డీప్‌‌ఫేక్‌‌ పోస్టింగ్​పై పోలీస్ యాక్షన్‌‌

డీప్‌‌ఫేక్‌‌ పోస్టింగ్​పై పోలీస్ యాక్షన్‌‌
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ సోషల్‌‌ మీడియా టీమ్‌‌పై చర్యలకు రంగం సిద్ధం
  • ఇప్పటికే 7 కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
  • దిలీప్‌‌, క్రిశాంక్‌‌, థామస్‌‌ అగస్టీన్‌‌ పైనా ఎఫ్ఐఆర్
  • ఆందోళన చేసిన బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలపైనా కేసులు
  • త్వరలో నిందితులందరికీ నోటీసులిచ్చి విచారణ!

హైదరాబాద్‌‌, వెలుగు:  కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఫేక్‌‌  న్యూస్  ప్రచారం చేసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌  సోషల్‌‌ మీడియా, ఐటీ వింగ్‌‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్‌‌  పోలీసులు రంగం సిద్ధం చేశారు. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్‌‌  చేసి రెచ్చగొట్టేలా సోషల్‌‌ మీడియాలో పోస్టింగ్‌‌  చేశారని బీఆర్‌‌‌‌ఎస్‌‌  సోషల్‌‌ మీడియా ఇన్‌‌చార్జి కొణతం దిలీప్, క్రిశాంక్‌‌, థామస్‌‌ అగస్టీన్ పై గచ్చిబౌలి పీఎస్‌‌లో ఇదివరకే కేసులు నమోదయ్యాయి. ఫేక్ న్యూస్‌‌కు సంబంధించి టీపీసీసీ సోషల్‌‌ మీడియా చైర్మన్‌‌  మన్నె సతీశ్ కుమార్‌‌‌‌, పలువురు ఎన్‌‌ఎస్‌‌యూ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గచ్చిబౌలి పోలీసులు 7 ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేశారు. జింక చనిపోయినట్లు మార్ఫింగ్‌‌  చేసిన వీడియోలు, ఫొటోలను తయారు చేసి సోషల్‌‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో బీఆర్‌‌‌‌ఎస్‌‌  సోషల్‌‌ మీడియా, ఐటీ టీమ్‌‌ సభ్యులను కూడా నిందితులుగా చేర్చారు.

 శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా కుట్రపన్నినట్లు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లో పేర్కొన్నారు. డీప్‌‌ ఫేక్‌‌ తో క్రియేట్‌‌  చేసిన జింక మార్ఫింగ్‌‌  వీడియోలను సేకరించారు. బీఆర్‌‌‌‌ఎస్  అధికారిక ఇన్‌‌స్టాగ్రాం సహా ఎక్స్‌‌ లో పోస్టు  చేసిన ఫొటోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. క్రిశాంక్‌‌ తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు తమ సోషల్‌‌ మీడియా అకౌంట్లలో తప్పుడు కథనాలు ప్రచారం చేసినట్లు  గుర్తించారు. ఈ మేరకు ఆయా అకౌంట్లకు చెందిన వారిని నిందితులుగా చేర్చి కేసులు నమోదు చేశారు. వీరితో పాటు హెచ్‌‌సీయూ వద్ద ఆందోళనకు దిగిన  బీజేపీ, ఏబీవీపీ, సీపీఎం కార్యకర్తలు సహా దాదాపు 150 మందిపైనా ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు రిజిస్టర్  చేశారు. హెచ్‌‌సీయూలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తరువాత నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. హెచ్‌‌సీయూ విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.