గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్!

గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్!
  • అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరిశీలన
  • సెప్టెంబర్ లేదా డిసెంబర్​లో నిర్వహించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2ను వాయిదా వేయాలని సర్కార్ యోచిస్తున్నది. డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండడం, పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తుండడంతో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా చెప్పడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది.

 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు డీఎస్సీ ఎగ్జామ్స్ జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని షెడ్యూల్ ఇచ్చారు. అయితే గ్రూప్2 వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తుండడంతో పోస్ట్ పోన్ చేయాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. త్వరలోనే గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై సర్కార్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

మళ్లీ ఎప్పుడు?  

గ్రూప్ 2 వాయిదా వేస్తే, మళ్లీ ఎప్పుడు పెట్టాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్​చూసుకుని కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీంతో  సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించే చాన్స్ ఉంది.