ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చూడాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమ నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. ఈనెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15 వందల బృందాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.250 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్​జిల్లాలోని 468 పంచాయతీల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్​ సిక్తా పట్నాయక్​, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్​ బాపూరావు, అడిషనల్  కలెక్టర్ ఎన్​. నటరాజ్, ట్రైనీ కలెక్టర్​ పి.శ్రీజ, ఆర్డీవో రమేశ్​ రాథోడ్​, డీఆర్​డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆవిష్కరణలు అద్భుతం

గుడిహత్నూర్, వెలుగు: విద్యార్థుల ఆవిష్కరణలు అద్భుతమని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. మంగళవారం ఉట్నూర్ కుమ్రంభీం కాంప్లెక్స్​లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్​కు మంత్రి హాజరయ్యారు. ట్రైబల్​వెల్ఫేర్​స్కూళ్ల విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. గిరిజనులు విద్యతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలన్నారు. అంతకుముందు ఐటీడీఏ పీవో వరుణ్​రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​రాథోడ్‌ జనార్దన్, మాజీ ఎంపీ నగేశ్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిమ గిరిజన సలహా మండలి అధ్యక్షుడు కనక లక్కేరావు, రాష్ట్ర మహిళా కమిషన్‌ మెంబర్ ఈశ్వరీబాయి, ఎంపీపీ జైవంతు రావు, ఐటీడీఏ ఎస్‌డీసీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్‌ దిలీప్‌కుమార్, ఏటీడీవోలు క్రాంతి, నిహారిక, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

జీవో 76 సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

మంచిర్యాల, వెలుగు: సింగరేణి భూముల్లో నివాసం ఉంటున్న వారికి యాజమాన్య హక్కు కల్పించే సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్​ కలెక్టర్​ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, ల్యాండ్​ సర్వే ఏడీ శ్రీనివాస్​, సర్వేయర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఎక్కడ పొరపాట్లు దొర్లకుండా భూముల క్రమబద్ధీకరణ సర్వే పూర్తిచేయాలన్నారు. అర్హులకు పట్టాలు అందేవిధంగా చూడాలన్నారు. 

అలారమ్​ వాచ్​ల అందజేత...  

అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ నాయక్​ తన తండ్రి రాగ్యా నాయక్ జ్ఞాపకార్థం మంగళవారం ఎస్సీ, ఎస్సీ, బీసీ హాస్టళ్ల విద్యార్థుల కోసం 42 అలారమ్​ వాచ్​లు ఇచ్చారు. వాటిని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు ​అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎడ్లబండ్ల పోటీ

కాగజ్ నగర్,వెలుగు: చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో మంగళవారం ఎడ్లబండ్ల పరుగు పందెం నిర్వహించారు. పోటీలను చూసేందుకు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. రైతు నేస్తం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించగా 22 జతల ఎడ్లబండ్లు పోటీపడ్డాయి. ఫస్ట్​ప్లేస్​లో నిలిచిన బండి యజమాని సాయికి అరతులం బంగారం, ద్వితీయ స్థానంలో నిలిచిన బండి యజమాని అక్షయ్​కు నగదు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు

రామకృష్ణాపూర్,వెలుగు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రామకృష్ణాపూర్​తవక్కల్ హైస్కూల్​లో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. స్టూడెంట్లు డ్యాన్స్​లతో సందడి చేశారు. పోటీల్లో గెలుపొందిన పది మందికి తవక్కల్​విద్యా సంస్థల చైర్మన్ ఎండీ అబ్దుల్ అజీజ్ రూ.వెయ్యి చొప్పున నగదు, మిగిలి వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

క్వాలిఫై అయిన వారికి మెయిన్స్​కు అవకాశం ఇవ్వాలి

మంచిర్యాల/బెల్లంపల్లి రూరల్​, వెలుగు: పోలీస్​ సెలక్షన్స్​లో భాగంగా ​ రన్నింగ్​ ఈవెంట్లలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్​కు అవకాశం ఇవ్వాలని యూత్​ కాంగ్రెస్​ రాష్ర్ట అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్​ చేశారు. పోలీస్ ఉద్యోగాల ఎంపికలో జరుగుతున్న అవకతవకలను నిరసిస్తూ మంగళవారం యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి శివసేనారెడ్డి ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోలీసు ఉద్యోగం రాదని మనోవేదనతో నెన్నెలలో ఆత్మహత్య చేసుకున్న పుప్పాల రఘు కుటుంబాన్ని ఆయన పరామర్శించి మాట్లాడారు. ఇప్పటి వరకు  ఉద్యోగం రాలేదని రాష్ట్రంలో 19 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలన్నారు. డీసీసీ చైర్​పర్సన్​ కె.సురేఖ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దీంతో యువతకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. నిరసనలో యూత్ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు సంపత్​రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు మహేందర్, ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్​ బండి  ప్రభాకర్, పార్టీ నెన్నెల అధ్యక్షుడు రమేశ్, బ్లాక్ కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు రాజన్నయాదవ్, లీడర్లు  చిట్ల సత్యనారాయణ, తూముల నరేశ్​, తిరుపతి, రామగిరి బానేశ్, సుర్మిళ్ల వేణు, వేములపల్లి సంజీవ్  తదితరులు పాల్గొన్నారు.  

కుటుంబపాలనకు చరమగీతం పాడాలి

జన్నారం,వెలుగు: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎంపీ, బీజేపీ లీడర్ రమేశ్​రాథోడ్ సూచించారు. మంగళవారం జన్నారంలోని శ్రీలంకకాలనీలో బీజేపీ ‘భరోసా యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. బీజేపీని గెలిపిస్తే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోలి చందు, రోటిగూడ ఎంపీటీసీ కొంతం శంకరయ్య, సీనియర్ లీడర్లు బొంతల మల్లేశ్, బద్రినాయక్, మధుసూదన్​రావు, దాసరి రాజన్న, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్ ఫెయిర్ సంబురం

నిర్మల్,వెలుగు: నిర్మల్​లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ను చూసేందుకు మంగళవారం జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు, టీచర్లు తరలివచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లు ఆలోచింపజేశాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రయోగించిన టెలిస్కోప్ ప్రదర్శన ఆకట్టుకుంది. సైన్స్ సెమినార్ లో విద్యార్థుల ప్రశ్నలకు ప్రొఫెసర్లు సమాధానాలు ఇచ్చారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్​ముషారఫ్​అలీ ఫారూఖీ, డీఈవో రవీందర్​హాజరయ్యారు. బాసర ట్రిపుల్​ఐటీ ప్రొఫెసర్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

విద్యార్థులకు సైన్స్ ఫెయిర్​లు ఎంతో ఉపయోగపడుతాయి...

విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతో ఉపయోగపడుతాయని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిరెల్లి కమలాకర్ రావు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు వారు హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ఎగ్జిబిట్లను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకొని ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారావు, లీడర్లు బారె శ్రీనివాస్, రమేశ్​రెడ్డి, మసియొద్దీన్​ తదితరులు పాల్గొన్నారు.

‘టీబీజీకేఎస్ ​లీడర్లు విమర్శలు మానుకోవాలి’

మందమర్రి,వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారించడంలో విఫలమైన టీబీజీకేఎస్​ లీడర్లు జాతీయ కార్మిక సంఘాలపై విమర్శలు మానుకోవాలని సీఐటీయూ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజ్​గోపాల్ ఫైర్​అయ్యారు. మంగళవారం మందమర్రి ఏరియా కేకే-5 గనిపై నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 11వ వేతన ఒప్పందంలో కనీస వేతన పెరుగుదలపై విమర్శలు చేసే లీడర్లు అలవెన్సులపై ఐటీ మాఫీ, పెటర్నటీ లీవులు ఎందుకు ఇప్పించలేదో చెప్పాలన్నారు. పార్లమెంట్​లో బొగ్గు బ్లాక్​ల వేలం బిల్లుకు మద్దతు పలికిన బీఆర్ఎస్​ ఎంపీలు, కార్మికులను మభ్యపెట్టడం కోసమే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో బొగ్గుబ్లాక్​ల వేలానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. టీబీజీకేఎస్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించడంతోనే కార్మికులకు రావాల్సిన ఇన్​సెంటివ్​లు రావడంలేదన్నారు. కార్యక్రమంలో యూనియన్​ బ్రాంచి ప్రెసిడెంట్​ వెంకటస్వామి, సెక్రటరీ అల్లి రాజేందర్, జడల ప్రవీణ్, పిట్​సెక్రటరీ వెంకటేశ్, శివ, చైతన్యరెడ్డి, తిరుపతి నాయక్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లిలోని తిలక్ స్టేడియంలో వచ్చేనెల చివరివారంలో సింగరేణి లెజెండ్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సీబీసీఐడీ రిటైర్డ్ అడిషనల్ఎస్పీ పులియాల రవికుమార్ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం క్రీడల నిర్వహణను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 30 టీములు హాజరవుతాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.2,500గా నిర్ణయించినట్లు తెలిపారు. వివరాల కోసం సెల్ నెంబర్ 7702913247, 9849248686 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో టోర్నీ సెక్రటరీ ఎండీ అజ్గర్ పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీలు జాఫర్, దిలీప్ కుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.