
- ఇండ్లకు పోయి ఐదు గంటలకే లేపుతున్న సర్కారు టీచర్లు
- ‘అడ్డగుట్ట’ టీచర్ల వినూత్న ప్రయత్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు : అడ్డగుట్ట ప్రాంతంలోని గవర్నమెంట్ హైస్కూల్ టీచర్లు టెన్త్ క్లాసులో మంచి రిజల్ట్ సాధించేందుకు స్టూడెంట్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. స్కూల్ లో స్పెషల్ క్లాసులు నిర్వహించడం, రివిజన్ చేయించడమే కాకుండా ఉదయం ఐదు గంటలకే స్టూడెంట్స్ ఇండ్లకు వెళ్లి నిద్రలేపి మరీ చదివిస్తున్నారు.
20 రోజులే సమయం..
అడ్డగుట్ట గవర్నమెంట్ స్కూల్లో 22 మంది టీచర్లు ఉండగా, వీరిలో10 మంది రోజూ ఉదయం ఐదు గంటలకు వివిధ బస్తీల్లో ఉంటున్న తమ 73 మంది స్టూడెంట్స్ ఇండ్లకు వెళ్లి నిద్రలేపుతున్నారు. ఒక్కో టీచర్ ఐదారుగురి ఇండ్లకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా రాని పక్షంలో పేరెంట్స్కు కాల్చేసి పిల్లల్ని లేపి చదివించాలని కోరుతున్నారు.
ఆ స్టూడెంట్లపైనే ఫోకస్
అడ్డగుట్టలో ఎక్కువ శాతం మంది పేద ప్రజలే ఉంటారు. వీరంతా చిన్నచితక పనులు చేసుకుంటారు. ఉదయం ఎవరి పనులకు వారు వెళ్తే సాయంత్రం, రాత్రి వేళ ఇండ్లకు వస్తారు. దీంతో పిల్లలు చదువుతున్నారా లేదా? స్కూల్కు వెళ్తున్నారా లేదా? అని పట్టించుకునే సమయం వారికుండదు. దీంతో ఇర్రెగ్యులర్, స్లో లర్నర్స్ఎక్కువగా ఉంటారు. దీంతో ఇలాంటి పిల్లలపై టీచర్లు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.
90 శాతం రిజల్ట్ సాధించేలా...
లాస్టియర్ టెన్త్ క్లాసులో మా స్కూల్ 70 శాతం రిజల్ట్ సాధించింది. ఈ పర్సంటేజీని ఈ ఏడాది 90 శాతానికి పెంచాలని అనుకుంటున్నాం. అందుకు అనుగుణంగా పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ప్రస్తుతం 9వ తరగతి స్టూడెంట్స్ పై కూడా దృష్టి పెట్టాం. వచ్చే ఏడాది కోసం వారిని కూడా సన్నద్ధం చేస్తున్నాం.
- మదన్ మోహన్ రెడ్డి, అడ్డగుట్ట స్కూల్ హెచ్ఎం