కరెంట్ ఉత్పత్తి వైపు రైతుల అడుగులు.. బీడు భూముల్లో సోలార్ పవర్

కరెంట్ ఉత్పత్తి వైపు రైతుల అడుగులు.. బీడు భూముల్లో సోలార్ పవర్
  • కరెంట్ ఉత్పత్తి వైపు రైతుల అడుగులు
  • బీడు భూముల్లో సోలార్ పవర్ జనరేషన్‎కు సర్కార్ ప్రణాళికలు
  • కేంద్రం తీసుకొచ్చిన పీఎం కుసుమ్ స్కీమ్ కింద ఏర్పాటు
  • 4వేల మెగావాట్ల ప్లాంట్ల ఇన్​స్టాలేషన్​కు సన్నాహాలు
  • అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న రెడ్కో.. ఫిబ్రవరి 22 డెడ్​లైన్
  • ఒక్కో యూనిట్‌ను 3.13కు కొనుగోలు చేయనున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌

హైదరాబాద్, వెలుగు: కరెంట్ ఉత్పత్తి వైపు రైతులు అడుగులు వేసేలా రాష్ట్ర సర్కార్ చర్యలు ప్రారంభించింది. వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ జనరేషన్‎కు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రధాన మంత్రి కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాభియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ (పీఎం కుసుమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పథకంలో భాగంగా ఓ వైపు 32 జిల్లాల్లో మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంపిక చేసి.. మహిళా పొదుపు సంఘాలకు 1,000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నది. 

మరోవైపు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్​జీవో)ను రంగంలోకి దించి 3,000 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్ చేయాలని భావిస్తున్నది. రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నది. ఆసక్తిగల రైతుల ఎంపికకు టీజీ రెడ్కో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

రైతులకు అదనపు ఆదాయం

సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు, అర్హుల నుంచి రెడ్కో సంస్థ దరఖాస్తులు సేకరిస్తున్నది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. బీడు భూముల్లోనే సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందొచ్చని ప్రభుత్వం తెలిపింది. రైతులు సొంతంగా లేదంటే ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం, కంపెనీల భాగస్వామ్యంతో పొలంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ఇంధన శాఖ అనుమతి ఇచ్చింది. 

రైతులు.. తమ భూముల్లో 500 కిలో వాట్ల నుంచి రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 33/11 కేవీ సబ్ స్టేషన్‎కు 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్న భూముల్లో మాత్రమే వీటిని ఇన్​స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సబ్​స్టేషన్లతో కూడిన జాబితాను రెడ్కో రిలీజ్ చేసింది. రైతు బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, వాటర్ యూజర్ అసోసియేషన్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మెగావాట్ ప్లాంట్​కు రూ.3.50 కోట్ల ఖర్చు

ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్‎ను ఏర్పాటు చేసుకోవాలంటే రూ.3.50 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. 500 కిలో వాట్‏కు అయితే రూ.1.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టలేని రైతులు, రైతు సంఘాలు.. బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే చాన్స్ ఉంది. అదీ వీలుగాకపోతే.. రైతులు తమ భూమిని సోలార్ డెవలపర్లకు లీజుకు ఇచ్చుకోవచ్చు. భూ యజమానికి, డెవలపర్లకు మధ్య డిస్కమ్‎లతో జరిగే ఒప్పందం మేరకు లీజు మొత్తాన్ని రైతులకు అందిస్తారు.

ఒక్కో యూనిట్ రూ.3.13కు కొనుగోలు

సోలార్ ప్లాంట్ల నుంచి జనరేట్ అయ్యే పవర్‎ను యూనిట్‎కు రూ.3.13 చొప్పున చెల్లించేందుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించింది. 25 ఏండ్ల పాటు కరెంట్‎ను డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఈ నేపథ్యంలో డిస్కంలకు కేంద్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఈ ద్వారా యూనిట్‎కు 40 పైసల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య రహిత కరెంట్ ఉత్పత్తి చేయొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. 

రైతులకు కూడా అదనపు ఆదాయం లభిస్తుంది. కరెంట్ కొనుగోలు చేసిన డిస్కంలు.. 75 రోజుల్లోగా డబ్బులు చెల్లించకపోతే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘ప్రాప్తి’ ఆ డబ్బులు పే చేయడంతో పాటు డిస్కంలకు ఫైన్ వేస్తుంది. ఇలా చేయడంతో ఎక్కువ మంది రైతులు, ఎఫ్​వీవోలు, సోలార్ డెవలపర్లు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తారని భావిస్తున్నారు.