స్టాఫ్​ లేరు స్కీములు అందయ్​.. అధ్వానంగా ఉద్యాన శాఖ

స్టాఫ్​ లేరు  స్కీములు అందయ్​.. అధ్వానంగా ఉద్యాన శాఖ
  • మెదక్​ జిల్లాలో కూరగాయలు, పండ్ల సాగుకు ప్రోత్సాహం సున్నా

మెదక్, వెలుగు : ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ సరిపడినంత మంది అధికారులు, సిబ్బంది లేక హార్టికల్చర్ డిపార్టుమెంట్​ ద్వారా ఆయా స్కీమ్​ల అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెదక్​ జిల్లాలో డిస్ట్రిక్ట్ హార్టి కల్చర్ ఆఫీసర్ (డీహెచ్​వో)తో పాటు, నియోజక వర్గానికి ఒక హార్టికల్చర్ ఆఫీసర్ (హెచ్​వో), ప్రతి మండలానికి ఒక హార్టికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్ (హెచ్ఈవో ) ఉండాలి. కానీ  జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గ హెచ్​వో లాంగ్ లీవ్ పెట్టారు. ప్రస్తుతం డీహెచ్​వోతో పాటు జిల్లా ఆఫీసులో పనిచేసే ఒక హెచ్​వో, మెదక్ నియోజకవర్గ హెచ్​వో మాత్రమే ఉన్నారు.  వీరిలో మెదక్ హెచ్​వో ఈ నెలలో మెటర్నటీ లీవ్​లో వెళ్లనున్నారు. దీంతో జిల్లా మొత్తానికి కేవలం ఇద్దరే ఉంటారు. గతంలో జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో నలుగురు హెచ్ఈవోలు ఉండేవారు. 

అప్పుడు డిపార్టుమెంట్ ద్వారా ఆయా స్కీమ్ ల అమలులో భాగంగా దరఖాస్తుల పరిశీలన, అర్హులైన రైతుల గుర్తింపు, ఫీల్డ్ విజిట్, ఉద్యాన వన పంటలు సాగు చేసే రైతులకు సలహాలు, సూచనలు కొంత వరకు అందేవి. ఆర్థిక ఇబ్బందులతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని  ప్రభుత్వం వారిని తొలగించింది. 

పెరిగిన పనిభారం..

జిల్లాలో ఇది వరకే వేలాది ఎకరాల్లో పండ్ల తోటలు, వందలాది ఎకరాల్లో కూర గాయ తోటలు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా 1,542 ఎకరాల్లో పండ్ల తోటల పెంపంకం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించింది. అంతేగాక 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకం చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. అయితే తగినంత మంది హార్టికల్చర్ ఆఫీసర్లు, ఫీల్డ్ స్టాఫ్ లేక పోవడంతో ఆయా స్కీమ్ ల అమలుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉన్న ముగ్గురు ఆఫీసర్లు ఇటు ఆఫీస్ బాధ్యతలు చూసుకోవడం, మీటింగ్ లకు హాజరు కావడం, ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు, తోటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడం, ప్రజాప్రతినిధులు, రైతులకు సమాధానాలు ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సేవలు సరిగా అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

ఆ మండలాలను అసలే పట్టించుకోవట్లే!

ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక హార్టికల్చర్ ఆఫీసర్ (హెచ్ వో ) ఉన్నారు. అయితే  గతంలో ఉన్న జిల్లాలను పునర్ వ్యవస్థీకరణ చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా, కొన్ని నియోజకవర్గాల్లోని మండలాలు వేర్వేరు జిల్లాలో ఉన్నాయి. మెదక్ జిల్లాలో ఒక్క మెదక్ నియోజక వర్గంలోని మండలాలు మాత్రమే ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. నర్సాపూర్ నియోజక వర్గంలోని హత్నూర మండలం సంగారెడ్డి జిల్లాలో ఉంది. జిల్లాలోని రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలు సంగారెడ్డి జిల్లాలోని అందోల్  నియోజకవర్గంలో, పెద్ద శంకరం పేట మండలం నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో, చేగుంట, నార్సింగి మండలాలు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల హార్టికల్చర్​ ఆఫీసర్లు ఆ జిల్లా పరిధిలో మాత్రమే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మెదక్ జిల్లాలోని 9 మండలాల రైతులకు హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ సేవలందడం లేదు.