- మండలానికో గ్రామంలో లాంఛనంగా లబ్ధిదారులకు పత్రాలు
- ఏర్పాట్లు చేసిన అధికారులు
- కామారెడ్డి జిల్లాలో 22, నిజామాబాద్‌లో 31 గ్రామాల్లో
కామారెడ్డి / నిజామాబాద్, వెలుగు : రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ స్కీమ్‌లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు జిల్లాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, అర్హులను ప్రకటించి, పథకాల అర్హత పత్రాలను అందిస్తారు. వీటి కోసం దీంతో 250 నుంచి 400 ఇండ్లు ఉన్న గ్రామాలను కలెక్టర్లు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో 22 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు.
బాన్సువాడ మండలంలో చిన్న నాగారం, భిక్కనూరులో ర్యాగట్లపల్లి, బీబీపేటలో ఉప్పర్‌పల్లి, బిచ్కుంద మండలంలో గుండెకల్లూర్, బీర్కుర్ మండలంలో రైతునగర్, దోమకొండలో సీతరాంపల్లి, గాంధారిలో బ్రహ్మన్‌పల్లి, జుక్కల్ మండలంలో లోన్గావ్, కామారెడ్డిలో గూడెం, లింగంపేటలో ఎల్లారం, మాచారెడ్డి మండలంలో రాజ్‌ఖాన్‌పేట, మద్నూర్‌లో రోసెగావ్, నాగిరెడ్డిపేటలో అచ్చయపల్లి, నస్రుల్లాబాద్ మండలంలో రాములు గుట్టతండా, నిజాంసాగర్‌లో సుల్తాన్‌నగర్, పెద్దకొడప్గల్లో చిన్న తక్కడపల్లి, పిట్లం మండలంలో కిష్టాపూర్, రాజంపేటలో నడిమితండా, రామారెడ్డిలో కన్నాపూర్ తండా, సదాశివనగర్ మండలంలో వజ్జేపల్లి ఖుర్ధు, తాడ్వాయిలో సంతాయిపేట, ఎల్లారెడ్డిలో మల్లాయపల్లి తో పాటు శివార్ రాంరెడ్డి పల్లి, బంగరు పల్లి, హస్తినపూర్ గ్రామాల్లో పథకాలను ప్రారంభిస్తారు.
అర్హుల లిస్టును 21నుంచి 24 వరకు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో చదివి వినిపించారు. ఆదివారం లాంఛనంగా ప్రారంభించే గ్రామాల్లో ఆయా పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు పత్రాలు అందిస్తారు. ఒక్కో స్కీమ్‌కు సంబంధించి ఒక్కో అధికారిని నియమించారు. రేషన్ కార్డులకు తహసీల్దార్లు, ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీలు, రైతు భరోసాకు వ్యవసాయ అధికారి, ఆత్మీయ భరోసాకు ఉపాధిహామీకు స్కీమ్ ఏపీవోలు బాధ్యత వహిస్తున్నారు.
జాబితాల్లో పేర్లు రాలేని వారు మళ్లీ దరఖాస్తు చసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ గ్రామ సభల్లో జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, పాత వాటిలో మార్పులు, చేర్పుల కోసం 54,534, ఇందిరమ్మ ఇండ్ల కోసం 28,653, రైతు భరోసాకు 2,653, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 18,098 ధరఖాస్తులు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ అర్బన్‌లో అంతర్భాగమైన సౌత్, నార్త్ రెవెన్యూ మండలాలు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు మినహాయించి మిగితా 31 మండలాల్లోని ఒక విలేజ్‌లో లబ్దిదారులందరికీ స్కీంలను పంపిణీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన సాలూరా, పోతంగల్, డొంకేశ్వర్, ఆలూర్ మండలాల గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. గ్రామ సభల్లో ఆమోదం పొందిన పేర్లకు, కొత్త దరఖాస్తులలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తంకాని వ్యక్తులకు పథకాలు అందనున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పథకాల పంపిణీ చేపట్టనున్నారు.
కొత్త దరఖాస్తులు1.48 లక్షలు ..
జిల్లాలో 691 గ్రామ/వార్డు సభల ద్వారా నాలుగు స్కీంల కోసం వచ్చిన కొత్త అప్లికేషన్ సంఖ్యపై శనివారం స్పష్టత వచ్చింది. రైతు భరోసాకు 1,626, రేషన్ కార్డులకు అత్యధికంగా 83,997, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 19,423, ఇందిరమ్మ ఇండ్ల కోసం 43,182 కలిపి టోటల్ 1,48,228 దరఖాస్తులు అందాయి.
సెలెక్ట్ చేసిన విలేజ్‌లు : మిర్దాపల్లి, కోమన్‌పల్లి, జలాల్పూర్, లింగాపూర్,లంగ్డాపూర్, ఘన్పూర్, సీతాయిపేట, కమలాపూర్, గంగాసముందర్, అన్సాన్పల్లి, నారాయణ్‌పేట, నాగాపూర్, అడ్కాస్పల్లి, ముల్లంగి, కొడిచర్ల, దోన్పాల్, తిమ్మాపూర్, నర్సింగ్‌పల్లి, వేంపల్లి, మల్లారం, సిరన్‌పల్లి, మల్కాపూర్ (ఏ), సోంపూర్, నీలాపేపర్ మిల్లు, బొప్పాపూర్ , తగ్గెల్లి, చిన్నవాల్గోట్, పోచంపల్లి , మల్లారం, జైతాపూర్, దోంచందాను ఎంపిక చేశారు.