వాహనదారులపై టోల్ ఫీజుల భారాన్ని కాస్తంత తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రైవేట్ కార్ ఓనర్లకు సరికొత్తగా ‘టోల్ పాస్ విధానం’ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ టోల్ పాస్ విధానంలో రెండు ఆప్షన్లను వాహనదారులకు ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయింది. వార్షిక టోల్ పాస్ రూ. 3000, లైఫ్ టైం టోల్ పాస్ రూ.30 వేలకు అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వార్షిక టోల్ పాస్తో ఒక సంవత్సరం పాటు, లైఫ్ టైం టోల్ పాస్తో అన్ లిమిటెడ్గా జాతీయ రహదారులపై కార్లు రాకపోకలు సాగించే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది.
మధ్య తరగతి కుటుంబాలకు, తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్న వాహనదారులకు టోల్ భారాన్ని వీలైనంత తగ్గించేందుకు కేంద్రం ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా నెలవారీ టోల్ పాస్ సిస్టం అమల్లో ఉంది. నెలకు 340 రూపాయలు. అంటే.. సంవత్సరానికి 4,080 రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఖర్చును మరింత తగ్గిస్తూ 3 వేల రూపాయలకే వార్షిక టోల్ పాస్ను తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది.
ఇక.. లైఫ్ టైం పాస్ వ్యాలిడిటీ విషయానికొస్తే.. 30 వేలు చెల్లించి లైఫ్ టైం టోల్ పాస్ తీసుకుంటే 15 ఏళ్ల పాటు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు. తరచుగా నేషనల్ హైవేలపై దూర ప్రయాణాలు చేస్తుండే కారు ఓనర్లకు ఈ లైఫ్ టైం టోల్ పాస్ బెటర్ సొల్యూషన్. ఫాస్టాగ్ (FASTag) టెక్నాలజీతో కూడా ఈ కొత్త టోల్ పాస్లను ఇంటిగ్రేట్ చేయనున్నారు. అందువల్ల.. ప్రతిసారి కొత్త పాస్లు కొనాల్సిన అవసరం కూడా కారు ఓనర్లకు ఉండదు. ప్రస్తుతం ఉన్న టోల్ విధానంపై వాహనదారుల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ టోల్ పాస్ల విధానం ఆలోచన చేసింది.