- గతంలో చేప పిల్లల పంపిణీలో భారీగా అక్రమాలు
- చేప పిల్లలు వడలకుండానే బిల్లులు ఎత్తిన కాంట్రాక్టర్లు
- మరోవైపు బినామీ పేర్లతో టెండర్లను వేసిన బీఆర్ఎస్ లీడర్లు
- ఇటీవల తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు
సూర్యాపేట, వెలుగు : ఈ ఏడాది అక్రమాలకు తావివ్వకుండా చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల టెండర్లను ఆహ్వానించగా దాదాపు సగం జిల్లాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన చేప పిల్లల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో చేపలను వేయకుండానే బినామీ పేర్లతో బీఆర్ఎస్ లీడర్లే కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు.
ఉచిత చేప పిల్లల పేరుతో కోట్ల స్కామ్ చేయగా మత్స్యకారులు చేపలను వేయడం లేదంటూ గతంలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేప పిల్లల అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టగా ప్రతి జిల్లాలో అక్రమాలు జరిగినట్లు తేల్చారు. దీనితో ఈ ఏడాది అనుకున్న టార్గెట్ కంటే తక్కువ చేప పిల్లలను వదులుతున్నారు.
100 శాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ..
100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా 2024 -–25లో 3.60 కోట్ల పిల్లలను పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం 1.70 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయనున్నారు. వీటిలో 35 -–40 ఏంఏం చేప పిల్లలు 48.84 లక్షలు, 80 -–100 ఏంఏం చేప పిల్లలు 121.75 లక్షలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 850 చెరువులతోపాటు పులిచింతల రిజర్వాయర్ ఉన్నది.
వీటిపై 139 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 3 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 15,376 మంది సభ్యులు ఉన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో జూలైలో చేప పిల్లలను పోయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. గత నెలలో టెండర్లు ఖరారు చేసినప్పటికీ ఫీల్డ్ లెవల్ లో ఎంక్వైరీ చేయగా కాంట్రాక్టర్లు చూపించిన విధంగా చేపల చెరువులు లేవని అధికారులు మరోసారి రద్దు చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పంపిణీలో అక్రమాలు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీలో భారీగా గోల్మాల్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ కు చెందిన లీడర్లే ఏటా బినామీ పేర్లతో చేప పిల్లల టెండర్లు వేస్తున్నారు. వీరికి సొంతంగా ఫామ్స్ లేకున్నా మత్స్యశాఖ ఆఫీసర్లతో చేతులు కలిపి టెండర్లను దక్కించుకున్నారు. ఇదే తరహాలో ఈసారి కూడా అక్రమ పద్ధతిలో టెండర్లలో పాల్గొనాలని స్కెచ్ వేశారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఈసారి టెండర్లలో ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడికి కేవలం ఆర ఏకరంలోనే ఫామ్ ఉండగా తన పేరుపై 10 హెక్టార్లలో ఫామ్ ఉన్నట్లు చూపిస్తూ టెండర్లలో పాల్గొంటూ మేనేజ్ చేస్తున్నాడు. ఫీల్డ్ వెరిఫికేషన్ లో అసలు ఫామ్ లేదని అధికారులు తేల్చి చెప్పారు.
అంతేకాకుండా గతంలో చేప పిల్లలను పంపిణీ చేయకుండా చేసినట్లు, తక్కువ సైజ్ ఉన్న చేప పిల్లలను పోసి కోట్లలో బిల్లులు ఎత్తారు. ఈ అక్రమాలపై జరిపిన విజిలెన్స్ ఎంక్వైరీ లో సైతం చేప పిల్లలను పోయకుండానే పోసినట్లు బిల్లులు తీసుకున్నారని రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో అధికారుల హస్తం ఉందంటూ తేల్చారు.