- అభివృద్ధి పనులకు రూ. 32 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు
- నూకపల్లిలో 4,500 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం
- దసరా నాటికి అందించేలా చురుగ్గా కొనసాగుతున్న పనులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలోని నూకపల్లిలో నిర్మించిన 4,500 డబుల్ బెడ్ రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేసింది. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినప్పటికీ తాగునీరు, కరెంట్, డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. ఫండ్స్ లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జగిత్యాల అర్బన్ పేదల కోసం నూకపల్లి లో 4,520 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసింది. 3,722 ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కావడంతో 2023 అక్టోబర్‌లో లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందజేశారు.
మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు, కరెంట్ కనెక్షన్స్ పూర్తి చేయలేదు. దీంతో లబ్ధిదారులు తాళాలు వేసి అద్దె ఇండ్లలోనే ఉంటున్నారు. రాష్ట్ర సర్కారు తాజాగా డబుల్ ఇండ్లలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 32 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఆయా పనులు మొదలు కాగా.. దసరా లోపు పూర్తి చేసి లబ్ధిదారులు ఇండ్లలోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ
తాజాగా మరో 789 ఇండ్లు పూర్తి కావడంతో ఆఫీసర్లు మీ సేవా ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటి కోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను ఈ నెల 09 వరకు స్వీకరించగా, 198 దరఖాస్తులు రాగా, అర్హత ఉన్నా ఎంపిక కానీ వారు 144 మంది, మ్యాన్ వల్ గా 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో వారం రోజులు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకునే సమయాన్ని పొడిగిస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వినతితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ. 32 కోట్ల ఫండ్స్ మంజూరు కావడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకై రూ.18.21 కోట్లు, ట్రాన్స్ ఫార్మర్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు ఇతర అభివృద్ధి పనులకై మరో 14. 15 కోట్లు మంజూరు చేశారు. ఈ ఫండ్స్ వినియోగం కోసం ప్రత్యేక జీవో కూడా విడుదల చేశారు. ఈ పనులు పూర్తి అయితే దసరా నాటికి 2 వేల ఇండ్లలో పూర్తి స్థాయి లో అన్ని వసతులు సమకూరనున్నాయి.