శంకుస్థాపన చేసిన్రు కానీ.. చెక్​ డ్యామ్​లు కట్టలే

శంకుస్థాపన చేసిన్రు కానీ.. చెక్​ డ్యామ్​లు కట్టలే
  • మన్యంలో చెక్​ డ్యామ్​ల నిర్మాణంపై నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం
  • 2018లోనే డిజైన్లు, టెండర్లు పూర్తి
  • ఏండ్లుగా ఎదురుచూపుల్లో ఆదివాసీలు 
  • ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని వేడుకోలు 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం మన్యంలో గిరిజనుల బీడు భూములకు సాగునీరు అందించాలని సర్కారు చెక్ డ్యామ్​లను మంజూరు చేసింది. నిధులిచ్చింది. కానీ శంకుస్థాపన చేసి కట్టడం మరిచిపోయారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా ఇంకా పనులు మొదలు కాకపోవడంతో సాగునీటి కోసం ఆదివాసీలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

ఇది పరిస్థితి.. .

చర్ల మండలం పెదమిడిసిలేరు వద్ద రూ.3.40కోట్లతో, దుమ్ముగూడెం మండలం గుర్రాలబైలు, బొజ్జిగుప్ప గ్రామాల్లో వాగులపై రెండు చెక్​ డ్యామ్​లను రూ.6.80కోట్లతో నిర్మించేందుకు ఈ ఏడాది మార్చి 16న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా గిరిజన రైతులు తమ బీడు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం 2018 ఆగస్టులో గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చి,  నిధులను కేటాయించింది. వాగులపై 55 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, ఆరున్నర అడుగుల ఎత్తున చెక్ డ్యామ్​ నిర్మించాలని డిజైన్ చేశారు. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేశారు. అయినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 

ఏళ్లుగా ఎదురుచూపులే.. 

పెదమిడిసిలేరు, గుర్రాలబైలు, బొజ్జిగుప్ప గ్రామాల ఆదివాసీలు ఎన్నో ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. దగ్గరలోనే వాగులు ప్రవహిస్తున్నా పంటలు సాగు చేసుకునే సమయానికి చుక్కనీరు ఉండటం లేదు. వర్షం వస్తేనే పంటలకు నీళ్లు. దీనికి తోడు గ్రామాల్లో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. బోర్లలో కూడా నీరు ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాగునీటికి అడ్డుకట్ట వేస్తే భూగర్భ జలాల పెంపుతో పాటు, ఆయిల్ ఇంజన్లతోనైనా పంటలకు సాగునీటిని మళ్లించుకునే వీలు కలుగుతుందని, వెంటనే చెక్ డ్యామ్​ ల నిర్మాణ పనులు చేపట్టాలని ఆదివాసీలు కోరుతున్నారు. 

పనులు వెంటనే ప్రారంభించాలి

చెక్​ డ్యామ్​ల పనులు వెంటనే ప్రారంభించాలి. సాగునీటి కోసం రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి కూడా వేధిస్తోంది. ఎన్నో ప్రయోజనాలు కల్పించే ఈ డ్యామ్​లు ఆదివాసీలకు ఎంతో అవసరం. ప్రభుత్వం నిధులు ఇచ్చాక కూడా పనులు చేయడంలో నిర్లక్ష్యంగా ఉండడం సరికాదు. –  ఇర్పా రాజు, చర్ల

కాంట్రాక్టరుకు నోటీసులిచ్చాం

వర్షాల కారణంగా అక్టోబరు నెలాఖరున చెక్​డ్యామ్​ల పనులు ప్రారంభిస్తారు. ఈ విషయంలో కాంట్రాక్టర్​కు నోటీసులు కూడా ఇచ్చాం. వర్షాలు తగ్గిన వెంటనే స్పీడ్​గా పనులు చేపిస్తాం.– రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్, భద్రాచలం