వరంగల్ జిల్లాలో వనదేవతల ఆలయాలు పునర్నిర్మాణం

వరంగల్ జిల్లాలో వనదేవతల ఆలయాలు పునర్నిర్మాణం
  • మేడారం సమ్మక్క సారలమ్మ టెంపుల్స్​కోసం రూ.188 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం
  • రాతి కట్టడానికి ఇంజినీర్ల ప్లాన్‌‌
  • ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం టెంపుల్స్‌‌ నిర్మిస్తామంటున్న ఆఫీసర్లు
  • వచ్చే మహా జాతర నాటికి పనులు కంప్లీట్‌‌ చేయాలని ఆదేశం

జయశంకర్‌‌ భూపాలపల్లి/ తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాల పునర్నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీ పూజారుల కోరిక మేరకు దేవాదాయ శాఖ ఒక్కో టెంపుల్‌‌ కోసం రూ.94 లక్షల చొప్పున మొత్తం రూ.1.88 కోట్లను మంజూరు చేసింది. దీంతో ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. 2026లో జరిగే మేడారం మహా జాతర సమయానికి పనులు కంప్లీట్‌‌ చేసేలా ఇంజినీర్లు గడువు విధించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం టెంపుల్స్‌‌ పునర్నిర్మిస్తామని ఆఫీసర్లు తెలిపారు. 

ఆలయాల్లో వనదేవతల వస్తువులు..

మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ, పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులు ఆలయాలు ఉన్నాయి. పూర్వం గడ్డితో నిర్మించిన ఆలయాలు ఉండగా, 1971లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ టెంపుల్స్​నుకొత్తగా నిర్మించింది. ఇవి కట్టి కూడా 53 ఏండ్లు గడిచాయి. రెండేండ్లకోసారి జరిగే మహా జాతర, ఏడాదికోసారి నిర్వహించే మినీ జాతర సమయంలో ఆదివాసీ పూజారులు ఈ టెంపుల్స్‌‌ను శుభ్రం చేసి, పూజలు చేస్తుంటారు. వనదేవతలు ధరించిన ఆయుధాలు, పూజా సామగ్రి, మువ్వలు, గజ్జెలు, ఆడేడాలు, కత్తులు, కుంకుమ భరిణెలు, పసుపు, కుంకుమ ఇతర ముఖ్య వస్తువులన్నీ కూడా ఈ ఆలయాల్లోనే భద్ర పరుస్తారు. 

రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలో ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆదివాసీ పూజారులు అమ్మవార్ల పసుపు, కుంకుమ భరిణెలను తీసుకొని చిలుకుల గుట్టకు, అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లి రావడం ఇబ్బందిగా మారింది. గుడులు ఇరుకుగా ఉండి ఒత్తిడి పెరుగుతుండటంతో పూజారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఆలయాలను కట్టి కూడా ఏండ్లు గడుస్తుండడంతో పునర్నిర్మించాలని పూజారులు ప్రభుత్వాన్ని కోరారు. 

పునర్నిర్మాణాలకు రూ.1.88 కోట్లు.. 

మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.88 కోట్లు కేటాయించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, మేడారం ప్రధాన పూజారి అరుణ్‌‌, మునేందర్‌‌, కొక్కర కృష్ణయ్య, కాక సారయ్యతోపాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు పూజారుల విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నచోటనే ఆలయాలను నిర్మాస్తామని దేవాదాయ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం రాతితో కడతామన్నారు. టెండర్‌‌ ప్రక్రియ జరుగుతుందని, 2026 మహాజాతర వరకు పనులు కంప్లీట్‌‌ చేసేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. 

ఇరుకుగా ఉంది.. 

మేడారంలోని సమ్మక్క ఆలయం చిన్నగా, ఇరుకుగా ఉంది. ఏటా పూజలు చేసే సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ఆదివాసీ పూజారులు, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని పునర్నిర్మించాలని ప్రభుత్వానికి పూజారుల సంఘం తరపున విజ్ఞప్తి చేసినం. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వెంటనే టెండర్‌‌ ప్రక్రియ కంప్లీట్‌‌ చేసి పనులు ప్రారంభించాలి.

సిద్ధబోయిన మునేందర్, సమ్మక్క దేవత ప్రధాన పూజారి, మేడారం 

టెండర్‌‌ ప్రాసెస్‌‌ జరుగుతోంది..

మేడారం సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ పూజామందిరాల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.88 కోట్లు కేటాయించి, నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం టెండర్‌‌ ప్రాసెస్‌‌ జరుగుతోంది. త్వరలోనే కంప్లీట్‌‌ చేసి పనులు మొదలుపెడతాం. 2026 మహాజాతర నాటికి పనులు పూర్తి చేస్తాం.

రాజేందర్‌‌, మేడారం ఈవో

వెంటనే పనులు స్టార్ట్‌‌ చేయాలి..

మేడారం మహాజాతర కోసం దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. సమ్మక్క, సారలమ్మను గద్దెమీదికి తీసుకురావడం అతి పెద్ద సవాల్‌‌తో కూడుకున్న పని. ఆలయాలు ఇరుకుగా ఉండటం వల్ల ఆదివాసీ పూజారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయించడం ఎంతో శుభ సూచకం. 

కుక్కెర కృష్ణయ్య, సమ్మక్క దేవతను గద్దెకు తీసుకొచ్చే పూజారి