్తే సత్తుపల్లిలోని జింకల పార్క్ నుంచి, వరంగల్ లోని జూపార్క్ నుంచి జింకలను రప్పించాలని భావిస్తున్నారు. వీకెండ్ లో స్కూల్ విద్యార్థులతో పాటు పెద్దలు కూడా అర్బన్ పార్క్ కు వస్తుండగా, ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తే మిగిలిన రోజుల్లో కూడా టూరిస్టుల రద్దీ పెరుగుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
గతంలో పట్టించేకోపోవడంతో..
ఖమ్మం కొత్త కలెక్టరేట్ కు మూడు కిలోమీటర్ల దూరంలో దాదాపు 500 ఎకరాల్లో వెలుగుమట్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. చాలా ఏళ్లుగా దాన్ని పట్టించుకోకపోవడంతో చాలా వరకు కబ్జాల పాలయ్యింది. సమీపంలోని పుట్టకోట, రుద్రమకోట, కొదుమూరు గ్రామస్తుల ఆక్రమణలో ఉండగా స్థానికులు వ్యవసాయం చేసుకుంటున్నారు. 2017లో స్థానికుల కబ్జాలో ఉన్న 275 ఎకరాలను సేకరించి వెలుగుమట్ల ఫారెస్ట్ పార్క్ గా మార్చారు. అందులోనే 232 ఎకరాలకు చైన్ లింక్ తో ఫెన్సింగ్ ను ఏర్పాటుచేశారు. క్రమంగా పార్క్ లో ప్లాంటేషన్ ను పెంచుతూ వస్తున్నారు. సఫారీ జీప్, సైక్లింగ్, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్‌లు, యోగా షెడ్, చిల్డ్రన్ పార్క్, వాచ్‌టవర్‌ను ఏర్పాటు చేశారు. పార్క్ లో మొత్తం 1.60 లక్షల వివిధ రకాల వృక్షాలు, మొక్కలున్నాయి. పార్కులో 20కి పైగా పక్షి జాతులు కూడా ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
జింకల పార్క్ ఏర్పాటుకు ప్రయత్నం
వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి కోసం రూ.3 కోట్లు మంజూరయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచనల మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నాం. చైన్‌లింక్ ఫెన్సింగ్‌ను పటిష్టంగా ఏర్పాటుచేసిన తర్వాత జింకల పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇప్పటికే అనుమతుల కోసం ప్రపోజల్ పెట్టాం. - సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి, ఖమ్మం
టూరిస్ట్ ఎట్రాక్షన్ గా మారుస్తాం
ఖమ్మం నగరానికి దగ్గరలో విశాలమైన అర్బన్ పార్క్ ఉండడం మన అదృష్టం. నగర వాసులు ఆహ్లాదం కోసం కుటుంబంతో కలిసి వెళ్లేలా అర్బన్ పార్కును తీర్చిదిద్దుతాం. పార్కు స్థలం ఆక్రమణలకు గురికాకుండా కాపాడుతాం. మొత్తాన్ని సర్వే చేయించి, ప్రహరీ నిర్మిస్తాం. ప్రస్తుతం డబుల్ రోడ్డుగా నిర్మిస్తున్న ప్రధాన రహదారిని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఫోర్ లేన్ గా విస్తరించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాం.- తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి