ఊర్ల నుంచి టౌన్లకు .. తెలంగాణలో శరవేగంగా పట్టణీకరణ

ఊర్ల నుంచి టౌన్లకు .. తెలంగాణలో శరవేగంగా పట్టణీకరణ
  • గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు 
  • పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు 
  • రాష్ట్రంలో అర్బనైజేషన్ రేట్ 38 శాతం
  • ఇది జాతీయ సగటు కంటే 7 శాతం ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జనం పట్టణాల బాట పడుతున్నారు. పల్లెలను వదిలి సిటీలకు వలస వస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం టౌన్లకు చేరుకుంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, ఆ పనులు చేసేటోళ్లు తగ్గిపోవడం కూడా వలసలకు కారణమవుతున్నాయి. ఈ విషయాలన్నీ ఇటీవల ప్రభుత్వం విడుదల​ చేసిన కులగణన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ సర్వే రిపోర్టు ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల సంఖ్య 66 లక్షలు కాగా, పట్టణాల్లోని కుటుంబాల సంఖ్య 45 లక్షలు. అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 21 లక్షల కుటుంబాలే. అంటే రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరగుతున్నదని అర్థమవుతున్నది.

 అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు.. జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నది. దేశంలో అర్బనైజేషన్ రేటు 31 శాతంగా ఉంటే, అది రాష్ట్రంలో 38 శాతంగా ఉన్నది. కాగా, పట్టణాల్లో నిత్యం ట్రాఫిక్, కాలుష్యం ఉంటున్నా సరే.. చదువులు, ఉద్యోగాలు, ఉపాధితో పాటు అవసరమైన సౌలతులు పట్టణాల్లోనే ఉండడంతో ఎక్కువ మంది సిటీల్లోనే నివాసం ఏర్పరుచుకుంటున్నారు. గ్రామాల్లో సొంత ఇండ్లు ఉన్నప్పటికీ, పట్టణాలకు వలస వచ్చి కిరాయికి ఉంటున్నారు. ఇలాంటి కుటుంబాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 

ప్రస్తుతానికి గ్రామాల్లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నట్టు సర్వేలో తేలిందని, కానీ కొన్నేండ్ల తర్వాత గ్రామీణ ప్రాంతాల కంటే  పట్టణాల్లోనే ఎక్కువ కుటుంబాలు ఉంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వచ్చే పదేండ్లలో పట్టణాల్లో ఉండే కుటుంబాల సంఖ్య పెరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ట్రాన్స్​పోర్ట్​మొబిలిటీ పెంచి, ఎంటర్​టైన్​మెంట్​జోన్లు కల్పించి, రాష్ట్రవ్యాప్తంగా సమాంతర డెవలప్​మెంట్​చేస్తే గ్రామాల నుంచి వలస వెళ్లే కుటుంబాల సంఖ్య తగ్గుతుందంటున్నారు. 

మూడు జిల్లాల్లోనే ఎక్కువ కుటుంబాలు.. 

కులగణన సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే.. పూర్తిగా పట్టణీకరణ చెందుతున్న జిల్లాల్లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. 30 శాతానికి పైగా ఫ్యామిలీలు మూడు జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కలిపి 34.88 లక్షల కుటుంబాలు ఉన్నట్టు సర్వేలో తేలింది. రాష్ట్రంలో మొత్తం కోటి 16 లక్షల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లో 25,05,517, రంగారెడ్డిలో 6,04,421, మేడ్చల్ లో 3.79 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 

ఈ జిల్లాల్లోనే ఎక్కువగా కంపెనీలు, విద్యాసంస్థలు ఉండడంతో చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం పెద్ద ఎత్తున జనం ఈ జిల్లాలకు వలస వస్తున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 70 శాతం మందికి సొంత ఇండ్లు లేవని, వాళ్లందరూ అద్దెకు ఉంటున్నారని చెప్పారు. ఇక పట్టణీకరణ పెరిగిన జిల్లాల్లోనూ.. ఆ జిల్లాల్లోని గ్రామాల కంటే జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా కుటుంబాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 5 లక్షల 7 వేల  ఫ్యామిలీలు ఉంటే.. అందులో 35 శాతం కుటుంబాలు జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి పట్టణాల్లోనూ ఎక్కువ సంఖ్యలో కుటుంబాలు ఉంటున్నాయి. 

రెండేండ్లలో 50:50 

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పట్టణీకరణలో రెండున్నర దశాబ్దాలు ముందున్నదని గతంలో నీతి ఆయోగ్​ వెల్లడించింది. ఈ మేరకు 2022లో ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నది. 2025 పూర్తయ్యే నాటికి తెలంగాణలో 50 శాతం పట్టణీకరణ జరుగుతుందని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం చేసిన కులగణన సర్వే ప్రకారం చూస్తే.. పట్టణీకరణ 42 శాతం దాటింది. ఈ ఏడాది పూర్త య్యే నాటికి ఇంకింత పెరిగే చాన్స్​ ఉంది. వచ్చే రెండు మూడేండ్ల లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సరిసమా నంగా కుటుంబాలు ఉంటా యని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగు ణంగా పట్టణాభివృద్ధి సంస్థలను పెంచింది. గతంలో రాష్ట్రంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలే ఉండగా, వాటి సంఖ్యను 28కి పెంచింది.