కరెంట్​ ఉంటలేదు.. నీళ్లొస్తలేవ్

  • జడ్పీ జనరల్ ​బాడీ మీటింగ్​లో ​అధికారులపై సభ్యుల ఫైర్​ 

మంచిర్యాల, వెలుగు: అంతటా 24 గంటల కరెంట్​ఇస్తున్నామని, ఇంటింటికీ మంచినీళ్లు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గ్రామాల్లో కరెంట్ చీటికీమాటికీ పోతోంది. భగీరథ నీళ్లు రావడంలేదని జడ్పీ మీటింగ్​లో సభ్యులు అధికారులను నిలదీశారు. మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం జిల్లా పరిషత్​సర్వసభ్య సమావేశం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా లోకల్​ బాడీస్ ​ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్​ బదావత్​ సంతోష్​, అడిషనల్​కలెక్టర్​బి.రాహుల్, ఫారెస్ట్ ​ఆఫీసర్ శివ్ ఆశిష్​సింగ్, జడ్పీ సీఈవో నరేందర్ ​హాజరయ్యారు.

ఈ సందర్భంగా జడ్పీ వైస్​ చైర్మన్ ​తొంగల సత్యనారాయణ, లక్సెట్టిపేట జడ్పీటీసీ మెంబర్​ ముత్తె సత్తయ్య తదితరులు జిల్లాలోని సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారుల పనితీరు సరిగా లేదని ఫైర్​అయ్యారు. గ్రామాల్లో నిత్యం కరెంటు పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిషన్​ భగీరథ నీళ్లు చాలాచోట్ల రావడం లేదన్నారు.  

చెరువులు కబ్జా అవుతున్నా పట్టించుకోవట్లే.. 

సత్తయ్యతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో చాలా చోట్ల చెరువులు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్​ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. చెరువులను సర్వే చేయించి ఆక్రమణలను తొలగించాలని, ఎఫ్​టీఎల్​హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​పర్మిషన్లు రాకపోవడం వల్ల అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు.

వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధితో పాటు ఇతర డిపార్ట్​మెంట్లపై వాడివేడిగా చర్చ జరిగింది. చైర్​పర్సన్ ​మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్​అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్లు రిపేర్లు చేసి మిషన్​భగీరథ నీళ్లు ఇంటింటికీ అందేలా చూడాలని ఆదేశించారు.