అమ్మ ఆదర్శ పనులపైనే సర్కారు బడి ఆశలు

  • అమ్మ ఆదర్శ కమిటీల పనుల్లో పురోగతి
  • ఫండ్స్​లేక మధ్యలోనే ఆగిపోయిన మన ఊరు–మనబడి పనులు
  • 13 రోజుల్లో ప్రారంభం కానున్న సర్కార్​ బడులు
  • మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

మహబూబాబాద్, వెలుగు : రాష్ర్ట ​ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతి పనులపైనే సర్కారు బడుల ఆశలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు–మనబడి కార్యక్రమం ఫండ్స్​లేకపోవడంతో మధ్యలోనే పనులు ఆగిపోవడంతో ఈ ఏడాది విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని అనుకున్నారు. కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొంతమేరకు పురోగతి కనిపిస్తుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి.

మహబూబాబాద్​జిల్లాలో 438 స్కూల్స్​ను అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేశారు. 432 చోట్ల పనులు ప్రగతి దశలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కనీస అవసరాలైన తాగు నీరు, హ్యండ్ వాష్, టాయిలెట్స్, ఫంక్షనింగ్, ఫర్నిచర్ రిపేర్, స్కూల్స్​లో సంపులు, మైనర్ రిపేర్లు, విద్యుత్ కనెక్షన్ ఉండేలా చర్యలు
చేపడుతున్నారు.

సమన్వయం కరువు..

గతంలో మన ఊరు–మన బడి స్కీమ్​లో పనుల నిర్వహణ బాధ్యతలను వేర్వేరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో  నిర్వహించారు. పాఠశాల విద్యాకమిటీ ఆధ్వర్యంలో కొత్త తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, కరెంట్, డైనింగ్ హాళ్ల పనులు చేపట్టగా, ఈజీఎస్ శాఖ ద్వారా మరుగు దొడ్లు, మధ్యాహ్నభోజనం నిర్వహణకు వంట గదులు, ప్రహరీ నిర్మాణం చేపట్టారు. 

ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతి గదులు, ఫర్నిచర్, స్కూల్స్ పేయింటింగ్, కలర్ బోర్డులు ఏర్పాటు చేపట్టారు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలో మొత్తంగా 898 స్కూల్స్​లో ఈ కార్యక్రమంలో 316 స్కూల్స్ ఎంపిక కాగా, కేవలం 42 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఆయా పనుల నిర్వహణకు రూ.89 కోట్లు మంజూరు చేయగా, రూ.60 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మిగిలిన చోట్ల పనులు నిలిచిపోయాయి.  

బిల్లులు పెండింగ్..​

తొర్రూరు హైస్కూల్లో మన ఊరు–మనబడి ప్రోగ్రాంలో రూ.58 లక్షలతో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్ నిర్మాణం పనులు మంజూరయ్యాయి . రూ.30 లక్షల విలువ చేసే పనులు పూర్తి చేసినప్పటికీ, బిల్లులు సాంక్షన్ కాకపోవడంతో పనులు నిలిపి వేసినట్టు కాంట్రాక్టర్ తెలిపారు.నర్సింహులపేట హై స్కూల్లో మనఊరు–మనబడిలో భాగంగా మొత్తం  రూ.34లక్షలకు  కాంట్రాక్టర్ వర్క్ చేయగా, ఇప్పటివరకు  రూ.11లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయడం లేదు. రెండు రోజుల కింద కలెక్టర్ జిల్లాలోని కాంట్రాక్టర్లను పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టారు. మొత్తం బిల్లులు చెల్లించాలని లేకుంటే వర్కులు చేయమని చెప్పినట్లు సమాచారం.

పనులను వెంటనే పూర్తి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న డెవలప్​మెంట్ పనులు సత్వరం పూర్తి చేయాలి. గతంలో మన ఊరు–మన బడిలో ఎంపికైన పనులు, ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులు మొత్తంగా పాఠశాలల పునః ప్రారంభానికి ముందుగా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం బిల్లుల చెల్లింపుల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నాం. 

రామారావు, డీఈవో, మహబూబాబాద్