తెలంగాణలో టెంపుల్ టూరిజం సర్క్యూట్! ..3 జిల్లాల్లో 3 రూట్లకు దేవాదాయ శాఖ ప్రణాళిక

తెలంగాణలో టెంపుల్ టూరిజం సర్క్యూట్! ..3 జిల్లాల్లో 3 రూట్లకు దేవాదాయ శాఖ ప్రణాళిక
  • రెండు నెలల కింద టూరిజం శాఖకు ప్రతిపాదనలు 
  • ప్యాకేజీ సిద్ధం చేసి ఆమోదం తెలపడమే తరవాయి
  • ఒకేసారి భక్తులకు పలు ఆలయాల్లో దర్శనం

హైదరాబాద్, వెలుగు: మీరు ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఒకేసారి రెండు, మూడు ఆలయాలు సందర్శించాలనుకుంటున్నారా? మీకోసం ఎండోమెంట్, టూరిజం పైలట్ ప్యాకేజీకి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఒకే రూట్​లో మూడు ఆలయాలను కలిపి ఒక సర్క్యూట్ ​కింద తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు ప్లాన్ రూపొందించింది.  రాష్ట్రంలో మొదటి విడతలో మూడు జిల్లాల్లో మూడు రూట్లలో ఆలయాల సందర్శించుకునేలా రూట్​మ్యాప్​ రెడీ చేసింది. ఇప్పటికే దేవాదాయ శాఖ టెంపుల్ సర్క్యూట్ రూపొందించి టూరిజం శాఖకు ప్రతిపాదనలు పంపించింది.

 ఏ జిల్లాలో ఏ రూట్లలో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఆలయాల్లో అందుబాటులో ఉన్న సేవలు, టికెట్ ధరలు, ప్రసాదాలు, వసతి తదితర వివరాలను టూరిజం శాఖకు పంపిన  ప్రతిపాదనల్లో పొందుపరిచింది. అయితే, టూరిజం శాఖ టెంపుల్ సర్క్యూట్​కు సంబంధించి ప్యాకేజీని తయారు చేయకపోవడంతో ఈ ప్రతిపాదనలు పెండింగ్​లో ఉన్నట్లు తెలిసింది. టెంపుల్ సర్క్యూట్ వల్ల పర్యాటక రంగానికి కొత్తరూపు రావడంతోపాటు ఆలయాలకు భక్తుల సంఖ్య పెరగనుంది. భక్తులకు అనుభూతితో పాటు ఆహ్లాదం పంచడంతోపాటు రెండు శాఖలకు ఆదాయ వనరు సమకూరనున్నది.

మూడు జిల్లాల్లో మూడు సర్క్యూట్లు

భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాల అభివృద్ధి, ఆదాయ వనరులు పెంచేందుకు దేవాదాయశాఖ ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందుకోసం టెంపుల్, టూరిజం సర్క్యూట్లను తెరపైకి తీసుకొచ్చింది. ఒక జిల్లాలోని మూడు ప్రధాన ఆలయాలను కలిపి ఒక సర్య్కూట్​గా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతగా దేవాదాయశాఖ అధికారులు మూడు రూట్లను రూపొందించారు. ఉమ్మడి మహబూబ్​నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ సర్క్యూట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు జిల్లాలలో ఉన్న ప్రముఖ ఆలయాలకు భక్తులు, పర్యాటకులను తీసుకెళ్లడంతో పాటు మార్గం మధ్యలో ఉన్న సందర్శక ప్రాంతాలు తిలకించేలా  రూపొందిస్తున్నారు.

రూట్ మ్యాప్, సేవల వివరాలు..

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో అలంపూర్, మన్యంకొండ, కురుమూర్తి ఆలయాలను కలిపి ఒక సర్క్యూట్ చేశారు. భక్తులు హైదరాబాద్​ నుంచి బయలుదేరితే ఈ మూడు ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు సేవ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్, జోగులాంబ అమ్మవారి టెంపుల్​లో దర్శనం, అర్చన కోసం రూ.200 చెల్లించి టికెట్​ తీసుకోవాలి. వేదాశ్వీరచనం కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఆలయం తరఫున రెండు లడ్డూలు, స్వామివారి  ఫొటో, శేష వస్త్రం, జాకెట్ పీస్ ఇస్తారు. ఇదే సర్క్యూట్​లో మరో టెంపుల్ మన్యం కొండలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ రూ.100 చెల్లిస్తే సర్వ దర్శనంతో పాటు లడ్డూ, శేష వస్త్రం ఇస్తారు. సీసీ కుంట మండలం అమ్మపూర్​లో కురుమూర్తి స్వామి ఆలయంలో వీఐపీ, శీఘ్ర దర్శనానికి రూ.20 ఉంటుంది. ప్యాకేజీ మాట్లాడుకుంటే ఈ సర్క్యూట్​లో మూడు ఆలయాలను సందర్శించవచ్చు.

ఆదిలాబాద్​ జిల్లా బాసరలోని సరస్వతి ఆలయం, కామారెడ్డి జిల్లా ఇస్సాన్​పల్లిలోని కాలభైరస్వామి ఆలయం, నిజామాబాద్ జిల్లాలో బిక్కనూరులోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయాలను ఒక రూట్​గా ప్లాన్ చేశారు. బాసరలో అభిషేకానికి రూ.500 ఉంటుంది. ఒక లడ్డూ, శేష వస్త్రం, రెండు జాకెట్​ పీస్​లు ఇస్తారు. అక్షరాభ్యాసం రూ.1,000, ప్రత్యేక దర్శనానికి రూ.100, వేదాశీర్వాచనం రూ.500 ఉంటుంది. కాలభైరస్వామి ఆలయంలో వీఐపీ దర్శనంతోపాటు వేదాశీర్వచనానికి రూ.300, సిద్ధరామేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం రూ.100, అర్చన రూ.30 నిర్ణయించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రెండో సర్క్యూట్​గా చేశారు. వేములవాడలో రాజరాజేశ్వరస్వామి దేవస్థానం, జగిత్యాల జిల్లాలో కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినవి. ఈ ఆలయాలను సందర్శించి హైదరాబాద్​కు వస్తూ మార్గం మధ్యలో ఉన్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఇందుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్రేక్ దర్శనం రూ.300, వేదాశీర్వచనం రూ.1,000, కోడె మొక్కు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. కొండగట్టులో వీఐపీ దర్శనంతో పాటు వేదాశీర్వచనం రూ.400 ఉంటుంది. లడ్డూ ప్రసాదం, తదితర పూజలకు రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వీఐపీ దర్శనంతో పాటు అర్చన రూ.200, వేదాశీర్వచనం రూ.500 ఉంటుంది. తిరుగు ప్రయాణంలో  సిద్దిపేట జిల్లాలోని  కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయంలో రూ.650 చెల్లిస్తే వీఐపీ దర్శనంతోపాటు వేదాశీర్వచనం ఉంటుంది.

రెండు నెలలుగా పెండింగ్​ 

ఆలయాలకు ఆదాయం సమకూర్చడంతో పాటు పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించేం దుకు టెంపుల్ టూరిజం సర్క్యూట్​కు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. మూడు జిల్లాల్లో మూడు రూట్లలోని ఆలయాలను కలుపుతూ ఎండో మెంట్​ అధికారులు రూట్ మ్యాప్ తయారు చేసి ప్రతిపాదనలను పర్యాటక శాఖకు పంపారు. అయితే, రెండు నెలలుగా టూరిజం శాఖ వద్ద ఈ ప్రతిపాదనలు పెండింగ్​లో ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ ప్రతిపాదనలు ఒకే చేసి రూట్ల వారీగా ప్యాకేజీ రెడీ చేస్తే టెంపుల్, టూరిజంకు మార్గం సుగమం కానున్నది.