సర్కారు మిడ్​డే మీల్స్ మంజూరు చేసినా.. స్కూళ్లకు అందని ఫండ్స్​

సర్కారు మిడ్​డే మీల్స్ మంజూరు చేసినా.. స్కూళ్లకు అందని ఫండ్స్​
  • ఎస్​ఎస్​ఏ సమ్మె ఎఫెక్ట్
  • స్కూల్స్​లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు తప్పని తిప్పలు
  • సత్వరం బిల్లులు అందించేలా చూడాలంటున్న కార్మికులు
  • ఉమ్మడి వరంగల్​జిల్లాకు మంజూరైన బిల్లులు రూ.45,898,496

మహబూబాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్​ నెలల పెండింగ్​ బిల్లులను మంజూరు చేసింది. రాష్ట్ర స్కూల్​ఎడ్యూకేషన్​ డైరెక్టర్​ ఈవీ నర్సింహారెడ్డి ఈ నెల10న ఫండ్​విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్​లో విధులు నిర్వహించే కాంట్రాక్ట్​ కంప్యూటర్​ ఆపరేటర్లు, ఎమ్మార్పీలు  14 రోజులుగా సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​నుంచి జిల్లాల డీఈవోల ఎకౌంట్​కు నిధులు జమ అవుతాయి.

ఆ తర్వాత మండలాల వారీగా ఎంఈవోల లాగిన్​ నుంచి పాఠశాలల వారీగా  మధ్యాహ్నభోజన తయారీ కార్మికుల బ్యాంక్​ఎకౌంట్​లోకి వేయవలసి ఉంటుంది. కంప్యూటర్​ పాస్​వర్డ్, లాగిన్​ కంప్యూటర్​ ఆపరేటర్లకే తెలిసి ఉండటం, వారి సహకారం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్​జిల్లాలో స్కూళ్లకు రూ.45,898,496  నిధులు మంజూరు చేసినా పాఠశాలలకు పంచలేని పరిస్థితి నెలకొన్నది.

కాగా, జిల్లాల వారీగా మూడు నెలలకు సంబంధించిన మధ్యాహ్నభోజన కుకింగ్​చార్జీలు, నిర్వాహకులకు ప్రతి నెల అందించే గౌరవ వేతనం రూ.1,000, అక్టోబర్, నవంబర్​ నెలల రాగి జావా బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసింది.

పెండింగ్​బిల్లులను అందించాలి..

మధ్నాహ్నభోజన తయారీకి నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరుగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రతీ నెల నిర్వహణకు పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మూడు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్​ బిల్లులను మంజూరు చేసినా, సమగ్ర శిక్షా అభియాన్​కంప్యూటర్​ఆపరేటర్ల సమ్మె కారణంగా మాకు చెల్లించవలసిన బిల్లులను పట్టించుకోకపోవడం తగదు. తక్షణం పెండింగ్​బిల్లులు అందించేలా చర్యలను చేపట్టాలి.

- గాడిపెల్లి నాగమణి, మధ్నాహ్నభోజన నిర్వాహకురాలు, చిన్నగూడురు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..

సమగ్ర శిక్షా అభియాన్​ కాంట్రాక్ట్​ ఉద్యోగులు, కంప్యూటర్​ ఆపరేటర్లు సమ్మె చేస్తున్నారు. ప్రతీ మండలంలో కంప్యూటర్ల ద్వారా ఆన్​లైన్​ బిల్లుల చెల్లింపుల బాధ్యతలను వారు నిర్వహించే వారు. మండలాల వారీగా ఎంఈవోలతో నూతనంగా పాస్​వర్డ్​ కేటాయింపు, లాగిన్​రూపొందించి కంప్యూటర్​ పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సహకారం తీసుకుని పెండింగ్​బిల్లులు చెల్లించే విధంగా తగిన చర్యలను తీసుకుంటాం. మధ్యాహ్నభోజన తయారీ కార్మికులు ఆందోళన చెందవద్దు.

 - రవీందర్​ రెడ్డి, డీఈవో, మహబూబాబాద్​ జిల్లా

ఉమ్మడి జిల్లాలో మధ్యాహ్న బిల్లుల మంజూరు వివరాలు (లక్షల్లో..)

జిల్లా                         కుకింగ్​ చార్జీలు     గౌరవ వేతనం    రాగిజావ    మొత్తం

హనుమకొండ               58,98,691              24,39,8000           3,11,477    83,36,691
జనగామ                        45,91,825               24,42,000            2,94,862    73,28,687
మహబూబాబాద్         1,21,69,964             39,16,228            7,21,445    1,68,07,637
ములుగు                        24,90,281               20,71,217             1,94,662    47,56,160
వరంగల్                        56,45,925              26,84,000              3,39,396    86,69,321